తాను బతికే ఉన్నానని, దయచేసి ఆ వార్తల్ని నమ్మకండి అని అలనాటి ప్రముఖ నటి, ఊర్వశి శారద విజ్ఞప్తి చేశారు. ఊర్వశి శారద చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ఈ రోజు (ఆదివారం) ఉదయం నుంచి చక్కర్లు కొడుతోంది. దీంతో టాలీవుడ్‌తో పాటు ఆమె అభిమానులు ఆవేదనకు గురయ్యారు.
తమ అభిమాన నటి ఇక లేరనే వార్తను నమ్మకపోవడంతో పాటు జీర్ణించుకోలేక పోయారు. కనీసం ఆమె అనారోగ్యంగా ఉన్నారనే సమాచారం లేదని, అలాంటిది ఒక్కసారిగా మృతి చెందిన వార్త వైరల్ కావడంపై సినీ పెద్దలతో పాటు అభిమానులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె మృతిపై ఆరా తీశారు.
సోషల్ మీడియాలో తన మృతిపై జరుగుతున్న ప్రచారం శారద దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె తీవ్ర ఆవేదన చెందారు. కనీసం నిర్ధారించుకోకుండానే సున్నిత అంశానికి సంబంధించిన వార్తను ఇవ్వడంపై ఆమె ఆవేదనతో స్పందించారు.
‘నేను బతికే ఉన్నాను. నా ఆరోగ్యం బాగానే ఉంది. ఒంట్లో కాస్త నలతగా ఉంది. దయచేసి వాట్సాప్‌లలో వచ్చే వాటిని నమ్మకండి. ఒక వ్యక్తి చేసిన పనికి అందరూ ఆందోళన చెందుతున్నారు. నా అభిమానులు, శ్రేయోభిలాషులు ఇలాంటి వార్తలు నమ్మొద్దు. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటివి వ్యాప్తి చేయడం బాధాకరం’ అని పేర్కొన్నారు.
మూడుసార్లు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న శారద…కెమెరా ముందు నటిస్తారనడం కంటే జీవిస్తారనడమే సరైంది. 76 ఏళ్ల శారద ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో నటించిన శారదకు దక్షిణాదిన విశేష సంఖ్యలో అభిమానులున్నారు.