జుట్టు పీక్కుంటున్న టీడీపీ!

రాజ‌కీయం అంటే ఎప్పుడేం జ‌రుగుతుందో తెలియ‌దు. ఎవ‌రి మాట‌ల వెనుక ఏ వ్యూహం ఉందో ఒక ప‌ట్టాన అర్థం కాదు. పైకి మాట్లాడేదంతా నిజ‌మే అనుకుంటే అంత‌కంటే అజ్ఞానం మ‌రొక‌టి వుండ‌దు. ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా…

రాజ‌కీయం అంటే ఎప్పుడేం జ‌రుగుతుందో తెలియ‌దు. ఎవ‌రి మాట‌ల వెనుక ఏ వ్యూహం ఉందో ఒక ప‌ట్టాన అర్థం కాదు. పైకి మాట్లాడేదంతా నిజ‌మే అనుకుంటే అంత‌కంటే అజ్ఞానం మ‌రొక‌టి వుండ‌దు. ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టించేందుకు ర‌క‌ర‌కాల ఎత్తులు పైఎత్తులు రాజ‌కీయ పార్టీలు వేస్తుంటాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ఏపీ అధికార పార్టీ వైసీపీ, క‌నీసం ఒక్క సీటు కూడా లేని బీజేపీ మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి.

త‌మ ప్ర‌భుత్వాన్ని కూల‌దోసేందుకు ఏపీ బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని మంత్రి పేర్ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం, దాన్ని మిగిలిన మంత్రులు అందిపుచ్చుకోవ‌డాన్ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆస‌క్తిగా గ‌మ‌నిస్తోంది. 

ఉరుములు మెరుపులు లేకుండానే పిడుగు ప‌డ్డ‌ట్టు… ఏ కార‌ణం లేకుండానే బీజేపీ, వైసీపీ మ‌ధ్య తీవ్ర ఆరోప‌ణ‌లు చోటు చేసుకోవ‌డం అర్థం కాక టీడీపీ ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తోంది. అయితే గియితే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా త‌మ ఉనికే త‌ప్ప‌, మిగిలిన పార్టీలేవీ క‌న‌ప‌డొద్ద‌నేది టీడీపీ భావ‌న.

అలాంటిది మంచోచెడో ప్ర‌జ‌ల్లో బీజేపీపై చ‌ర్చ జ‌ర‌గ‌డాన్ని టీడీపీ జీర్ణించుకోలేకుంది. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ మ‌త‌తత్వ పార్టీ అని మండిప‌డ్డారు. త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోంద‌ని పున‌రుద్ఘాటించారు. 

ఏపీలో ఏదో ఒక రకంగా లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు. ఏపీలో బలం పెంచుకోవాలని బీజేపీ మత రాజకీయం చేస్తోందని అంజాద్‌ బాషా ధ్వ‌జమెత్తారు. బీజేపీకి ఏపీలో అంత సీన్ లేద‌ని ఆయ‌న అన్నారు. ఇలా నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో కూడా బీజేపీ, వైసీపీ నేత‌లు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు.

బీజేపీ, వైసీపీ ప‌ర‌స్ప‌రం కౌంట‌ర్లు, ఎన్‌కౌంట‌ర్లు చేసుకుంటుంటే … ఇక రాజ‌కీయంగా త‌మ ఉనికి ఏంట‌నే ఆవేద‌న‌, ఆక్రోశం టీడీపీలో క‌నిపిస్తోంది. రెండు పార్టీలు కూడా త‌మ ఉనికి లేకుండా చేసే కుట్ర‌లో భాగంగానే తీవ్ర ఆరోప‌ణ‌ల‌తో స‌రికొత్త డ్రామాలు ఆడుతున్నాయ‌నేది టీడీపీ అభిప్రాయం. పైకి రెండు పార్టీలు తిట్టుకుంటున్న‌ట్టు క‌నిపిస్తున్నా… అది నిజం కాద‌నేది ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆలోచ‌న‌. మ‌రి దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.