75 సంవత్సరాల వయసు దాటిన వారెవరూ కీలకమైన పదవుల్లో ఉండకూడదు అంటూ భారతీయ జనతా పార్టీ ఒక రూల్ పెట్టుకుంది.ఈ రూల్ ఎందుకు వచ్చింది అనేది మోడీ, అమిత్ షాలకే తెలియాలి. దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. భారత రాజకీయాల్లో డెబ్బైఐదేళ్ల వయసును పెద్దవయసు అని ఎవరూ అనుకోరు! ఎందుకంటే దేశంలో చాలామంది రాజకీయ నేతలకు అవకాశాలు వచ్చిందే 75 పై బడ్డాకా! ఆ వయసు దాటాకా దేశానికి తొలిసారి ప్రధానమంత్రి అయినవారు, వివిధ రాష్ట్రాలకు మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వారు బోలెడంత మంది ఉన్నారు.
అయితే డెబ్బైఐదు దాటితే ఎలాంటి కీలకమైన పదవుల్లో ఉండకూడదని మోడీ, అమిత్ షాల జమానాలో రూల్ వచ్చింది. ఈ మేరకు అనేకమంది సీనియర్ నేతలను తప్పించారు. ఇటీవలి ఎన్నికల్లో అయితే ఆ వయసు వారికి ఎంపీ టికెట్లు కూడా ఇవ్వలేదు! ఇలాంటి నేపథ్యంలో కర్ణాటకలో ఇప్పుడు యడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నంలో ఉన్నారు. రాజకీయ సంక్షోభంలో కూడా యడ్యూరప్పకు ఇంకా సీఎం సీటు మీద ఆశపోలేదని స్పష్టం అవుతోంది. అయితే ఆయన వయసు ఇప్పటికే డెబ్బైఐదు దాటింది.
ఆయనకు డెబ్బై ఆరేళ్లు ఇప్పుడు. ఈ నేపథ్యంలో ఆయనే మరోసారి సీఎం కావాలనే ప్రయత్నంలో ఉన్నారు. మరి దీనికి కమలం పార్టీ అధిష్టానం పచ్చజెండా ఊపక తప్పకపోవచ్చు. అలా గ్రీన్ సిగ్నల్ ఇస్తే తమ నియమానికి మోడీ, షాలు తామే విలువ ఇవ్వనట్టు అవుతుంది.
రాజకీయం కోసం ఒక్కోరి విషయంలో ఒక్కోలా వ్యవహరించినట్టుగా అవుతుంది. ఒకవేళ తనకు సీఎం పీఠాన్ని అప్పగించకపోతే యడ్యూరప్ప పార్టీలో సంక్షోభాన్ని లేవదీయగల సమర్థుడే! దీంతో ఆయనకు మోడీ, షాలు ఇప్పుడు అవకాశం ఇవ్వక తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.