భారతీయ జనతా పార్టీ విద్వేష రాజకీయాలు సాగిస్తూ ప్రజలలో ఒక అభద్రతను సృష్టిస్తుందనే వాదన చాలామంది నుంచి మనకు వినిపిస్తూ ఉంటుంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, అనేక సందర్భాలలో భారతీయ జనతా పార్టీ నాయకుల స్పందనలు, మాటలు ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ ఉంటాయి.
విద్వేష రాజకీయాలే పార్టీకి ఆలంబన, అవే దిక్కు అన్నట్లుగా ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తుంటారు. ‘తాము అధికారంలో లేని చోట్ల ఎడాపెడా ప్రజలను మత ప్రాతిపదికన రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు’ అనడానికి తెలంగాణలో వర్తమాన రాజకీయాలే పెద్ద తార్కాణం! అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తీరు మారుతుందా? అధికారంలోకి రావడం అంటూ జరిగితే విద్వేషం సంగతి అటుంచి.. విధ్వంస రాజకీయాలు తప్పవని వాళ్లే స్వయంగా చాటుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో సాగిస్తున్న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఇలాంటి విధ్వంస ఆలోచనల ప్రతిధ్వనులే వినిపించాయి. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా హాజరైన ముఖ్య అతిథి కేంద్ర సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ తాము అధికారంలోకి రాగానే దోపిడీదారుల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపిస్తామని హెచ్చరించారు. అయితే దోపిడీదారులుగా వారు ఎవరిని గుర్తిస్తారు అనేది ప్రజల మదిలో మెదలుతున్న సందేహం.
సాధ్వి నిరంజన్ జ్యోతి తెలంగాణ పార్టీ సభలో చాలా రెచ్చిపోయి మాట్లాడారు. రాహుల్ చేస్తున్నది భారత్ జోడోయాత్ర కాదని భారత్ చోడో యాత్ర అని ఎద్దేవా చేశారు. మోడీని గద్దె దింపుతాం అని బీరాలు పలుకుతూ కేసీఆర్ నితీష్, మమతా బెనర్జీ, శరద్ పవార్ లాంటి అనేకమంది నాయకులు ప్రధాని కావడానికి తమలో తాము కీచులాడుకుంటున్నారని, వారు ఐక్యం కావడం ఎన్నటికీ జరగదని ఆమె జోస్యం చెప్పారు.
ఇందులో భాగంగానే తాము తెలంగాణలో అధికారంలోకి వస్తే, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ మోడల్ పరిపాలనను తీసుకువస్తాం అన్నట్లుగా సాధ్వి నిరంజన్ జ్యోతి సెలవివ్వడం చిత్రమైన సంగతి. యూపీలో బుల్డోజర్ల ద్వారా ఇళ్లను కూల్చివేయించడంలో ప్రభుత్వం అభాసుపాలైంది. యోగి ఆదిత్యనాథ్ న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్నారు. తమకు కిట్టని వారి ఇళ్లను కూల్చి వేయిస్తున్నారంటూ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
అవినీతికి పాల్పడడమే నిజమైతే గనుక దానికి వారి ఇళ్లను కూల్చివేయడం ఎందుకు.. అదే ఇళ్లను అధికారికంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని మరింత విస్తృతమైన ప్రజా ప్రయోజనాలకు వాడుకోవచ్చు కదా? అనేది సాధారణంగా చాలామంది ప్రజల మదిలో మెదలే సంగతి. అయితే భారతీయ జనతా పార్టీ ఆలోచన సరళిలోనే విధ్వంసం ఉన్నదని, అందుకే కూల్చివేతల మీదనే వారు ఎక్కువ దృష్టి పెడతారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి.
యోగి ఆదిత్యనాథ్ మోడల్ పరిపాలన అంటే.. తెలంగాణలో అధికారంలోకి రాగానే ఎవరెవరి ఇళ్లను కూలుస్తారో అనేది అందరిలో భయం. ఈ విధ్వంసానికి కూల్చివేతలకు మతం కూడా ఒక ప్రాతిపదిక కొలబద్ధ అయితే గనుక తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సుహృద్భావ సామరస్య వాతావరణం సర్వనాశనం అవుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.