ఏపీ ప్రభుత్వం, బీజేపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. గతంలో ఆలయాలపై దాడులు జరిగినప్పుడు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. తాజాగా మరోసారి రెండు పార్టీల మధ్య వాడివేడీ ఆరోపణలు చోటు చేసుకుంటున్నాయి. ఈ గొడవకు వైసీపీ మంత్రులు శ్రీకారం చుట్టడం గమనార్హం.
నిన్నటి వైసీపీ తీవ్ర ఆరోపణలకు, నేడు బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ట్విటర్ వేదికగా బీజేపీ జాతీయ నేత జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ… జగన్ ప్రభుత్వ ఫ్రస్ట్రేషన్ పీక్‌లో ఉందనడం గమనార్హం.
బీజేపీపై ఏపీ మంత్రి పేర్ని నాని చేసిన సంచలన వ్యాఖ్యలు, దానిపై ఆ పార్టీ ఎదురు దాడి …రెండు విషయాలను తెలుసు కుందాం. పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ…”మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తి సీఎం కావాలన్నది బీజేపీ ఆశ. టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యే పార్టీలు. గతంలో మోదీని తిట్టి ఇప్పుడు ప్రేమ లేఖలు రాస్తున్నారు” అని ఆయన ఎద్దేవా చేశారు.
పేర్ని నాని తీవ్ర ఆరోపణలపై జీవీఎల్ తనదైన స్టైల్‌లో ట్వీట్ చేశారు.
“ఆడలేక మద్దెల మీద పడి ఏడ్చినట్లుంది' మీ వ్యవహారం సీఎం వైఎస్ జగన్. అప్పులతో రాష్ట్రాన్ని ఈదలేక, కేంద్రంపై నిందలు మోపి ప్రజల దృష్టి మరల్చాలనుకుంటున్నారు. ఫెయిల్ అయిన టీడీపీ డ్రామా స్క్రిప్టును ఫాలో అవుతున్నారంటే ఫ్రస్ట్రేషన్ పీక్ లో ఉందని అర్ధమవుతోంది” అని దీటుగా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ మాదిరిగానే మీరు కూడా పతనమవుతారని వైసీపీని జీవీఎల్ నేరుగా హెచ్చరించారు.
జీవీఎల్ ట్వీట్‌పై నెగెటివ్ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం మిగులులో ఉందా? అని ఒకరు, అలాగే “మాకు అక్కరలేదు సార్ మీ టీడీపీ స్క్రిప్టులు. మీ బీజేపీలోనే వున్నారు టీడీపీ నేతలు. కోవిడ్ కారణంగా ఆదాయం లేదు. కుటుంబాన్ని పోషించాలి. మరి అప్పులు చేయకపోతే ఎలా సార్? మీరు ఇవ్వాల్సిన నిధులు కూడా మేము ఖర్చు పెట్టేకే మళ్ళీ వాయిదాల మీద ఇస్తారు. ఈ తప్పుడు ప్రచారం ఆపండి” అని నెటిజన్లు జీవీఎల్‌కు గట్టి కౌంటర్లు ఇస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది.