ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఈ రోజు (శనివారం) కీలక ఘట్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి 62 రోజులుగా అనేక మంది అనుమానితులను సీబీఐ అధికారులు విచారించారు.
కొందరిని అనేకసార్లు విచారించి కీలక ఆధారాలు సేకరించారని సమాచారం. ఈ నేపథ్యంలో కీలక నిందితుడిగా భావిస్తున్న సునీల్ యాదవ్‌ను పది రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈ క్రమంలో సునీల్ యాదవ్‌ను శనివారం సీబీఐ అధికారులు పులివెందులకు తీసుకెళ్లారు.
విచారణలో భాగంగా సునీల్ యాదవ్ ఇచ్చిన సమాచారంతో ఆయుధాల కోసం పులివెందులలో గాలింపు చేపట్టారని సమాచారం. సునీల్ సమక్షంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. వివేకా ఇంటి సమీపంలోని వాగులో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండడం పులివెందులలో సంచలనం కలిగిస్తోంది.
పెద్ద ఎత్తున పట్టణ వాసులు చూసేందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే సీబీఐ అధికారులు స్థానికులను అక్కడికి రాకుండా పోలీసులతో అడ్డుకున్నారు. రెండు మున్సిపల్ ట్యాంకర్లతో వాగులో నీటిని మున్సిపల్ అధికారులు తోడేస్తున్నారు.
వివేకా హత్యానంతరం మారణాయుధాలను వాగులో పూడ్చారా లేక విసిరి వేశారా? అనేది స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. కానీ ఆయుధాల సమాచారాన్ని సునీల్ యాదవ్ ఇవ్వడం వల్లే అతన్ని వెంట పెట్టుకుని సీబీఐ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లారనే సమాచారం వెల్లువెత్తుతోంది. దీన్ని బట్టి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెబుతున్నారు.
తాము అనుమానించినట్టు వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ పాత్రకు సంబంధించి ఆధారాలను సీబీఐ అధికారులు సేకరించే క్రమంలో నేటి పరిణామం కీలకంగా చెబుతున్నారు. సీబీఐ విచారణలో భాగంగా శరవేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి … అతి త్వరలో వివేకా హత్య కేసు మిస్టరీ వీడే అవకాశం ఉందని కడప జిల్లా వాసులు భావిస్తున్నారు.