సమ్ థింగ్ మోర్ అన్నది నిర్మాత దిల్ రాజుకు ఎప్పుడూ వుండే ఆలోచన. అందుకే బయ్యర్ గా ఇండస్ట్రీలోకి ఎంటరై, నిర్మాతగా మారి, ఆపై ఎగ్జిబిషన్ రంగంలోకి ప్రవేశించి ఇలా విస్తరిస్తూ వెళ్తున్నారు. వచ్చే ఏడాది నుంచి బాలీవుడ్ లో సినిమాలు తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయినా అక్కడితో ఆగకుండా కొత్త స్కీమ్ ఒకటి తయారు చేసుకున్నారు.
ఇండస్ట్రీలో మంచి సినిమాలు తీస్తున్న మీడియం నిర్మాతలు ఎనిమిది మందిని ఎంపిక చేసుకుని, వారితో ఓ అసోసియేట్ వ్యవహారానికి శ్రీకారం చుట్టారు. ఈ ఎనిమిది మంది మంచి సబ్జెక్ట్ ఏది తెచ్చుకుని, తనతో ఓకె చేయించుకున్నా, ఆ ప్రాజెక్టుకు ఫండింగ్ మొత్తం దిల్ రాజే చేస్తారు. మార్కెటింగ్ కూడా ఆయనే చూసుకుంటారు. కేవలం సినిమాను ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. ఇదీ స్కీము.
నిర్మాతలు రాజీవ్ రెడ్డి, చిల్లా శశి (యాత్ర), బెక్కం వేణుగోపాల్, శివలెంక కృష్ణప్రసాద్, మహేష్ కోనేరు, కృష్ణ (జవాన్) రాహుల్ యాదవ్ తదితరులను దిల్ రాజు తనతో పాటు సినిమాలు తీయడానికి ఎంపిక చేసుకున్నారు. వీరంతా వైవిధ్యమైన చిన్న, మీడియం సినిమాలు తీసినవారే. అందుకే వీరిని ఎంపిక చేసుకున్నట్లు దిల్ రాజు తెలిపారు.
తన ఐఢియాలు, ఆలోచనలు వేరు అని, ఈ నిర్మాతలు కొత్త ఆలోచనలు, ఐడియాలతో సినిమాలు చేస్తున్నారని, కానీ తమ అందరి మైండ్ సెట్ ఒకటే అని, మంచి సినిమాలు, వీలయినంత బడ్జెట్ కంట్రోల్ లో అందించడమే తమ ఆలోచన అని, అందుకే వీరందరినీ తనతో కలుపుకున్నానని దిల్ రాజు అన్నారు.
తన సినీరంగ ప్రయాణం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేస్తున్న కొత్త అడుగు ఇది అని, ఈ ప్రయాణంలో మరి కొంత మంది వచ్చినా తను కలుపుకుంటా అని ఆయన తెలిపారు.