రాజకీయ తెర, వెండితెర ఒకటే అనుకున్నట్టున్నారు టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ. ఆయన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజకీయాలంటే టైమ్ పాస్‌గా భావించే బాలయ్య… ఇంకా వెండితెర మూడ్ నుంచి బయటకు రాలేదు. సినీ డైలాగ్‌లతో సీఎం జగన్‌తో పాటు ప్రత్యర్థులను భయపెట్టాలని భావిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ సందర్భంగా బాలయ్య డైలాగ్‌లను ప్రస్తావిస్తూ… తాజాగా నందమూరి హీరో ట్వీట్ డైలాగ్‌ల్లో కొత్తదనం లేదని విమర్శిస్తున్నారు.
‘మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ అన్నది పేరుకాదు.. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగు జాతి వెన్నెముక.. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసం లేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయ్.. శునకాల ముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు’’ అని బాలయ్య సోషల్ మీడియాలో ఘాటు పోస్టు పెట్టారు.
ఈ సందర్భంగా నెటిజన్లు బాలయ్య పాపులర్ డైలాగ్స్‌ను తెరపైకి తేవడం గమనార్హం. ‘నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్’, ‘సమయం లేదు మిత్రమా…శరణమా? రణమా? ’, ‘ప్లూటు జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు’, ‘నేను ఎదురొచ్చినా నీకే రిస్క్. నాకెదురొచ్చినా నీకే రిస్క్’, ‘ సీటు కాదు, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను’, ‘నీకు బీపీ వస్తే నీ పీఏ భయపడతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీనే వణుకుతుంది’, ‘ బెదిరిస్తే వినడానికి నేను ఓటరును అనుకున్నావా బే, షూటర్‌ను. కాల్చి పారేస్తా నా కొడకా’ తదితర డైలాగ్స్ చెప్పినట్టుగానే, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై బాలయ్య సినిమాటిక్‌గా స్పందించినట్టుగా వుందని నెటిజన్లు వెటకరిస్తున్నారు.
చంద్రబాబు, లోకేశ్‌లను మెప్పించడానికి బాలయ్య సోషల్ మీడియాలో పోస్టు పెట్టినట్టే ఉంది తప్ప, అందులో చిత్తశుద్ధి కనబడడం లేదనే విమర్శలొస్తున్నాయి. ప్లూటు చంద్రబాబు ముందు ఊదు…జగన్ ముందు కాదు అని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు బాలయ్యకు ఘాటైన కౌంటర్ ఇవ్వడం విశేషం. వెండితెరపై తొడలు కొట్టినట్టు, మీసాలు తిప్పినట్టు, విలన్లపై డైలాగ్‌లు చెప్పినట్టు, రాజకీయాల్లో చేస్తామంటే కుదరదని నెటిజన్లు హితవు చెబుతుండడం గమనార్హం.