సొమ్మొకరిది …సోకొకరిది అని తెలుగులో ఒక సామెత ఉంది. ఒకరి సొమ్మును వేరొకరు అనుభవిస్తారని దీని అర్ధంగా చెప్పుకోవచ్చు. మన ప్రజాస్వామ్యంలో పాలకుల తీరు ఇలాగే ఉంది. ఇతర రాష్ట్రాల సంగతి వదిలేయండి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ జాడ్యం తెలంగాణలో లేదుగానీ, ఏపీలో విపరీతంగా ఉంది. సాధారణంగా ప్రభుత్వాలు అభివృద్ధి పనులకు, సంక్షేమ కార్యక్రమాలకు ఎవరి డబ్బు ఖర్చు చేస్తాయి? ప్రజల డబ్బే ఖర్చు చేస్తాయి. అంతే కదా. ముఖ్యమంత్రులు తమ జేబులో డబ్బులు ఖర్చు చేయరు కదా. బ్యాంకుల్లో దాచుకున్న తమ డిపాజిట్లు తీయరు కదా.
అలాంటప్పుడు ప్రజల డబ్బు ప్రజల కోసమే ఖర్చు చేస్తూ ముఖ్యమంత్రులు వారి పేర్లు పథకాలకు, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టుకోవడం ఏమిటి? ఇది నైతికంగా కరెక్టు కాదు కదా. కానీ ముఖ్యమంత్రులు అవన్నీ ఆలోచించరు. పథకాల అమలుకు, అభివృద్ధి పనులకు వారి సొంత డబ్బు ఖర్చు చేస్తే వారి పేరు, వారి తల్లిదండ్రుల పేర్లు పెట్టుకోవడం సమంజసం. కానీ ఆ జ్ఞానం సీఎంలకు ఉండదు. వారికి కావలసింది ప్రచారం. దేశం కోసమో, రాష్ట్రం కోసమో పాటుబడిన మహనీయుల పేర్లు పెట్టవచ్చు. తప్పులేదు. కానీ పదవిలో ఉన్న తమ పేర్లే పెట్టుకోవడం సిగ్గుచేటు. అధర్మం. అనైతికం. పాత తరం సీఎంలు ఎవరూ ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవు. తెలంగాణలో కేసీఆర్ సంక్షేమ పథకాలకు తన పేరు పెట్టుకోలేదు.
కేవలం గర్భిణులకు ఉద్దేశించిన పథకానికి కేసీఆర్ కిట్ అనే పేరు పెట్టారు. అలాగే ఏ సంస్థలకూ తన పేరు పెట్టలేదు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకులు పెట్టిన పేర్లు ఏవీ మార్చలేదు. వాటిల్లో ఆంధ్రా నాయకుల పేర్లు చాలా ఉన్నాయి. ఉద్యమ సమయంలో తాము అధికారంలోకి వస్తే పేర్లు మారుస్తానని, ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ హయాంలో నెలకొల్పిన ఆంధ్రా ప్రముఖుల విగ్రహాలు తొలగిస్తానని అన్నాడు. కానీ రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చాక ఆ పని చేయలేదు. అందుకు కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి. కానీ ఏపీలో ఇందుకు భిన్నంగా ఉంది.
రాష్ట్రంలోని పథకాలు, కార్యక్రమాలకు వైఎస్సార్ లేదా వైఎస్ జగన్ పేర్లు మారుమోగుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవి అధికమయ్యాయి. దేశంలోనే కాదు.. బహుశా ప్రపంచంలోనే మరెక్కడా ఇంత భారీ ఎత్తున పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవటం ఉండదేమో.
చంద్రబాబు పాలనలో చాలా పథకాలకు ఆయన పేరు పెట్టుకున్నాడు. ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు దాదాపు పాతిక పథకాలకు, ప్రాజెక్టులకు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టారు. కానీ తన పేరు పెట్టుకోలేదు. పెట్టుకున్నా అడ్డుకునేవాళ్ళు లేరు. కానీ రాజభక్తితో వాళ్లిద్దరి పేర్లు పెట్టాడు. జగన్ అధికారంలోకి వచ్చాక పథకాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయన పేరు, వైఎస్సార్ పేరు తప్ప మరో పేర్లు లేవు. రాష్ట్రంలో ప్రజాధనంతో అమలవుతున్న దాదాపు 75కు పైగా పథకాలు, కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి.. తన పేరు లేదా తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి పేరు పెట్టుకున్నారు. వీటిల్లో ఎక్కువ శాతం పథకాలు, కార్యక్రమాలు గత ప్రభుత్వాల హయాంలో అమలైనవేనని చెబుతుంటారు.
జగన్ అధికారంలోకి వచ్చాక పాతవాటి పేర్లు మార్చేసి తన పేరో, తండ్రి పేరో తగిలించుకోవటం మొదలుపెట్టారు. దేశంలోనే కాదు.. బహుశా ప్రపంచంలోనే మరెక్కడా ఇంత భారీ ఎత్తున పథకాలకు సొంత పేర్లు పెట్టుకోవటం ఉండదేమో. గతంలోనూ కొన్ని ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలకు తమ పార్టీ నేతలు లేదా స్వాతంత్య్ర సమరయోధులు, లబ్ధ ప్రతిష్ఠుల పేర్లు పెట్టుకునే సంప్రదాయం ఉంది. కానీ జగన్ మాత్రం దీన్ని ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో 75కు పైగా పథకాలకు జగనన్న, వైఎస్ఆర్ అనే పేర్లు పెట్టారు.
పస్తుతం రాష్ట్రంలో జగనన్న పేరుతో 20కి పైగా, రాజశేఖర్రెడ్డి పేరుతో 55కు పైగా పథకాలు, కార్యక్రమాలు ఉన్నాయి. ఇవి కాకుండా జిల్లాలు, మండలాల్లో అయితే వందలాది భవనాలు, ప్రాంతాలు, ఉద్యానవనాలు, మైదానాలు, రోడ్లకు రాజశేఖర్రెడ్డి పేర్లు ఉన్నాయి. ఒకటో రెండో పథకాలకు తండ్రీ కొడుకుల పేర్లు కలిపి పెట్టారు. ఈ ప్రచార కండూతి ఎందుకో అర్ధం కాదు.