జైలుకెళ్లడం అనేది వెరీ బ్యాడ్. సమాజం అతడ్ని హీనంగా చూస్తుంది. కానీ రాజకీయాల్లో ఇది రివర్స్. జైలుకెళ్తే సింపతీ వస్తుంది, ఇమేజ్ పెరుగుతుంది, నెగెటివ్ అనుకున్నది కాస్తా పాజిటివ్ అవుతుంది. జగన్ విషయంలో అదే జరిగింది. ఇలాంటి సింపతీ కోసం, ఇలాంటి అదృష్టం కోసం లోకేష్ కూడా వెంపర్లాడుతున్నట్టు కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి జగన్ పై హద్దుమీరి వ్యాఖ్యలు చేస్తున్నారు చినబాబు. పదే పదే జగన్ ని తిట్టడం, అరే తురే అనడం, దమ్ముంటే రారా తేల్చుకుందామంటూ మేకపోతు గాంభీర్యం చూపడం.. ఇవన్నీ లోకేష్ స్కిట్ లో భాగమే. అయితే సహజంగా రక్తి కట్టించాల్సిన ఆ స్కిట్ ని లోకేష్ నవ్వులపాలు చేస్తున్నారు.
లోకేష్ సీరియస్ యాక్షన్ చేసినా అది కామెడీగానే అనిపిస్తోంది మరి. అందుకే ఆ తర్వాతి రోజు మంత్రులు చినబాబుకి చాకిరేవు పెడుతున్నారు తప్ప.. పోలీసు కేసు, జైలు అని మాత్రం అనడం లేదు.
లోకేష్ జైలుకెళ్తే ఎల్లో మీడియా పరిస్థితేంటి?
అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాల్ల నరేంద్ర.. రీసెంట్ గా దేవినేని ఉమకు ప్రతిపక్షంలో ఉండగా జైలు భాగ్యం దక్కింది. ఒకరకంగా వారిపై కార్యకర్తల్లో సింపతీ పెరిగింది. వారు చేసిన తప్పులు కనిపించడంలేదు కానీ, అన్యాయంగా జగన్ జైలులో పెట్టించారనే ప్రచారం పచ్చమీడియాతో పదింతలు పెరిగింది.
వారికే అంత సీన్ ఇచ్చారంటే ఇక లోకేష్ జైలుకెళ్తే, పచ్చ పత్రికల్లో ఆ ఊరేగింపు ఏ రేంజ్ లో ఉంటుందో ఊహకు కూడా అందదు. ఆమధ్య చినబాబు బులుగు చొక్కా ఒకటి వేసుకుంటేనే, దశావతారాల రంగు, ఎన్టీఆర్ కి అత్యంత ఇష్టమైన రంగు.. అంటూ హడావిడి చేసింది ఓ ఛానెల్. అదే లోకేష్ జైలుకెళ్తే.. అప్పట్లో గాంధీ, ఇప్పుడు చిన గాంధీ అంటూ కంపేరిజన్ చేయక మానదు. అందుకే లోకేష్ కి ఆ అవకాశం ఇవ్వట్లేదు జగన్.
లోకేష్ ని ఒక తిట్టు తిడితే, అరతిట్టు వేస్ట్..
సినిమాల్లో విలన్ల పక్కన కమెడియన్లుంటారు. హీరో విలన్ ని చితగ్గొట్టినా చివర్లో కమెడియన్ ని తిట్టి వదిలేస్తాడు. నీపై చెయ్యెత్తడం కూడా దండగ అనేస్తాడు. రాజకీయాల్లో లోకేష్ కూడా అదే టైపు. అందుకే జగన్ ఎప్పుడూ ఆయన్ని పట్టించుకోలేదు.
సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న చాలామంది, వైసీపీ హయాంలో జైలు ఊచలు లెక్కబెట్టి బయటకు వచ్చారు. ట్విట్టర్ లో పిచ్చి ప్రేలాపలను పేలే లోకేష్ ని అలాంటి ఓ కేసులో లోపలికి తోయడం పెద్ద పనేం కాదు. కానీ ఎంత రెచ్చగొట్టినా అక్కడున్నది జగన్.
లోకేష్ కు ఎలా చెక్ పెట్టాలో జగన్ కు బాగా తెలుసు. అందుకే ఆ విషయంలో జగన్ సైలెంట్ గా ఉన్నారు. ఆయన మనసెరిగి అధికారులు కూడా లోకేష్ కి రెచ్చిపోయే అవకాశాలను పుష్కలంగా ఇస్తున్నారు. లోకేష్ ఎన్ని విమర్శలు చేసినా ఆటలో అరటిపండులా ఆయన్ని తీసి పక్కనపడేస్తున్నారు తప్ప, సీరియస్ గా తీసుకోవడం లేదు.
అయితే జగన్ కి లోకేష్ కి ఒకటే తేడా. జగన్ పరిస్థితుల ప్రభావం వల్ల, కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించడం వల్ల జైలుకెళ్లాల్సి వచ్చింది. కాంగ్రెస్ ఒకటి తలిస్తే, ఏపీ ప్రజలు మరొకటి తలిచారు. జగన్ ని జైలులో వేసి ఇబ్బంది పెడతామని చూస్తే, ప్రజలు ఆయన్ను అందలమెక్కించారు. ఏకంగా సీఎం ను చేశారు.
లోకేష్ మాత్రం తనకు తానే జైలుకెళ్లడానికి సిద్ధపడుతున్నారు. జైల్ భరో లాంటి కార్యక్రమాలేవీ లేవు కాబట్టి.. ఎలాగోలా జగన్ ని రెచ్చగొట్టి జైలుకెళ్లి హీరో అవుదామనుకుంటున్నారు చినబాబు.