తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశమైంది. గత 20 ఏళ్లుగా నలుగుతున్న ఓ అంశంపై వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని పాలక మండలి భక్తులకు ప్రయోజనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు ఇక మీదట తిరుపతిలోనే గదులు కేటాయించాలని ఇవాళ్టి పాలక మండలి సమావేశంలో తీర్మానించారు.
తిరుమలలో ఉన్న సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ (సీఆర్వో)ను తిరుపతికి మార్చనున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ఈ మార్పు చోటు చేసుకోనుంది. ఇది చాలా మంచి నిర్ణయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే భక్తులు తిరుమలకు వెళ్లిన తర్వాత గదులు దొరక్క నానా ఇబ్బందులు పడుతుంటారు. తిరుమలకు వెళ్లిన తర్వాత ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అక్కడే గడిపి, ఆ కలియుగ దైవాన్ని దర్శించుకుని వస్తుంటారు.
భక్తుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్న పాలక మండలి, వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. గత 20 ఏళ్లుగా గదుల కేటాయింపు తిరుపతి నుంచే చేపట్టాలనే డిమాండ్లు భక్తుల నుంచి వస్తున్నాయి. కానీ ఏ పాలక మండలి ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుత పాలక మండలి ఓ అడుగు ముందుకేసింది. తిరుమల భక్తులకు తిరుపతిలో గదులు కేటాయింపు నిర్ణయం ద్వారా అనేక ప్రయోజనాలున్నాయి.
ఒకవేళ తిరుమలలో రూం దొరక్కపోతే, ఆ ఏర్పాటును తిరుపతిలో చూసుకునే అవకాశం వుంటుంది. దర్శనం సమయానికి తీరిగ్గా తిరుపతి నుంచి వెళ్లొచ్చు. టీటీడీ తాజా నిర్ణయంతో తిరుపతిలో హోటళ్లకు డిమాండ్ ఏర్పడనుంది. సీఆర్వోను తిరుపతికి మార్చాలనే నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.