శ్రీవారు అందరివాడు కాదు.. ఆన్ లైన్ వాడే..!

కరోనా కష్టకాలంలో ఏకాంత సేవలకు అలవాటు పడ్డారు తిరుమలేశుడు. కర్ఫ్యూ సడలింపులు అమలులోకి వచ్చాక కూడా ఇంకా సామాన్య భక్తులపై ఆయన కరుణ చూపడం లేదు. ఆయనదేముంది పాపం.. ఓ దశలో నిద్ర పూర్తిగా…

కరోనా కష్టకాలంలో ఏకాంత సేవలకు అలవాటు పడ్డారు తిరుమలేశుడు. కర్ఫ్యూ సడలింపులు అమలులోకి వచ్చాక కూడా ఇంకా సామాన్య భక్తులపై ఆయన కరుణ చూపడం లేదు. ఆయనదేముంది పాపం.. ఓ దశలో నిద్ర పూర్తిగా కరువైంది. అంతలోనే పవళింపు సేవ, ఆ వెంటనే సుప్రభాత సేవ అన్నట్టుగా తయారైంది.

అలాంటి దేవదేవుడికి ఇప్పుడు కాస్త విశ్రాంతి దొరికింది, అందుకే దర్శనాలపై కాస్త సాలోచన సాగిస్తున్నారు దేవదేవుడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడల్లా తిరుమలలో సాధారణ దర్శనాలు అమలులోకి వచ్చే అవకాశం లేదని తేలిపోయింది.

సామాన్య భక్తులకు దర్శనాలు కష్టం..

సెకండ్ వేవ్ మొదలయ్యాక కాలినడక, సర్వదర్శనాలకు టీటీడీ స్వస్తి పలికింది. లిమిటెడ్ గా దర్శనాలుండాలి అనే పేరుతో కేవలం 300 రూపాయల టికెట్లను ఆన్ లైన్ లో అమ్ముతోంది. అవి కూడా పరిమితంగానే. రోజుకి కేవలం 20వేలమందికి మాత్రమే శ్రీవారి దర్శన భాగ్యం కలుగుతోంది. 

ఆన్ లైన్ లో 300రూపాయల టికెట్ దొరకడం అంటే లాటరీలో బంపర్ ప్రైజ్ దొరికినట్టే. లేకపోతే ఏదో ఒక ప్రజా ప్రతినిధి సిఫార్సు లేఖ కోసం ట్రై చేయాల్సిందే. ఆర్జిత సేవల టికెట్లు లక్షల్లో ఒకరికి తప్ప అందరికీ దొరకవు. ఈ దశలో సామాన్య భక్తులకు తిరుమల దర్శనం దుర్లభమైంది.

టీటీడీ ఏమంటోంది..?

సినిమా హాళ్లకు కూడా గేట్లు తెరిచేశారు కానీ తిరుమలలో శ్రీనివాసుడి దర్శనానికి మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో నిబంధనలు సడలించలేదు టీటీడీ. 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' కరోనాను డీ-నోటిఫై చేసే వరకు తిరుమలలో దర్శనాలు పరిమితంగా ఉంటాయని తాజాగా ఈవో తేల్చి చెప్పారు. దీంతో మరికొన్నాళ్లు సామాన్యులకు శ్రీవారి దర్శనాలు కష్టమని తేలిపోయింది. 

ఆన్ లైన్ కోటా విడుదల చేస్తున్నా నిమిషాల వ్యవధిలో అది ఖాళీ అవుతోంది. ఆన్ లైన్ వ్యవహారం తెలియని సామాన్య భక్తులకు ఇప్పుడల్లా శ్రీవారి దర్శన భాగ్యం లేదనే చెప్పాలి. దర్శన టికెట్ ఉంటేనే కొండపైకి అనే నిబంధన కూడా ఉండటంతో… కనీసం గుడి బయటనుంచైనా ఆయనకు దండం పెట్టుకుని ఇతర తీర్థాలు చూసి వెళ్తామనుకుంటున్నవారికి కూడా నిరాశే ఎదురవుతోంది.