దళితులను కేసీఆర్ అవమానించారా ? 

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను (ఎస్సీలను ) అవమానించారా ? దళితబంధుపై ఓ పక్క విమర్శలు, వివాదాలు చెలరేగుతుంటే, మరో పక్క దళితబంధు అనే పేరే తప్పని, అది దళితులను అవమానించే విధంగా ఉందని…

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను (ఎస్సీలను ) అవమానించారా ? దళితబంధుపై ఓ పక్క విమర్శలు, వివాదాలు చెలరేగుతుంటే, మరో పక్క దళితబంధు అనే పేరే తప్పని, అది దళితులను అవమానించే విధంగా ఉందని మాల సంక్షేమ సంఘం ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ తెలంగాణా ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఇప్పుడు దీనికి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే మీడియాలో జనాల్లో పాపులర్ అయిన దళితబంధు పేరు ప్రభుత్వం మారుస్తుందా ? మారిస్తే ఏ విధంగా మారుస్తుంది అనే చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘దళిత బంధు’ పేరుపై అభ్యంతరాలు వచ్చాయి. ‘దళిత’ స్థానంలో ‘అంబేద్కర్’ పదాన్ని వినియోగించాలని మాల సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. 

జాతీయ ఎస్సీ కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనితో తెలంగాణ సర్కార్‌కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటిసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌ను కోరింది.‘దళిత’ పదానికి ‘అంటరానివారు’, ‘నిస్సహాయులు’, ‘తక్కువవారు’ అనే అర్ధాలున్నాయని రామ్ ప్రసాద్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాబట్టి ఆ పేరుకు బదులుగా అంబేద్కర్ పదాన్ని వాడాలని.. పథకం పేరు ‘అంబేడ్కర్ బంధు’ అని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ‘దళిత’ అనే పదంపై చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. 

రెండేళ్ల క్రితం బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్ బెంచ్.. టీవీ ఛానెళ్లు ‘దళిత’ అనే పదానికి బదులుగా షెడ్యుల్ కాస్ట్ పదాన్ని ఉపయోగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ‘దళిత్’కు బదులు షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి’ అని పేర్కొవాలంటూ కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పట్లో సర్క్యులర్లు జారీ చేసింది. అయితే ఇంగ్లిష్ దినపత్రికల్లో దళిత్ అనే పదాన్ని ఇప్పటికీ ఉపయోగిస్తూనే ఉన్నారు. 

మహా దళిత్ అనే పదం ఉత్తర భారత దేశంలో ప్రచారంలో ఉంది. రాజకీయ నాయకులు కూడా దళిత్ అనే పదాన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ లలో. ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్లలో మాత్రం షెడ్యూల్  కులాలు అని వాడుతున్నారు. ‘దళిత’ పదానికి ‘అంటరానివారు’, ‘నిస్సహాయులు’, ‘తక్కువవారు’ అనే అర్ధాలున్నాయని రామ్ ప్రసాద్ పిటిషన్‌లో పేర్కొన్నారు. 

అంటరానివారు అనే అర్ధం ఉందో లేదో తెలియదు. నిస్సహాయులు అనడంలో తప్పేముంది ? సామాజికంగా, ఆర్ధికంగా నిస్సహాయులైన వారికే కదా సహాయం అందించేది. తక్కువవారు అంటే ఆర్ధికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారిని అర్ధం కావొచ్చు. సరే …అర్ధాలు ఎలా ఉన్నా దళిత అనే పదం అవమానకరంగా ఉందని భావిస్తున్నారు కాబట్టి  వారిని సంతృప్తి పరచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 

తలనొప్పి తెస్తున్న దళితబంధు 

ఇదిలా ఉండగా … కేసీయార్ ఎంతో ప్రిస్టేజిగా తీసుకున్న దళితబంధు పథకం ఇపుడు తలనొప్పులు తెస్తున్నట్లే ఉంది. దళితులను ఆకర్షించేందుకు కేసీయార్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నట్లు కూడా చెప్పారు. ఉపఎన్నికలు జరగబోతున్న కారణంగా హుజూరాబాద్ ను కేసీయార్ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకున్నారని అందరికీ అర్ధమైపోయింది. అయితే ఎవరు ఊహించని విధంగా రెండువైపుల నుండి సమస్యలు మొదలయ్యాయి.  

మొదటిదేమో దళిత సంఘాల నుండి మొదలైంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 100 కుటుంబాలకు మాత్రమే కాకుండా మొత్తం దళితులందరికీ పైలెట్ ప్రాజెక్టును వర్తింపచేయాలంటూ దళితసంఘాలు డిమాండ్లు మొదలుపెట్టాయి. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గం మాత్రమే కాదని రాష్ట్రం మొత్తానికి ఒకేసారి పథకాన్ని అమల్లోకి తేవాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఇక రెండో సమస్య ఏమిటంటే దళితులకు దళితబంధు పథకం పెట్టినట్లుగానే బీసీలకు కూడా ఓ బంధును అమల్లోకి తేవాలంటూ కమ్మరి, కుమ్మరి, యాదవ, గౌడ్, నాయీబ్రాహ్మణ లాంటి బీసీల్లోని ఉపకులాలన్నీ డిమాండ్లు మొదలుపెట్టాయి. 

ఎస్సీలతో పోల్చుకుంటే బీసీల్లోని ఉపకులాల్లోను ఆర్ధికంగా వెనకబడిన లక్షలాది కుటుంబాలున్నట్లు వాళ్ళు చెబుతున్నారు. దళితులను ఆర్ధికంగా ఆదుకుంటున్నట్లే తమను మాత్రం ఎందుకు ఆదుకోరంటూ కేసీయార్ ను నిలదీస్తున్నారు. ఇటు దళితులు, అటు బీసీల నుండి పెరిగిపోతున్న డిమాండ్లు చూస్తుంటే చివరకు కొత్త పథకమే కేసీయార్ ను ఉపఎన్నికలో ముంచేస్తుందా అనే అనుమానం పెరిగిపోతోంది. 

ఎందుకంటే హుజూరాబాద్ లో ఎస్సీల ఓట్లు 45 వేలైతే బీసీల ఓట్లు సమారు లక్షదాకా ఉన్నాయి. ఈ బీసీల ఓట్లను నమ్ముకునే ఈటల రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే ఈటల కూడా బీసీయే కాబట్టి. బీసీల్లో ఈటలకు మంచి పట్టుందన్న విషయం తెలుసు కాబట్టే కేసీయార్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే అనవసరంగా దళితబంధు పథకాన్ని ప్రకటించారా అనే ప్రచారం కూడా పెరిగిపోతోంది. హుజూరాబాదులో బీసీలు ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఓట్లు ఉన్న ఎస్సీల కోసం పథకం ఎందుకు ప్రకటించారో, దీని వెనుక వ్యూహం ఏమిటో అర్ధం కావడం లేదంటున్నారు సామాన్య జనం. 

దళితబంధు ప్రారంభం రోజే టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన ? 

ఇదిలా ఉంటే …హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గరపడుతోంది. ఈ హుజురాబాద్ లో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరికి వారు తగ్గకుండా  గెలుపు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బీజేపీ నుంచి.. ఈటల రాజేందర్ పోటీకి దిగుతుండగా. టీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ పడతారా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై కూడా ఆసక్తికరంగా ఉంది. 

ఉప ఎన్నిక బరిలో తమ పార్టీ తరఫున నిలబడే హుజురాబాద్ అభ్యర్థిని టీఆర్ఎస్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు అభ్యర్థుల పేర్లను పరిశీలించిన టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తాజాగా అభ్యర్థి ఎవరనేది తేల్చిందని సమాచారం. దళిత బంధు ప్రారంభోత్సవం 16న ఖరారు కాగా, అదే రోజున సీఎం కేసీఆర్ హుజురాబాద్ అభ్యర్థిని ప్రకటించబోతున్నట్లు సమాచారం. 

ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అభ్యర్థిని నిర్ధారించినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అభ్యర్థి పేరు ప్రకటించిన తర్వాత.. నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టాలని అనుకుంటున్నారని సమాచారం.

ఉపఎన్నికకు ప్రభుత్వం సిద్ధంగా లేదా ? 

హుజురాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే ఉప ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీలకు ఇప్పటికే సంకేతాలు అందినట్టు తెలుస్తోంది. తొందరలోనే షెడ్యూల్‌ విడుదలకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడే ఉప ఎన్నికకు సిద్ధంగా లేమని సీఈసీకి కేసీఆర్ సర్కార్ లేఖ రాసింది. 

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు కూడా సిద్ధంగా లేమని కేంద్ర ఎన్నికల కమిషన్ కు చెప్పింది. ఉప ఎన్నికకు, ఎమ్మెల్సీ ఎన్నికలకు కరోనాను కారణంగా చూపిస్తోంది. అయితే దళితబంధు ప్రారంభిచకముందే (వాసాల మర్రిలో ప్రారంభిచారనుకోండి. అది వేరే విషయం ) షెడ్యూల్ విడులవుతుందని కేసీఆర్ కు భయంగా ఉందంటున్నారు ఆయన ప్రత్యర్థులు. 

దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెలలో 103 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉంది. కేంద్రం నుంచి సంకేతాలు రావడంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అలెర్ట్ అయ్యాయి. 

బీసీ వర్గం నుంచే టీఆర్ఎస్ అభ్యర్థి ?   

ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున ఎవరిని పోటీలోకి దింపుతారనే విషయంలో చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి రెడ్డి అభ్యర్ధని, మరోసారి బీసీనే దింపుతారన్నారు. చివరకు ఎస్సీకే టికెట్టిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఎవరిని రంగంలోకి దింపుతారనే విషయం కేసీయార్ కనీసం సూచన కూడా చేయలేదు. ఇలాంటి నేపధ్యంలోనే నియోజకవర్గానికే చెందిన కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా కేసీయార్ ఎంపిక చేశారు. 

ఒకపుడు ఇదే కౌశిక్ టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కాంగ్రెస్ లో నుండి ఈ మధ్యనే టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ ఎమ్మెల్సీ అవటంతో ఉపఎన్నికలో రెడ్డి సామాజికవర్గానికి అవకాశం లేదని తేలిపోయింది. అలాగే ఇదే నియోజకవర్గానికి చెందిన బండ శ్రీనివాస్ ను ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు. ఈ నియామకాన్ని బట్టి చూస్తే ఎస్సీకి కూడా ఉపఎన్నికల్లో అవకాశం లేనట్లే అనిపిస్తోంది. 

ఒకవేళ ఎస్సీకే టికెట్ ఇవ్వాలని అనుకుంటే బండ కు కేసీయార్ టికెట్ ఇచ్చేవారు. ఎందుకంటే నియోజకవర్గంలో శ్రీనవాస్ కే గట్టి ఎస్సీ నేతగా పేరుంది. కాబట్టి బండ నియామకంతో ఎస్సీలకు కూడా అవకాశం లేదని తేలిపోయింది. ఇక మిగిలింది బీసీ సామాజికవర్గమే. నియోజకవర్గంలో బీసీ ఓట్లు సుమారు లక్షకు పైగా ఉన్నాయి. బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న ఈటల రాజేందర్ ఎలాగూ బీసీ నేతే. 

టీఆర్ఎస్ తరపున బీసీని రంగంలోకి దించకపోతే మొత్తం ఓట్లలో మెజారిటి ఈటలకు పడే అవకాశం ఉంది. కాబట్టి బీసీల ఓట్లలో చీలిక తెచ్చేందుకే కేసీయార్ ఇక్కడ బీసీ నేతనే రంగంలోకి దింపబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీని చేసినందుకు రెడ్డి ఓట్లు, ఎస్సీ నేతను ఛైర్మన్ చేసిందుకు ఎస్సీల ఓట్లు, బీసీకి టికెట్ ఇచ్చినందుకు బీసీల ఓట్లు+ అభివృద్ధి చేస్తున్నందుకు ఇతర సామాజికవర్గం ఓట్లు కూడా టీఆర్ఎస్ కే పడతాయని లేదా పడాలన్నది కేసీయార్ లాజిక్ లాగుంది. అందుకనే టీఆర్ఎస్ తరపున బీసీ నేతే పోటీలో ఉంటారనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది.

కౌశిక్ రెడ్డికి పదవిపై గుర్రుమంటున్న గులాబీ నేతలు 

టీఆరెస్ లో అలా చేరగానే.. ఇలా కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం పట్ల హుజురాబాద్ టీఆర్ఎస్ సీనియర్ నేతలు కుతకుతలాడిపోతున్నారు. వచ్చి 15 రోజులు కూడా కాకముందే .. అధినేత ఆయన్ను అంతలా గౌరవించడం, సముచిత స్థానం కల్పించడం చాలా మందికి నచ్చడం లేదు. దీంతో కౌశిక్ రెడ్డి పేరెత్తితేనే ఒకింత అసహనానికి లోనవుతున్నట్టుగా తెలుస్తోంది. కేసీఆర్ ఏ లెక్క ప్రకారం ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా సరే.. తాము మాత్రం ఆయన్ను నెత్తిన పెట్టుకోవద్దని అందరికందరూ ఓ ఒప్పందానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు హుజురాబాద్‌ నియోజకవర్గానికే చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడి ఇంట్లో ఆయా నేతలంతా రహస్య సమావేశం నిర్వహించారని.. అధిష్టానం నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేసినట్టుగా సమాచారం. 

ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగుతున్న తాము.. మొన్నే వచ్చిన కౌశిక్ రెడ్డికి కుర్చీలు వేయడం, జైకొట్టడం చేయాలా అని వారు గుస్సా అవుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే ఆ పార్టీలో సీనియర్లకు కౌశిక్ రెడ్డి అస్సలు గౌరవం ఇచ్చేవాడు కాదని.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీనే దక్కడంతో నేల మీద నిలబడడేమో అని అనుకుంటున్నారట. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాక.. తమకు దక్కే గౌరవాన్ని బట్టి పార్టీలో కొనసాగాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట ఆ సీనియర్లు.

హుజూరాబాద్ మరో దుబ్బాక కాకూడదు 

దుబ్బాకలో ప్రజల దెబ్బ ఎలా ఉందో చూసిన కేసీఆర్ హుజురాబాద్‌లో ఆ పరిస్థితి రాకూడదని చాలా కష్టపడుతున్నారు. ఎంత మంది నేతలని గ్రౌండ్‌లోకి దింపినా ఆయనకు నమ్మకం కుదురుతున్నట్టుగా లేదు. ట్రబుల్ షూటర్ హరీష్‌రావు కూడా దుబ్బాకలో ఉత్త చేతులతో తిరిగిరావడంతో.. ఈసారి ఆ అవకాశం ఇవ్వదలుచుకోలేదు. దీంతో తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు కేసీఆర్. హుజురాబాద్‌లో ఒకటి కాదు.. ఉప ఎన్నికలోపు ఏకంగా మూడు బహిరంగ సభలు నిర్వహించే యోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

దళిత బంధు పథకం ప్రారంభోత్సవం కోసం ఆగస్టు 16 న మొదటి సమావేశం నిర్వహిస్తారు కేసీఆర్. ఎన్నికల సంఘం ఉప ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత.. రెండో సభను నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత పోలింగ్‌కు రెండు-మూడు రోజుల ముందు మూడో బహిరంగ సభకు ప్లాన్ చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిజమైతే ఒకే నియోజకవర్గంలో అది కూడా ఉప ఎన్నిక కోసం.. అందులోనూ కేసీఆర్ స్వయంగా ఇంతలా కష్టపడటం ఇదే మొదటిసారి అవుతుంది. 

ఇప్పటివరకు తెలంగాణలో ఏ ఉప ఎన్నిక కోసం కూడా కేసీఆర్ ప్రచారం చేయలేదు. దుబ్బాక ఉప ఎన్నికలో కేసీఆర్ వ్యూహాలన్నీ విఫలం కావడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోల్తా పడటంతో.. ఆ తర్వాత జరిగిన నాగార్జునసాగర్ విషయంలో పంథా మార్చుకున్నారు. సాగర్ ఉప ఎన్నికకు ముందు రెండు బహిరంగ సభలు నిర్వహించారు. వాస్తవానికి జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత కేసీఆర్.. అన్ని ఎన్నికలను తీవ్రంగానే పరిగణిస్తున్నారు.

-నాగ్ మేడేపల్లి