రాజధాని ఎంత కావాలని కోరుకున్నా ఇలా రా అంటే వచ్చేయదు. పైగా అవతల వైపు గట్టిగా ఉండి పోరాడుతున్నారు. అంతే కాదు పాదయాత్రలు వంటివి నిర్వహించి దూకుడు చేస్తున్నారు. మెత్తగా మెతగ్గా ఉంటే అక్కడ ఏమంత సీన్ లేదని తేల్చేస్తారు. దాంతో చేయాల్సింది ఇటు వైపూ చేయాలి.
అందుకే ఇప్పటిదాకా మీడియా ముఖంగా జరుగుతున్న యుద్ధం కాస్తా ఇపుడు నెమ్మదిగా గ్రౌండ్ లెవెల్ లోకి వస్తోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రా జిల్లాలలో విద్యార్ధి జేఏసీ సమావేశాలు ర్యాలీలు మానవహారాలు నిర్వహించి ఎంతో కొంత విశాఖ రాజధాని అనుకూల గాలిని సృష్టించింది.
ఇపుడు కాగల కార్యం అన్నట్లుగా ఒక రౌండ్ టేబిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం ఉంది. అయితే షరతు మాత్రం విశాఖ రాజధానికి మద్దతు ఇచ్చేవారికే. అంటే టీడీపీ జనసేన, బీజేపీ వామపక్షాలు ఎటూ తమ అమరావతి రాజధాని స్టాండ్ మార్చుకుని ఆ వైపుగా వెళ్ళేది లేదు.
ఈ రౌండ్ టేబిల్ సమావేశంలో మేధావులు, విద్యావేత్తలు, విద్యార్ధులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటు ఉత్తరాంధ్రా వెనకబాటుతనం పోవాలని ఆందోళన చేసే ప్రముఖులు కూడా భాగస్వాములు అవుతారు అని తెలుస్తోంది. ఈ రౌండ్ టేబిల్ సమావేశానికి వైసీపీ నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు హాజరవుతారని చెబుతున్నారు.
ఈ రౌండ్ టేబిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దశలవారీగా విశాఖ రాజధాని కోసం పోరాటం చేయడానికి అవసరమైన యాక్షన్ ప్లాన్ ని రోడ్ మ్యాప్ ని కూడా సిద్ధం చేస్తారని చెబుతున్నారు. విశాఖ రాజధానిగా ఉండాలంటూ జరిగే ఈ రౌండ్ టేబిల్ సమావేశం తీసుకునే నిర్ణయాల ప్రభావం అమరావతి రైతుల పాదయాత్ర మీద ఎంత వరకూ ఉండబోతోందో చూడాలి.