తిరుమ‌ల‌లో వీఐపీ ద‌ర్శ‌న స‌మ‌యం మార్పు!

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని ద‌ర్శించుకోవాల‌ని ప్ర‌తి హిందువూ కోరుకుంటారు. ఆయా వ్య‌క్తుల ప‌లుకుబ‌డిని బ‌ట్టి ప‌లు ర‌కాల ద‌ర్శ‌నం చేసుకుంటుంటారు. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేయాల‌ని టీటీడీ…

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని ద‌ర్శించుకోవాల‌ని ప్ర‌తి హిందువూ కోరుకుంటారు. ఆయా వ్య‌క్తుల ప‌లుకుబ‌డిని బ‌ట్టి ప‌లు ర‌కాల ద‌ర్శ‌నం చేసుకుంటుంటారు. ఈ నేప‌థ్యంలో తిరుమ‌ల‌లో సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేయాల‌ని టీటీడీ పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇవాళ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి స‌మావేశమైంది.

సామాన్య భ‌క్తుల‌కు ప్రాధాన్యం క‌ల్పిస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇందులో భాగంగా వీఐపీ ద‌ర్శ‌న స‌మ‌యాన్ని ఉద‌యం 10 నుంచి 12 గంట‌ల మ‌ధ్య ఉండేలా టీటీడీ పాల‌క మండ‌లి స‌మావేశంలో తీర్మానించారు. ఇంత వ‌ర‌కూ ప్రొటోకాల్‌, శ్రీ‌వాణి, వీఐపీ ద‌ర్శ‌నాలు, ఆర్జిత సేవ‌లను ఉద‌యాన్నే కొన‌సాగించేవారు. వీటి త‌ర్వాతే సామాన్య భ‌క్తుల‌కు  స‌ర్వ ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించే వాళ్లు.

టీటీడీ పాల‌క మండ‌లి తాజా నిర్ణ‌యంతో ఉద‌యాన్నే సామాన్య భ‌క్తుల‌కు క‌లియుగ దైవం ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పించ‌నున్నారు. బ్ర‌హ్మోత్స‌వాల త‌ర్వాత ఈ నిర్ణ‌యం అమ‌లు కానుంది. క‌రోనా కార‌ణంగా రెండేళ్ల పాటు తిరుమ‌ల‌లో శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఆల‌యం వెలుప‌ల నిర్వ‌హించ‌ని సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల త‌ర్వాత తాజాగా ఆల‌యం వెలుప‌ల బ్ర‌హ్మోత్స‌వాల‌ను నిర్వ‌హించ నున్నారు.

బ్ర‌హ్మోత్స‌వాల్లో కూడా వీఐపీ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దు చేసి సామాన్య భ‌క్తుల‌కు పెద్ద‌పీట వేయాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. బ్ర‌హ్మోత్స‌వాల అనంత‌రం వీఐపీ ద‌ర్శ‌నం ఉద‌యం 10 నుంచి 12 గంట‌ల మ‌ధ్య మార్పున‌కు పాల‌క మండ‌లి నిర్ణ‌యం తీసుకోవ‌డం అభినంద‌న‌లు అందుకుంటోంది.