అశోక్‌గ‌జ‌ప‌తిరాజును విడిచి పెట్టేలా లేరే!

టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజును జ‌గ‌న్ ప్ర‌భుత్వం విడిచి పెట్టేలా లేదు. ఈ విష‌యాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ శ‌నివారం చేసిన వ్యాఖ్య‌లే చెబుతున్నాయి. ఎలాగైనా ఆయ‌న్ను…

టీడీపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గ‌జ‌ప‌తిరాజును జ‌గ‌న్ ప్ర‌భుత్వం విడిచి పెట్టేలా లేదు. ఈ విష‌యాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ శ‌నివారం చేసిన వ్యాఖ్య‌లే చెబుతున్నాయి. ఎలాగైనా ఆయ‌న్ను జైలుకు పంపాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టు …ప్ర‌భుత్వ పెద్ద‌ల మాట‌లు సంకేతాలు ఇస్తున్నాయి. 

మాన్సాస్‌, సింహాచ‌లం ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి దేవ‌స్థానానికి సంబంధించి భూముల అన్యాక్రాంతంలో అశోక్‌గ‌జ‌ప‌తిరాజు పాత్ర ఉంద‌ని, ఆయ‌న్ను జైలుకు పంపి తీరుతామ‌ని వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, పార్టీ క్రియాశీల‌క నేత విజ‌య‌సాయిరెడ్డి ఇటీవ‌ల చేసిన కామెంట్స్ రాజ‌కీయ దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బొబ్బిలిలో 4 వేల ఎక‌రాలు అన్యాక్రాంతం అయ్యాయ‌ని ఆరోపించారు. మాన్సాస్ ట్ర‌స్ట్‌, సింహాచ‌లం ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ఆస్తుల విష‌యంలో భారీగా అవ‌క‌త‌వ‌కలు బ‌యటప‌డ్డాయ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. అవకతవకలకు పాల్పడ్డ ఇద్దరు అధికారులను సస్సెండ్ చేశామని ఆయ‌న చెప్పుకొచ్చారు. సింహాచలం భూములు అన్యాక్రాంతమైతే ఛైర్మన్ కాపాడలేకపోయారని అశోక్‌గ‌జ‌ప‌తిరాజుపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

కొన్ని వందల ఎకరాలు అమ్ముకున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. వాటిని త్వ‌ర‌లో బయటపెడతామ‌ని మంత్రి హెచ్చ‌రించారు. ఛైర్మన్‌ కూడా తప్పు చేశారని తేలితే చర్యలు తీసుకుంటామ‌ని మంత్రి హెచ్చ‌రించ‌డం ద్వారా అశోక్‌గ‌జ‌ప‌తిరాజు జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని చెప్ప‌క‌నే చెప్పార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆభరణాలు కోటలో ఉండాల్సిన అవసరమేంటి? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆస్తులు, నగలను కాపాడతామ‌న్నారు.  

మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మ‌న్‌గా ఉన్న‌ అశోక్‌గజపతి రాజును గ‌త ఏడాది జ‌గ‌న్ ప్ర‌భు త్వం తొల‌గించి త‌న ఉద్దేశాన్ని స్ప‌ష్టం చేసింది. అనువంశిక ధ‌ర్మ‌క‌ర్త‌లెవ‌రినైనా చైర్మ‌న్‌గా నియ‌మించ‌నే సాకుతో అశోక్‌గ‌జ‌పతిరాజు సోద‌రుడు ఆనంద‌గ‌జ‌ప‌తిరాజు కుమార్తె సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును జ‌గ‌న్ ప్ర‌భుత్వం రాత్రికే రాత్రి నియ‌మించి సంచ‌ల‌నం సృష్టించింది. త‌న‌ను తొల‌గించ‌డంపై అశోక్‌గ‌జ‌ప‌తిరాజు హైకోర్టును ఆశ్ర‌యించి న్యాయ‌పోరాటం సాగించారు.

హైకోర్టులో అశోక్‌కు తీర్పు అనుకూలంగా వ‌చ్చింది. దీంతో ఆయ‌న తిరిగి పున‌ర్నియామ‌కం అయ్యారు. దీన్ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం జీర్ణించుకోలేక పోతోంద‌ని టీడీపీ శ్రేణులు మండిప‌డుతున్నారు. అందుకే ఆయ‌న‌పై క‌క్ష క‌ట్టార‌ని వాపోతున్నారు. ఈ నేప‌థ్యంలో మాన్సాస్ ట్ర‌స్ట్‌, ప్ర‌సిద్ధ సింహాచ‌లం ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ఆల‌య భూముల అన్యాక్రాంతంపై ప్ర‌భుత్వం దృష్టి సారించింది. ఇందులో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎంత మాత్రం స‌క్సెస్ అవుతుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.