యువ‌నాయ‌కుడి ఉత్తుత్తి రంకెలు!

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేశ్ ప్ర‌తిరోజూ ఉత్తుత్తి రంకెలు వేయ‌డ‌మే త‌ప్ప ఆచ‌ర‌ణ శూన్యం. అది చేస్తాం, ఇది చేస్తామ‌ని లోకేశ్ హెచ్చ‌రిక‌ల‌కే ప‌రిమితం అయ్యార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాజ‌కీయాల్లో నిత్యం ఏదో…

టీడీపీ యువ నాయ‌కుడు నారా లోకేశ్ ప్ర‌తిరోజూ ఉత్తుత్తి రంకెలు వేయ‌డ‌మే త‌ప్ప ఆచ‌ర‌ణ శూన్యం. అది చేస్తాం, ఇది చేస్తామ‌ని లోకేశ్ హెచ్చ‌రిక‌ల‌కే ప‌రిమితం అయ్యార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. రాజ‌కీయాల్లో నిత్యం ఏదో ఒక‌టి జ‌రుగుతూనే వుంటుంది. వాటిలో ఏదో ఒక‌టి తీసుకుని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు పెట్ట‌డంతో త‌న బాధ్య‌త తీరిపోయింద‌ని నారా లోకేశ్ భావిస్తున్న‌ట్టున్నారు.

తాజాగా కొంత మంది పోలీస్ అధికారుల‌ను లోకేశ్ హెచ్చ‌రిస్తూ ట్విట‌ర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఒక జ‌ర్న‌లిస్ట్‌ను సీఐడీ అరెస్ట్ చేయ‌డం, 41ఏ నోటీసులు ఇవ్వ‌కుండా అదుపులోకి తీసుకోవ‌డంపై న్యాయ‌స్థానం ఆగ్ర‌హించింద‌నే వార్త‌ల నేప‌థ్యంలో లోకేశ్ వ‌రుస ట్వీట్లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఆ ట్వీట్ల సారాంశం ఏంటో చూద్దాం.

‘తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారులను జైలుకు తీసుకెళ్లాడు. తన హయాంలో ఐఏఎస్‌లతో పాటు ఐపీఎస్‌లతో సహా పలువురు పోలీస్ అధికారులను జైలు పాలు చెయ్యబోతున్నాడు జగన్ రెడ్డి. కొంతమంది అధికారులు తాత్కాలిక ప్రయోజనాల కోసం జగన్ రెడ్డి ట్రాప్‌లో పడి కెరియర్‌ని నాశనం చేసుకుంటున్నారు. పదే పదే కోర్టు మొట్టికాయలు వేస్తున్నా అధికారులు తీరు మారడం లేదు. గీత దాటి ప్రవర్తిస్తున్న వారంతా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడంతో పాటు ఎందుకు తప్పు చేశాం అని జీవితాంతం బాధపడటం ఖాయం’ అని లోకేశ్ హెచ్చ‌రించ‌డం విశేషం.

2024లో తామే అధికారంలోకి వ‌స్తామ‌ని, త‌మ‌కు వ్య‌తిరేకంగా ప‌ని చేసిన పోలీస్ అధికారులను జైళ్ల‌లో వేస్తామ‌ని లోకేశ్ ప‌రోక్షంగా హెచ్చ‌రిస్తున్నారు. ఇలాంటి ట్వీట్ల‌తో అధికారుల్లో భ‌యం పుట్టించి, రాజ‌కీయంగా సొమ్ము చేసుకోవాల‌నే తాప‌త్ర‌యాన్ని చూడొచ్చు. అయితే లోకేశ్ హెచ్చ‌రిక‌ల‌కు భ‌య‌ప‌డే పోలీస్ అధికారులు ఉన్నారా? అనేదే ప్ర‌శ్న‌. బ్లాక్ మెయిల్ చేసి లొంగ‌దీసుకోవ‌డ‌మే లోకేశ్ ముందున్న ఏకైక ప్ర‌త్యామ్నాయ‌మ‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. అరిచే వాళ్లెప్పుడూ ఏమీ చేయ‌లేర‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.