మణిరత్నం అంటే ఒక బ్రాండ్. తెలుగులోనూ, తమిళంలోనూ ఆయన సినిమాలకి లక్షలాదిమంది అభిమానులున్నారు. అయన సారధ్యంలో వెబ్ సిరీస్ వస్తోందంటే సహజంగానే ఆసక్తి నెలకొంటుంది. “నవరస” టైటిల్‌తో మొత్తం తొమ్మిది చిన్న కథలని తెరకెక్కించారు. ఒక్కో ఎపిసోడ్‌లోనూ ఒక్కో రసాన్ని చిలికించారు. పైన చెప్పినట్టు మణిరత్నం ది ఇందులో ప్రధానంగా “సారధ్యం” పాత్రే. ఒక్కో ఎపిసోడ్ ని ఒక్కొక్క దర్శకుడు తీసాడు. ఏ కథలో ఏ రసాన్ని ఎంతవరకు పిండారో చెప్పుకుందాం.
1- కరుణ: కరుణ రసంతో ఈ సిరీస్ కి తెరలేపారు. రేవతి, ప్రకాష్ రాజ్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రలు. బిజోయ్ నంబియార్ దీనికి దర్శకత్వం. క్షణికావేశంలో సేతుపతి రేవతి భర్తని చంపుతాడు. పోలీసుల్నుంచి తప్పించుకోవడానికి వేరే ఊళ్ళో ఒక ఇంట్లో తల దాచుకుంటాడు. అక్కడ మంచమ్మీదున్న ప్రకాష్ రాజ్ అతన్ని నసపెట్టి విసిగిస్తుంటాడు. క్షమాగుణం గురించి క్లాస్ పీకుతాడు.
ఇంతకీ ఈ ప్రకాష్ రాజ్ ఎవరు? ఇక్కడ ఒక పెద్ద ట్విస్టు. ఇది ప్రేక్షకులకి అర్థమైతే బానే ఉంటుంది. లేకపోతే దీనిని కరుణ రసంలో వేసుకోవాలో, భయానక రసంగా భావించాలో లేక రెండూ కాకుండా తికమక రసం అనుకోవాలో అర్థం కాదు. ఆ తర్వాత సేతుపతి ఏం చేసాడన్నది క్లైమాక్స్. పూర్తిగా క్షమాగుణం మీద నడిచిన కథ ఇది. కరుణ రసమంటే క్షమాగుణం మాత్రమే అన్నట్టుగా ఉంది ఇది చూస్తే. రెండు పాత్రల మధ్యలో క్షమించుకోవడాలు కాకుండా ప్రేక్షకుల మనసులని కరిగించి కళ్లల్లోంచి నీరు తెప్పిస్తే అది ఉత్తమమైన కరుణరసాత్మక కథనం అవుతుంది. కానీ ఎంతటివారినైనా క్షమించాలని ఈ కథలో చెప్పారు కాబట్టి మరీ విమర్శించకుండా క్షమించేద్దాం.
2- హాస్యం: ఈ మధ్యన “మండేలా” అనే బహుజనాదరణ పొందిన నెట్‌ఫ్లిక్స్ సినిమాతో ఓటీటీ ఆడియన్స్ కి సుపరిచితమైన యోగి బాబు ఇందులో ప్రధాన పాత్రధారి. రమ్యా నంబీశన్ మరొక మెయిన్ కారెక్టర్. ఈ ఎపిసోడ్ ని ప్రియదర్షన్ డైరెక్ట్ చేసారు. ఒక సుప్రసిద్ధమైన సినీ కమెడియన్ తన చిన్ననాటి స్కూల్ యానివెర్సరీ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వస్తాడు. అతను ప్రసంగిస్తూ చిన్నప్పుడు ఆ స్కూల్లో జరిగిన సంఘటనలు చెప్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్ కథలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఒక టీచరుంటుంది. ఆమె ఒక పెద్ద కుక్కని పెంచుకుంటుంది. ఆమె తండ్రి స్కూల్ ప్రిన్సిపాల్. ఆయనకి ఈ కుక్క గోల నచ్చదు.
ఈ టీచర్ ని చూసుకోవడానికి పరమ నిష్టాగరిష్టులైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వరుడి కుటుంబం పెళ్లిచూపులకొస్తుంది. పెళ్ళిళ్ళ పేరయ్య సూచనతో ఆ కుక్కని ఇంట్లో లేకుండా చెయ్యాలని టీచరు తండ్రి ప్లాన్ చేస్తాడు. ఆ ప్లాన్ ఏవిటి? దానికి యోగిబాబు పోషించిన పాత్రకి సంబంధమేమిటనేది చూస్తే బాగుంటుంది. 30 నిమిషాల ఈ కథలో కుక్క ఎపిసోడ్ నవ్వులు తెప్పిస్తుంది. ముందు నుంచి రమ్యా నంబీసన్ క్యారెక్టర్ ని చాలా సీరియస్ గా చూపించి చివర్లో ఆమె చేత ఒక డయలాగ్ చెప్పించి గొల్లున నవ్వుకునేలా చేయడం బాగుంది. అన్నింటిలోకి ఇదే నెంబర్ 1 ఎపిసోడ్ అని చెప్పొచ్చు.
3-అద్భుతం: కార్తిక్ నరేన్ తీసిన ఈ కథలో అరవింద్ స్వామి, ప్రసన్న ముఖ్యపాత్రలు. నెట్‌ఫ్లిక్స్ లో సూపర్ హిట్టైన జెర్మన్ సిరీస్ డార్క్, నోలన్ సినిమాల్లోని థియరీలు, ఆస్ట్రల్ ప్లేన్స్ కి సంబంధిచిన సబ్జెక్ట్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ లాంటివి చూసిన, చదివిన వారికి ఈ ఎపిసోడ్ అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాక 30 నిమిషాల సేపు నాన్ స్టాప్ గా బుర్రగోక్కోవడం వల్ల జుట్టు రాలిపోవచ్చు. ఇందులో అద్భుతం చూడ్డానికి ఏ ఐడియా కూడా ఒరిజినల్ కాదు.
మొత్తం ఎపిసోడ్ చూసాక ఒక డౌటొస్తుంది. కళ్లు మూసుకుని తన ఊహని నిజం చేయగల కెపాసిటీ తెచ్చుకున్న అరవింద స్వామి అదే పని చేసి భార్యని, కొడుకుని ప్రత్యక్షం చేసుకోవచ్చుగా..! తన శక్తి ముందు ఫిసికల్ లాస్ ఏ మాత్రం అప్లై కావని తానే చెప్పాడుగా..! ఇది అద్భుతంలా అనిపించే గందరగోళరసం.
4-భీభత్సం: భీభత్సానికి “డిస్గస్ట్” అని అనువాదం చేసుకుని ఈ కథ రాసేసుకుని తీసేసారు. ప్రధాన పాత్రధారి కూతురు తండ్రిని డిస్గస్టింగ్ గా చూస్తుంది చివర్లో. కనుక భీభత్స రసం పొంగి పొర్లించామని దర్శకుడు వసంత సాయి అనుకొని ఉండొచ్చు. కానీ కథలో పొర్లించింది పాయసం డ్రమ్ము. కథనంలో పొంగింది ప్రధానపాత్రపై డిస్గస్ట్ రసం మాత్రమే. అంతవరకూ చూసుకుంటే ఇది మంచి కథే. మెయిన్ రోల్ అయిన సామనాధు పాత్రలో ఢిళ్లీ గణేష్ పర్ఫామెన్స్ ని మాత్రం మెచ్చుకోవాలి. అతనొక చిరాకు పుట్టించేంత అసూయాపరుడు. సుబ్బరాయన్ అనే వ్యక్తికి ఇతను బంధువు. ఆ సుబ్బరాయన్ ఏడుగురు కూతుళ్ల పెళ్ళిళ్లని ఘనంగా జరిపాడు. కానీ సామనాధుకి ఒక్కతే కూతురు. ఆమెకి పెళ్లి చేసిన మూడో నాడే భర్త చనిపోతాడు.
ఇతనికి ఇంట్లో వైధవ్యంతో ఉన్న కూతురు, సుబ్బరాయన్ కి మాత్రం కళకళలాడుతూ ఏడుగురు అల్లుళ్ళు. పైగా ఊళ్లో మంచి పేరు. ఇవన్నీ తట్టుకోలేక తన మనోగతాన్ని చనిపోయిన తన భార్య ఆత్మతో చెప్పుకుంటుంటాడు. ఈ జెలసీతో ఇతను సుబ్బరాయన్ కుటుంబం పట్ల ఏ అకృత్యం చేస్తాడా అనిపిస్తుంది. చివర్లో అతని సంతృప్తి కోసం ఒక వెధవపని చేసి ఊరుకుంటాడు. ఆ పనిని చూసిన అతని కూతురు అతన్ని అసహ్యంగా చూస్తుంది. సినిమా కథలా కాకుండా పీరియడ్ బ్యాక్ డ్రాపులో సుమారు వందేళ్ల క్రితం నాటి పుస్తకంలోని కథని దృశ్యరూపంగా చూస్తున్నట్టుంటుంది ఈ ఎపిసోడ్.
5-శాంతం: కార్తిక్ సుబ్బరాజ్ తీసిన ఈ కథ శ్రీలంక బ్యాక్ డ్రాప్ లో సింగిల్ లోకేషన్లో పూర్తవుతుంది. లంకలో తమిళులకి, సింహళీయులకి పోరు. ఒక పదేళ్ల పిల్లవాడు ఒక తమిళుల బంకర్ దగ్గరైకొచ్చి తన తమ్ముడు ఇంట్లో ఇరుక్కుపోయాడని బాధపడతాడు. ఆ తమ్ముడిని తీసుకురావడానికి ఒక తమిళ టైగర్ ఆ ఇంటివైపుకి సింహళీయుల కళ్లుగప్పి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. పేరుకి శాంతరసమే గానీ అసలిందులో అదుందో లేదో తీసినవాళ్లకి కూడా డౌటొచ్చినట్టుంది. అందుకే పీస్ అని వేసి పక్కన ప్రశ్నార్ధకం వేసారు చివర్లో.
6-రౌద్రం: అరవింద స్వామి దర్శకుడిగా అరంగేట్రం చేసిన ఎపిసోడ్ ఇది. సింపుల్ కథని, ఆసక్తీకరమైన స్క్రీన్ ప్లేతో నడిపాడు. అవమానబాధతో హత్య చేసిన యువకుడి కథ ఇది. అతని తల్లి ఒక పని మనిషి. అతనికొక చెల్లెలు కూడా ఉంటుంది. అతనికి కలిగిన అవమానమేంటి? కథనంలో ట్విస్టేమిటి లాంటి స్పాయిలర్స్ ఇక్కడ చెప్పలేం.
7-భయం: రతీంద్రన్ తీసిన ఈ కథలో సిద్ధార్థ్, పార్వతి తిరువొతు, అమ్ము అభిరామి ప్రధాన పాత్రలు. పేలెస్ లాంటి వహీదా ఇంటికి ఫరూక్ ఒక సంతకం కోసం వస్తాడు. ఆమె ఇతనిని చూసి ఇష్టపడుతుంది. అతను కూడా తనకున్న విషయపరిజ్ఞానాన్ని వహీద ముందు ప్రదర్శించి మరింత ఆకట్టుకుంటాడు. కానీ అంతలోనే ఫరూక్ అంటే వహీదాకి క్రమంగా భయం కలుగుతుంది. ఫరూక్ సైలెంట్ గా చిత్రమైన మంత్రాలు చదువుతూంటాడు. వహీదా గతాన్నంతా చెప్తుంటాడు. కంట్రోల్ చేసుకోలేని భయంతో వహీదా ఆత్మహత్య చేసుకుంటుంది.
ఇంతకీ వహీద గతం ఏమిటి? ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించిన ఆమె భయానికి గల కారణమేమిటి? ఫరూక్ ఎవరు? ఈ ప్రశ్నలకి సమాధానం కొంత ఊహాతీతంగా ఉన్నా కొంత సింపుల్ గా తేలిపోయినట్టుంది.
8-వీరం: మణిరత్నం రాసిన ఈ కథని సర్జున్ డైరెక్ట్ చేసారు. అథర్వ, కిషోర్, అంజలి ఇందులోని పాత్రలు. గ్రే హౌండ్స్ ఇన్స్పెక్టర్ వెట్రి ఒక నక్సలైట్ ని కూంబింగ్ లో పట్టుకుంటాడు. మిగిలిన పోలీసులు చనిపోవడంతో అతనిని జీపులో ఒక్కడే సిటీకి తరలించి ఆసుపత్రిలో చేర్చాల్సొస్తుంది. ఈ వెట్రి భార్య ముత్తులక్ష్మి. ఆమె గర్భవతి. తన ఊళ్లో కూర్చుని భర్త రాక కోసం ఎదురుచూస్తుంటుంది.
ఇంతకీ వెట్రి ఆ నక్సలైట్ ని ఆసుపత్రి చేర్చాడా? తన వీరత్వన్ని ఎక్కడ చూపించాడు, ఎలా చూపించాడేనిది కథ. ఒక రకంగా చూస్తే వీరత్వం ఇద్దరిదీ అనిపిస్తుంది. పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టినా నవ్వుతూ నిలబడ్డ నక్సలైట్, ప్రాణాలకి తెగించి ఒక్కడే గన్ పట్టుకుని అడవుల్లోకి పరుగెట్టిన వెట్రి..ఇద్దరూ వారి వారి స్థానాల్లో వీరులే. సింపుల్ గా ఉన్నా, ముగింపు క్లియర్ గా లేకపోయినా ఎంగేజ్ చేసే కథ ఇది.
9-శృంగారం: నవరసాల్లో శృంగారం రాజంటారు. కానీ ఇక్కడది బానిసలా ఉంది. అన్నిటికంటే వీక్ కథ, మూసకొట్టుడు కథనంతో జీడిపాకంలా సాగుతుంది. పైగా ఇందులో సూర్య హీరో. సూర్య ఒక మ్యూజిక్ డైరెక్టర్. హీరోయిన్ ఒక సింగర్. ఇద్దరి మధ్యలో జరిగే సున్నితమైన ఫస్ట్ క్రష్, కాస్తంత ప్రేమ… ఇదే 40 నిమిషాల ఎపిసోడ్ మొత్తం. మధ్యలో పాటలు మాత్రం బాగున్నాయి. ముఖ్యంగా నిన్నుకోరి వర్ణం బీజీయంస్ తో వచ్చే పాట చాలా బాగుంది. అంతకు మించి దీని గురించి చెప్పుకోవడానికేం లేదు.
బాటం లైన్: కొన్ని రసాలు, కొన్ని నీరసాలు