Advertisement

Advertisement


Home > Politics - Analysis

కుప్పంలో బాబును ఓటమి భయం వెంటాడుతోందా?

కుప్పంలో బాబును ఓటమి భయం వెంటాడుతోందా?

మన దేశంలో అసెంబ్లీ ఎన్నికల్లోనైనా, లోక్ సభ ఎన్నికల్లోనైనా ఒకటికంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం కొత్తకాదు. ఇలా పోటీ చేయడాన్ని నిరోధించాలని కొందరు డిమాండ్ చేస్తున్నా అది కార్యాచరణలోకి రాలేదు. ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి సత్తా చాటాలని కొందరు అనుకుంటే, కొందరు నాయకులు ఓటమి భయంతో ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారు. 

ఒకచోట ఓడిపోయినా మరోచోట గెలుస్తామని ఆశ. ఉమ్మడి ఏపీలో చాలామంది నాయకులు ఇలా బహుళ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఏపీలో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.

వచ్చే ఎన్నికల్లో ఇలా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. ఆయన ఇలా పోటీ చేయాలని అనుకోవడానికి కారణం సత్తా చాటుకోవడానికి కాదు. ఓటమి భయమే ఇందుకు కారణమట. వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీని ఓడించి మళ్ళీ తానే అధికారంలోకి వస్తానని బాబు భీకర ప్రతిజ్ఞ చేశారు కదా. 

ఇక జగన్ పని అయిపోయిందని అంటున్నారు కదా. పైకి ఇలా మేకపోతు గాంభీర్యం ప్రకటనలు చేస్తున్నప్పటికీ లోపల తన కంచుకోట అయిన కుప్పంలో ఓడిపోతానేమో అనే అనుమానం పీకుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పర్యటన.. తెలుగుదేశం పార్టీలో గుబులు కలిగిస్తోంది.

దశాబ్దాలుగా చంద్రబాబు, టీడీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఈ నియోజకవర్గంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిన తరువాత అనూహ్య పరిణామాలు కలిగే అవకాశాలు కనబడుతున్నాయి.  ఇదివరకే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఝలక్ ఇచ్చింది వైసీపీ. అప్పటినుంచే బాబుకు భయం పట్టుకుంది. తాజాగా కుప్పం అనిమిగానిపల్లిలో వైఎస్ జగన్ నిర్వహించిన సభ గ్రాండ్ సక్సెస్ అయిందని వైఎస్ఆర్సీపీ నాయకులు సంతోషంగా ఉన్నారు.  ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత వైఎస్ జగన్ తొలిసారిగా చంద్రబాబు గడ్డపై అడుగు పెట్టడం, వైఎస్సార్ చేయూత పథకం కింద ఏకంగా 4,949.44 కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జోష్ నింపింది. 

66 కోట్ల రూపాయల విలువ చేసే పనులకు శంకుస్థాపన చేయడం, పలు వరాలను ప్రకటించడం కుప్పం ఓటర్లను ఆకట్టుకుందని, వారంతా తమ వైపే ఉన్నారనడానికి జగన్ సభకు తరలివచ్చిన జన ప్రవాహమే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ చెబుతోంది. 2024 నాటి సార్వత్రిక ఎన్నికలను ఇదే దూకుడుతో ఎదుర్కొంటామని వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు తేల్చి చెబుతున్నారు. చంద్రబాబుకు ఇక ఓటమి తప్పదని జోస్యం చెబుతున్నారు. 

వైఎస్ జగన్ కూడా లోకల్-నాన్ లోకల్ అంశాన్ని తెరమీదికి తీసుకుని రావడం కూడా చంద్రబాబుకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను కల్పించే అవకాశాలు లేకపోలేదు. చంద్రబాబు హైదరాబాద్‌కు లోకల్ అని- కుప్పానికి నాన్ లోకల్ అంటూ బహిరంగ సభ వేదికగా జగన్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు చంద్రబాబును పునరాలోచనలో పడినట్టే చేశాయనే అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతోందని అంటున్నారు. 

జగన్ సభను చూసిన తరువాత.. ఇక చంద్రబాబు కుప్పంతో పాటు మరో నియోజకవర్గంలోనూ పోటీ చేయడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వాదనలు చిత్తూరు జిల్లా రాజకీయాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. తన రెండో నియోజకవర్గం కోసం చంద్రబాబు ఇదివరకే అన్వేషణ మొదలు పెట్టారని చెబుతున్నారు. 

అనంతపురం జిల్లా కల్యాణదుర్గాన్ని రెండో నియోజకవర్గంగా ఎంచుకున్నారనే ప్రచారం ఉంది. అనంతపురం జిల్లాపై తెలుగుదేశం పార్టీకి ముందు నుంచీ గట్టిపట్టు ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2014లో టీడీపీ 11 చోట్ల విజయఢంకా మోగించింది. అప్పట్లో కదిరి, ఉరవకొండ మాత్రమే ఓడిపోయింది. 2019లో పరిస్థితి తలకిందులైనప్పటికీ.. పట్టు మాత్రం పోగొట్టుకోలేదు.

కళ్యాణదుర్గం నుంచి చంద్రబాబు, పొరుగునే ఉన్న హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ పోటీకి దిగితే- దాని ప్రభావం అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలపై ఉంటుందని, అభ్యర్థులను గెలిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. తొలుత కల్యాణదుర్గం నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని భావించినప్పటికీ- ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అదే స్థానం నుంచి తాను పోటీ చేసేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని నాయకులు  చెబుతున్నారు. రాబోయే రోజుల్లో బాబు ఏం చేయబోతున్నారనే దానిపై క్లారిటీ వస్తుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?