ప్రస్తుతం కరోనా టీకాను 2 డోసుల్లో అందిస్తున్నారు. ఒక డోసు పూర్తయిన తర్వాత రెండో డోస్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఆచరణలోకి వచ్చేసరికి ఇక్కడ చాలా సమస్యలు ఎదురవుతున్నాయి.
మరీ ముఖ్యంగా ఇండియా లాంటి జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో రెండో డోస్ టైమ్ వచ్చేసరికి, వ్యాక్సిన్ల కొరత పట్టి పీడిస్తోంది. 18-44 మధ్య వయసున్న వ్యక్తులకు ఇప్పటికీ సెకెండ్ డోస్ ప్రారంభంకాలేదు. ఇప్పుడీ సమస్యలకు విరుగుడుగా కరోనా సింగిల్ డోస్ వస్తోంది.
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన సింగిల్ డోస్ టీకాను భారత్ లో వినియోగించేందుకు అత్యవసర అనుమతులు మంజూరు చేసింది కేంద్రం. దీంతో ఇండియాలో అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన టీకాల సంఖ్య 5కు చేరింది. ఈ కంపెనీ టీకా సింగిల్ డోస్ చాలు.
ఇప్పటికే రష్యాకు చెందిన సంస్థ రెండు డోసుల్లో ఇచ్చే స్పుత్నిక్-వి టీకాను ఉత్పత్తి చేసిన సంగతి తెలిసిందే. ఇదే సంస్థ సింగిల్ డోస్ లో ఇచ్చే స్పుత్నిక్ లైట్ వెర్షన్ ను కూడా తయారుచేసింది. దీనికి రష్యాలో అత్యవసర అనుమతి కూడా లభించింది.
ఈ సింగిల్ డోస్ టీకా 79.4శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు నిర్థారణ అయింది. ఈ స్పుత్నిక్ లైట్ టీకా కోసం ఇండియాకు చెందిన 6 కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతలోనే జాన్సన్ కంపెనీకి చెందిన సింగిల్ డోస్ టీకాకు అనుమతి లభించింది.
ప్రస్తుతం స్పుత్నిక్ టీకా ప్రైవేట్ లో ఎక్కువగా అందుబాటులో ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ లో చాలామంది స్పుత్నిక్ టీకానే ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి జాన్సన్ సింగిల్ డోస్ టీకా కూడా చేరింది.
సింగిల్ డోస్ కాబట్టి దీని ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. అటు స్పుత్నిక్ లైట్, ఇటు జాన్సన్ సింగిల్ డో్ టీకాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకునే అవకాశం ఉంది.