జగన్ ను చీట్ చేస్తున్న థియేటర్లు?

సామాన్యుడికి సినిమా టికెట్ రేట్లు అందుబాటులో వుండాలని ఆంధ్ర సిఎమ్ జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. సినిమా టికెట్ రేట్లు గట్టిగా తగ్గించారు. అప్పటి వరకు రెండేసి వందలు, మూడేసి వందలు టికెట్ రేట్లు…

సామాన్యుడికి సినిమా టికెట్ రేట్లు అందుబాటులో వుండాలని ఆంధ్ర సిఎమ్ జగన్ ఓ నిర్ణయం తీసుకున్నారు. సినిమా టికెట్ రేట్లు గట్టిగా తగ్గించారు. అప్పటి వరకు రెండేసి వందలు, మూడేసి వందలు టికెట్ రేట్లు వసూలు చేస్తూ ప్రేక్షకులను దోపిడీ చేసిన థియేటర్ వ్యవస్థ ఉలిక్కిపడింది. మొదటికే మోసం వచ్చేసింది. దాంతో థియేటర్లు తెరచుకోవడం కష్టం అయిపోయింది. 

మంత్రుల ద్వారా, సలహాదారుల ద్వారా నడిపిన రాయబారాలు ఫలించలేదు. జగన్ చలించలేదు. టికెట్ రేట్లు మారలేదు. ఇలాంటి టైమ్ లో మళ్లీ సినిమాల విడుదల ప్రారంభమైంది. ఎస్ ఆర్ కళ్యాణమండపం వసూళ్లు చూసి మిగిలిన సినిమాలు కూడా క్యూ కట్టడం ప్రారంభమైంది. 

సెకెండ్ షో లేదు, టికెట్ రేట్లు లేవు. ఫిఫ్టీ పర్సంట్ ఆక్యుపెన్సీ. అయినా సినిమాల ధైర్యం ఏమిటి? అని ఆరా తీస్తే అసలు విషయం తెలుస్తోంది. యాభై శాతం ఆక్యుపెన్సీ అన్నది సమస్య కాదు. సెకెండ్ షో లేకపోయినా, మార్నింగ్ షో టైమ్ కాస్త ముందుకు జరిపి, కిందా మీదా పడి నాలుగో షో కాస్త అటుగా అడ్జస్ట్ చేసారు. దీన్ని లోకల్ అధారిటీస్ చూసీ చూడనట్లు వదిలేసారు. సరే, దాన్ని కూడా సరిపెట్టుకోవచ్చు.

కానీ ఏ నగరపంచాయతీలు, సి సెంటర్లు సమస్య అనుకున్నారో అక్కడ మళ్లీ యధా ప్రకారం వంద రూపాయల టికెట్ లు అమ్మేస్తున్నారని తెలుస్తోంది. లోకల్ ఎమ్మార్వో, పోలీస్ లను మేనేజ్ చేసి ఈ వ్యవహారానికి తెరతీసారని బోగట్టా. జనం కూడా ఎప్పటి నుంచో నూరు, నూటయాభై, రెండు వందలు అలవాటై వున్నారు కాబట్టి ఇదేంటీ అని అడగడం లేదు. 

నిజానికి లోకల్ ఎమ్మార్వో థియేటర్ల దగ్గర కొత్త రేట్లు డిస్ ప్లే అవుతున్నాయా? లేదా? ఎంతకు అమ్ముతున్నారు అన్నది చెక్ చేయాలి. కానీ దాదాపు థియేటర్లు అన్నీ రాజకీయంగా పలుకుబడి వున్నవారి చేతుల్లోనే వున్నాయి. దాంతో అధికారులు తమకు అందింది తీసుకుని సైలంట్ అయిపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పైగా వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులకు చాలా మందికి థియేటర్లు వున్నాయి. వారిని అడ్డేదెవరు? 

అంటే టికెట్ రేట్ల విషయంలో జగన్ మొండితనానికి ఈ విధంగా బ్రేక్ వేసారన్నమాట థియేటర్ జనాలు. కానీ ఈ విషయం జగన్ దృష్టికి వెళ్తే వ్యవహారం చాలా తేడాగా వుండే ప్రమాదం వుంది.