లంచం.. సమాజానికి పట్టిన క్యాన్సర్. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. క్యాన్సర్‌కి మందు కనుగొనడం సులభమేమోగానీ, సమాజం నుంచి లంచగొండితనాన్ని రూపుమాపడం అసాధ్యం. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, లంచగొండితనానికి అస్కారమే లేకుండా రాష్ట్రాన్ని మార్చేయాలని భావిస్తున్నారు. ఏ ప్రభుత్వమైనాసరే, అవినీతిని ప్రోత్సహిస్తామని చెప్పదుగాక చెప్పదు. అవినీతిని అంతమొందిస్తామంటారు.. లంచగొండితనానికి అవకాశమే లేకుండా చేస్తామంటారు.
'మేం అధికారంలోకి వస్తే..' అంటూ ఎన్నికల ప్రచారంలోనూ, అంతకు ముందూ.. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన అతి పెద్ద హామీ, అవినీతిని నిర్మూలిస్తామని. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి నిజాలు నిగ్గు తేల్చుతామంటూ దాదాపు అన్ని బహిరంగ సభల్లోనూ వైఎస్ జగన్ నినదిస్తూనే వచ్చారు. నవరత్నాల విషయంలో ఎంత ఖచ్చిత్వంతో వ్యవహరిస్తున్నారో, చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసే విషయంలోనూ అంతే ఖచ్చితత్వంతో వ్యవహరిస్తున్నారు వైఎస్ జగన్.
అయితే, గ్రౌండ్ లెవల్లో అవినీతిని తగ్గించగలరా.? లంచగొండితనానికి ఆస్కారం లేకుండా సమాజాన్ని తీర్చిదిద్దగలరా.? అన్నది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నే. సాక్షాత్తూ వైఎస్ జగన్ క్యాబినెట్‌కి చెందిన ఓ సీనియర్ మంత్రిగారి పీఏ, లంచావతారం ఎత్తారనీ, అడ్డగోలుగా బొక్కేస్తున్నారనీ గత కొద్ది రోజులగా ప్రచారం జోరందుకుంది. అధికార పార్టీ నేతలు సైతం, ఈ విషయమై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు ఆఫ్ ది రికార్డ్ కథనాలు బయటకొస్తున్నాయి.
మరోపక్క, అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్యే మధ్య 'ఇసుక' వ్యవహారం రచ్చ చేపడం, పంపకాల కొట్లాట తాలూకు పంచాయితీ ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళడం తెల్సిన విషయాలే. ఇవే కాదు, గ్రామ వలంటీర్ల ఎంపికకు సంబంధించి తెరవెనుకాల 'అవినీతి' అడ్డగోలుగా కన్పిస్తోందని బాధితులే మీడియా ముందుకొచ్చి చెబుతున్నారు.. సోషల్ మీడియాలోనూ తమ ఆవేదన వెల్లగక్కుతున్నారు.
అయితే, వ్యవస్థలో అంతర్భాగమైపోయిన అవినీతిని కూకటి వేళ్ళతో పెకిలించేయడం అన్నది రాత్రికి రాత్రి జరిగే తంతు కాదు. తనవంతు ప్రయత్నం గట్టిగా చేస్తామని వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకొచ్చినందుకు అభినందించి తీరాల్సిందే. జగన్ అత్యుత్సాహం చూపిస్తున్నారనడం కంటే, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తున్నారని భావించడం మంచిదేమో.!