బాలీవుడ్ స్టార్ సింగర్ హనీ సింగ్ తనను వేధిస్తున్నాడని, మానసికంగా-శారీరంగా హింసిస్తున్నాడని అతడి భార్య షాలినీ ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఈ వివాదంపై హనీ సింగ్ స్పందించాడు. షాలినిని తను ఎంత ప్రేమగా చూసుకున్నానో, అందరికీ తెలుసంటున్నాడు.
ఈ కేసుపై తొలిసారి స్పందించిన హనీ సింగ్.. తన భార్య షాలినీని తానెప్పుడూ వేధింపులకు గురిచేయలేదంటున్నాడు. తను కేవలం తన భార్య మాత్రమే కాదని, తన మ్యూజికల్ బ్యాండ్ లో సభ్యురాలు కూడా అని తెలిపిన హనీ సింగ్… తను పాల్గొనే ప్రతి షూట్ కు, ఈవెంట్ కు షాలినీ వస్తుందని స్పష్టంచేశాడు. తన గ్రూప్ లో సభ్యురాలిగా కాకుండా, భార్యగా షాలినికి తను ఎప్పుడూ ప్రాధాన్యం ఇచ్చానని అన్నాడు.
ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందున ఇంతకుమించి స్పందించలేనన్న హనీ సింగ్.. షాలినీ తనపై కావాలనే ఆరోపణలు చేస్తోందంటూ ప్రత్యారోపణలు చేశాడు. షాలినీ తనపై చేసిన రాసలీలల ఆరోపణలపై మాత్రం హనీ సింగ్ స్పందించలేదు.
తన ఎదుటే, పంజాబీ హీరోయిన్ తో హనీ సింగ్ రాసలీలలు సాగించాడని షాలినీ ఆరోపించింది. హనీ సింగ్ తండ్రి కూడా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, మానసికంగా క్షోభకు గురిచేశారని చెప్పుకొచ్చింది. డ్రగ్స్ తీసుకుంటూ, రోజుకో అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. వీటిపై హనీ సింగ్ స్పందించలేదు.
హనీసింగ్, షాలినీ పదేళ్లు ప్రేమించుకున్నారు. 2011లో పెళ్లి చేసుకొని మరో పదేళ్లు కాపురం చేశారు. అలా 20 ఏళ్ల బంధానికి బీటలు వారేలా షాలినీ ఆరోపణలు చేసింది. షాలిని ఆరోపణలపై స్పందించడానికి కోర్టు, హనీ సింగ్ కు 28వ తేదీ వరకు గడువు ఇచ్చింది.