ఆ నలుగురి ఏడుపులే.. జనం పట్టించుకోలేదు!

హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు పేరు తొలగించి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం అనేది రాష్ట్రంలో ప్రకంపనాలు సృష్టిస్తుందని ఆశపడిన తెలుగుదేశానికి భంగపాటు తప్పలేదు. ఈ పరిణామాన్ని ప్రజలు చాలా సాధారణమైన…

హెల్త్ యూనివర్సిటీకి నందమూరి తారక రామారావు పేరు తొలగించి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడం అనేది రాష్ట్రంలో ప్రకంపనాలు సృష్టిస్తుందని ఆశపడిన తెలుగుదేశానికి భంగపాటు తప్పలేదు. ఈ పరిణామాన్ని ప్రజలు చాలా సాధారణమైన విషయంగా తీసుకున్నారు. 

రాష్ట్రంలో అధికారం పార్టీల మధ్య చేతులు మారినప్పుడు.. వారి వారికి ఇష్టులైన రాజకీయ నాయకుల పేర్లు పెట్టుకోవడం అది వరకు ఉన్న పేర్లను తొలగించడం చాలా సాధారణమే అన్నట్టుగా ప్రజలు స్వీకరించారు. ఎన్టీఆర్ పేరు తొలగించడం అంటే.. ఆ అంశాన్ని వాడుకొని రాష్ట్రమంతా నిరసనలను పోటెత్తించి, అగ్నిగుండంగా మార్చేయవచ్చునని చంద్రబాబు నాయుడు కలగన్నారు గాని ప్రజలలో ఏమాత్రం స్పందన లేదు.

హెల్త్ యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టేవరకు ఊరుకునేది లేదని చంద్రబాబు నాయుడు మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నారు. ఊరుకోకుండా ఆయన ఏం చేస్తారు? అనేది మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. నిజంగా తెలుగుదేశం పార్టీ గాని, పచ్చ మీడియా గానీ ప్రచారం చేస్తున్నట్లుగా ఈ నిర్ణయం పట్ల ప్రజలలో విముఖత ఉన్నట్లయితే అది ఈపాటికి ఏదో ఒక రూపంలో వ్యక్తం అయి ఉండాలి. అలా జరగలేదు. జనం ఎవ్వరూ దీని గురించి పట్టించుకోలేదు.

ఈ పేరు మార్పు వ్యవహారాన్ని వీలైనంత రాద్ధాంతం చేయడానికి చంద్రబాబు నాయుడు తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు గాని కుదరడం లేదు. రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఈ నిర్ణయం వెనక్కి తీసుకునేలా చూడాలని ఒక వినతి పత్రం సమర్పించారు. తాము చెప్పే వరకు శాసనసభలో బిల్లు తీర్మానంగా మారిన సంగతి కూడా సదరు యూనివర్సిటీకి ఛాన్సలర్ గా ఉన్న గవర్నరుకు తెలియనే తెలియదని చంద్రబాబు నాయుడు ఆక్రోశం వెలిబుచ్చారు కూడా! కానీ ఆయన వినతి పత్రానికి ఇక్కడ ఫలితం లభిస్తుందో లేదో తెలియదు. ఇంకా ముందుకు వెళ్లదలుచుకుంటే మహా అయితే ప్రధానికి ఒక లేఖ రాస్తారు రాష్ట్రపతికి మరొక వినతిపత్రం ఇస్తారు అంతకుమించి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ చేయగలిగింది ఏమీ లేదు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి చాలా పద్ధతిగా శాసనసభ తీర్మానం ద్వారా యూనివర్సిటీ పేరు మార్చారు. ఇందులో న్యాయపరమైన చిక్కు కూడా లేదు. తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టేదాకా ఊరుకునేది లేదు అని చంద్రబాబు అన్నంత మాత్రాన జగన్ జడుసుకుంటాడని అనుకోలేము. న్యాయపరమైన వివాదాల్లో కోర్టులు తీర్పులు చెప్పిన సందర్భాలలో మినహా జగన్ ఏనాడూ తాను తీసుకున్న నిర్ణయాలపై వెనకడుగు వేసింది లేదు. అలాంటిది తన తండ్రి పేరు పెట్టిన తర్వాత వెనకడుగు వేస్తారనుకోవడం పిచ్చి భ్రమ.

అన్నింటిని మించి ఎన్టీఆర్ పేరును తొలగించారు అనే సంగతి రాష్ట్ర ప్రజలలో పెద్దగా సంచలనం కలిగించలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు పోటెత్తించాలని తెలుగుదేశం పార్టీ భావించినప్పటికీ అవి కార్యకర్తలు మొక్కుబడిగా చేపట్టారు. తూతూ మంత్రంగానే జరిగాయి. స్వచ్ఛందంగా ప్రజలు ఎక్కడా మద్దతు ప్రకటించిన దాఖలాలు లేవు. ప్రజలు సమర్ధించనప్పుడు చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాల కోరిక ఎలా నెరవేరుతుంది?