ఎన్టీయార్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ను వైయస్సార్ హెల్త్ యూనివర్శిటీగా పేరు మార్చడంపై ఆంధ్రరాష్ట్రంలో ఘాటైన చర్చలు జరుగుతున్నాయి. పేరు మార్చే బిల్లు ప్రవేశపెడుతూ జగన్ దాన్ని సమర్థించుకోవడానికి చేసిన ప్రయత్నం నవ్వు తెప్పించింది. ఎన్టీయార్ ఆరోగ్యం గురించి ఏ పథకమూ పెట్టలేదట, టిడిపి హయాంలో ఏ మెడికల్ కాలేజీ పెట్టలేదట, అందువలన ఆయన పేరు తీసేసి వృత్తిరీత్యా వైద్యుడు, ఆరోగ్యశ్రీ వంటి స్కీము పెట్టిన వైయస్సార్ పేరు పెట్టడం సముచితమట. రెండు రూపాయలకు కిలో బియ్యం యిప్పించి పెద్దవాళ్లకు, మధ్యాహ్న భోజన పథకం పెట్టి పిల్లలకు ఆహారం దొరికేట్లా చేసి, అనారోగ్యం పాలు కాకుండా చేయడం ఆరోగ్యపరిరక్షణ కింద రాదేమో నాకు తెలియదు.
నాయకుల పేరు పెట్టడానికి, అతని వృత్తికి లింకు పెట్టాలనుకుంటే, గాంధీ పార్కు, నెహ్రూ రోడ్డు అనేటప్పుడు ఏ ఔచిత్యముంది? గాంధీగారు పార్కులు కట్టే వ్యాపారంలో ఉన్నారా? నెహ్రూ గారు రోడ్లేశారా? ఎయిర్ ఇండియా విమానానికి కనిష్క పేరు పెట్టడంలో అర్థమేమిటి? కనిష్కులు విమానాల్ని కనిపెట్టారా? అమ్మ ఒడికి, గోరుముద్ద పథకాలకు జగన్ పేరెందుకు? ఆయన అమ్మా కాదూ, పిల్లలకు గోరుముద్దా తినిపించీ ఉండడు. తన పేరు బదులు విజయమ్మ పేరు పెట్టాల్సింది. ఆటో డ్రైవర్ల కోసం పెట్టిన వాహనమిత్ర పథకానికి వైయస్సార్ పేరెందుకు పెట్టారు? వైయస్సార్ ఆటో డ్రైవరా? వైయస్ ఆరోగ్యశ్రీ ప్రారంభించినప్పుడు రాజీవ్ పేరెందుకు పెట్టారు? రాజీవేమైనా డాక్టరా?
వైయస్ పేరూ, జగన్ పేరూ యిప్పటికే అనేకవాటికి ఉన్నాయి. వైయస్ ప్రజలకు వైద్యుడిగానే గుర్తుండి పోవాలనుకుంటే, తక్కిన పథకాలకు ఆ పేరు తీసేసి, 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయిగా, వాటికి పెట్టండి. ఉన్నది మార్చడం దేనికి? ఒకే సంస్థకు యిద్దరు ప్రముఖుల పేర్లు పెడదామనుకున్నపుడు ఒక ఉపాయం ఉంది. ఎయిర్‌పోర్టులలో ఇంటర్నేషనల్ వింగ్‌కు జాతీయ స్థాయి నాయకుడి పేరు, డొమెస్టిక్ వింగ్‌కు రాష్ట్రస్థాయి నాయకుడి పేరూ పెడతారు. అలాగే హెల్త్ యూనివర్శిటీ విషయంలో కూడా యూనివర్శిటీకి ఎన్టీయార్ పేరు ఉంచేసి, దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులకు వైద్యుడిగా పనిచేసిన వైయస్సార్ పేరు పెట్టి ఉంటే పోయేది.
ఎన్టీయార్ పేరు మారుద్దామనుకున్నపుడు ప్రతిఘటన వస్తుందని ముందే ఊహించవచ్చు కాబట్టి, ప్రతిగా మరో సంస్థకు ఎన్టీయార్ పేరు పెట్టాల్సింది. కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాం కదా అంటే అది పాతబడి పోయింది. రవీంద్రభారతి వంటి పెద్ద ఆడిటోరియం ప్రభుత్వపక్షాన కట్టి, దానికి కళాకారుడైన ఎన్టీయార్ పేరు పెట్టాల్సింది. తెలుగు జాతి ఆత్మగౌరవ నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి కాబట్టి తెలుగు జాతి ఔన్నత్యం గురించి ప్రభుత్వం ఓ మ్యూజియం ప్లాన్ చేసి దానికి ఎన్టీయార్ పేరు పెట్టాల్సింది. తమిళనాడులో ఎమ్జీయార్ పేర మ్యూజియం ఉన్నట్లు, ఎన్టీయార్ సినిమా, రాజకీయ జీవితాలను ప్రతిబింబించేట్లా మ్యూజియం పెడుతున్నామని ప్రకటించాల్సింది.
కొత్తవి కట్టి వాటికి చిత్తమైన పేరు పెట్టవచ్చు, పాతదానివి మార్చడం దేనికి? అని మనం అడగవచ్చు. కానీ టిడిపి అడగలేదు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ వంటి మరో పథకాన్ని పెట్టే బదులు ఉన్న పథకానికే డా. ఎన్టీయార్ వైద్య సేవ అని పేరు మార్చారు. కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు 2013లో ఆరోగ్యశ్రీ భవనానికి వైయస్సార్ భవన్ పేరు తీసేశాడు. వైయస్ బొమ్మ వాడడం మానేశాడు. రాష్ట్రవిభజన తర్వాత బాబు దానికి ఎన్టీయార్ బొమ్మ జోడించాడు. ఆరోగ్యశ్రీ ఎవరి బ్రెయిన్ చైల్డో అందరికీ తెలుసు. అలాగే హెల్త్ యూనివర్శిటీ పేర అన్ని మెడికల్ కాలేజీలనూ కలపడం ఎన్టీయార్ బ్రెయిన్ చైల్డ్. దానికి ఎన్టీయార్ పేరు కలిపినది బాబు. ఎప్పుడు? ఎన్టీయార్ మరణించాక, ఆ పేరు వాడుకోకపోతే ఓట్లు రాలవని తోచాక! పేరు ఎవరిది ఉన్నా సంస్థ అందించే సేవలలో మార్పు రాదు కాబట్టి, సామాన్యుడిపై పేరు మార్పు ఎలాటి ప్రభావమూ చూపదు. దాన్ని ఎమోషనల్ యిస్యూగా చేయడానికి రాజకీయ పార్టీలకు మాత్రం ఉపయోగపడుతుంది.
ఈ ఒక్క యూనివర్శిటీ పేరు మారిస్తే తెలుగుజాతికి అవమానం జరిగిపోయిందని టిడిపి, కొందరు వ్యక్తులు ఆక్రోశిస్తున్నారు. ఎన్టీయార్, వైయస్సార్ యిద్దరూ తెలుగువాళ్లే. ఇద్దరూ పంచెకట్టు నాయకులే. ఎన్టీయార్ పేరు తీసేసి సోనియా పేరు పెడితే తెలుగు జాతి పేరు చెప్పి గొడవ చేయవచ్చు. అయినా హైదరాబాదులో పార్కు కట్టి, దానికి ఏ తెలుగు నాయకుడి పేరూ పనికిరానట్లు జాతీయ స్థాయిలో కూడా పెద్ద నాయకుడు కాని కృష్ణకాంత్ పేరు పెట్టినపుడు పేరులోనే తెలుగు పెట్టుకున్న టిడిపి తెలుగు అభిమానం ఏమైంది? కృష్ణకాంత్ స్వరాష్ట్రంలో తెలుగు నాయకుల పేర పార్కులు కడతారా?
ఎన్టీయార్ తెలుగువారి ఆరాధ్యదైవం అనే స్లోగన్ ఒకటి మధ్యలో. అంత సీనేం లేదు. సినీ హీరోగా అయితే ఎయన్నార్‌కు సమానస్థానం ఉంది. పోటీగా కృష్ణ, శోభన్బాబులున్నారు. ఇక ప్రజానాయకుడిగా అయితే స్వల్పకాలంలోనే 1983లో ఘనవిజయం సాధించిన మాట నిజమే, నాదెండ్ల తిరుగుబాటు సానుభూతితో 1985లో మళ్లీ నెగ్గిన మాటా నిజమే, కానీ 1989లో ఓడిపోయారు కదా! 1994లో మళ్లీ గెలిచారు కానీ 1995లో చంద్రబాబు కూలదోస్తే జనాల్లో స్పందన లేదు. ఆరాధ్యదైవమైతే జనాలు గతంలోలా రోడ్ల మీదకు వచ్చి అల్లకల్లోలం చేసి ఉండాలి. అదేమీ జరగలేదు. 1996లో ఎన్టీయార్ మరణించకుండా ఉండి, పార్లమెంటు ఎన్నికలలో బాబు టిడిపితో పోటీ పడి వుంటే ఎన్టీయార్ నెట్‌వర్త్‌పై అంచనా వచ్చి ఉండేది.
ఇక బాబు హయాంలోని టిడిపి మాట కొస్తే ఎన్టీయార్ బొమ్మ చూపించి ఓట్లడిగినా ప్రజలు 1999లో గెలిపించారు తప్ప 2004, 2009లో ఓడించారు. రాష్ట్రం విడిపోయాక మాత్రమే 2014లో గెలిపించారు, 2019లో చిత్తుగా ఓడించారు. గెలిపించిన రెండు మార్లూ పొత్తు పెట్టుకుంటేనే గెలిపించారు. అందువలన ఎన్టీయార్ అంటే ప్రజలు ఆరాధించారు అనడం మాత్రం అతిశయోక్తే. అభిమానించేవారు, అదీ పాతతరం వాళ్లు, అంటే ఓకే! ఎన్టీయార్ పోయే పాతికేళ్లు దాటిపోయింది. గూగుల్‌లో ఎన్టీయార్ పేరు అని కొడితే జూనియర్ బొమ్మలు వస్తున్నాయి. ఎన్టీయార్ పోయాక 13 ఏళ్లు బతికిన వైయస్ 2009 వరకు ఉన్నారు. జగన్ రాజకీయాల్లో ఉండి ఉండకపోతే ఆయన పేరూ మరుగున పడి ఉండేది. తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీయే ఆ పేరు వాడుకోవటం లేదు.
ఎన్టీయార్ పేరు టిడిపి వాడుకుందామని చూసినప్పుడల్లా వెన్నుపోటు ప్రస్తావన వస్తుంది. నిజం చెప్పాలంటే అది ఒక చారిత్రక వాస్తవం. దానిపై పార్టీలో కానీ, ప్రజల్లో కానీ పెద్ద వ్యతిరేకత రాలేదు. వెన్నుపోటు తర్వాత కూడా బాబుని నాయకుడిగా పార్టీ, ప్రజలు అంగీకరించారు. ఎన్టీయార్ బతికి ఉండి ఓ పక్క దీనావస్థలో పడి ఉంటే, అప్పుడు బాబుపై కోపం రగిలి, ప్రతిఘటించేవారేమో కానీ, ఎన్టీయార్ మరణంతో అది ముగిసిన అధ్యాయం అయిపోయింది. ఆయన వారసులెవరైనా యాగీ చేసినా కథ వేరేలా వుండేది. వాళ్లంతా బాబు పంచనే చేరారు. ఇక లక్ష్మీపార్వతికి కథాకాలక్షేపానికి మాత్రమే పనికివస్తారు. ఎన్టీయార్ బతికున్నపుడే ఆవిణ్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు అసలే తీసుకోరు. అప్పుడప్పుడు టీవీ ఛానెల్లో కనబడితే భరిస్తారంతే.
ఎన్టీయార్ పట్ల బాబు ధోరణి లోపలికి ఒకటి, బయటకు మరొకటిగా ఉంటూ వచ్చింది. ఏ మేరకు ప్రాధాన్యత యివ్వాలో ఆయన తేల్చుకోలేక పోయారు. కబీరు దోహాలో దేవుడు-మనిషి గురించి చెప్పిన తీరులో, తను లో టైడ్‌లో ఉన్నపుడు ఎన్టీయార్ పేరుని బయటకు తీసి ఆరేస్తారు, తన ప్రభ వెలుగుతున్నపుడు ఆయన్ను పక్కన పెడతారు. ప్రభ చాలాకాలం వెలిగినప్పుడు విస్మరించేశారు కూడా. అందుకే రాష్ట్రపతులను, ప్రధానులను నియమించగలిగిన స్థాయిలో ఉన్నపుడు ఎన్టీయార్‌కు భారతరత్న ఎందుకు యిప్పించలేదు? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం పైకి చెప్పలేరు. పార్లమెంటులో ఎన్టీయార్ విగ్రహం కూడా కాంగ్రెసు మంత్రిగా ఉండగా పురంధరేశ్వరి పెట్టించినదే! టిడిపికి ఆహ్వానం కూడా అందలేదు కాబట్టి, దాన్ని వీళ్లు క్లెయిమ్ చేసుకోలేరు. పోనీ అవి జాతీయస్థాయివి, జిల్లా పేరు మార్చడం రాష్ట్రస్థాయిలో జరిగే పని. 1996-2004 మధ్య కానీ, 2014-19 మధ్య కానీ ఏ జిల్లాకూ ఆయన పేరు పెట్టలేదు.
ఇప్పుడు మాత్రం ఒక సంస్థకు పేరు మార్చగానే తెలుగుజాతి గర్జిస్తోంది అంటూ ఘోషిస్తున్నారు. అన్న క్యాంటీను ఎత్తివేసినపుడు యీ స్థాయిలో నిరసన తెలపలేదు. ఎందుకంటే అన్న అంటే ఎన్టీయార్ ఒక్కరే అనడానికి లేదు. గతంలో అయితే బ్రహ్మానంద రెడ్డి, చెన్నారెడ్డి, వెంగళరావు యిలా వరసలు కలుపుకోలేదు. ఎన్టీయార్ వచ్చిన దగ్గర్నుంచి వరసలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఎన్టీయార్ ఒక్కడే. ఇటీవల అందరూ అన్నలే. ఆయన అల్లుడు చంద్రబాబూ అన్నే. వైయస్సూ అన్నే, ఆయన కొడుకు జగనూ అన్నే. మామయ్యో, బాబయ్యో అవడానికి ఎవరూ ఒప్పుకోవటం లేదు. ఈ సారి మాత్రం ‘అన్న’ అని కాకుండా సాక్షాత్తూ పేరునే మార్చేస్తున్నారు కాబట్టి యీ ఆందోళన.
ఇంతకీ జగన్ ఎందుకిలా చేస్తున్నట్లు? పేరు మార్చడం వలన వైయస్‌కు కొత్తగా వచ్చే ఖ్యాతి ఏమీ లేదు. పేరు మార్చారు కదాని వైసిపికి కొత్తగా పడే ఓట్లూ లేవు. మరి ఎందుకు అని ఆలోచిస్తే నాకు రాజకీయ వ్యూహం ఒకటి తడుతోంది. ఇది తప్పయితే కావచ్చు, కేవలం నా ఊహ మాత్రమే. ‘లాభం లేనిదే వరదన వ్యాపారి పోడు’ అన్నట్లు జగన్ యీ పని ఏదో లక్ష్యంతో చేశాడనే అనుకోవాలి. అదేమిటో వివరించాలంటే బిజెపి ముస్లిముల పట్ల అనుసరిస్తున్న వ్యూహం గురించి మాట్లాడాలి. బిజెపి ముస్లిములను జనజీవనస్రవంతిలో భాగంగా చూడదు. వేరే జాతి వారిగానే చూస్తుంది. పాకిస్తాన్‌కి వెళ్లకుండా హిందూస్తాన్లోనే ఉండిపోయారు కదాన్న కన్సిడరేషన్ దానికి లేదు. పని కట్టుకుని వారిని కెలుకుతుంది.
ఉదాహరణకి వాళ్ల ఆహారపు అలవాట్లపై నియంత్రణ విధిస్తుంది. గతం గతః అని ఊరుకోకుండా ముస్లిము ప్రార్థనాలయాలపై కేసులు పెట్టిస్తుంది. దానిని వారు ఎదుర్కుంటే ‘చూశారా, వాళ్లంతా కలిసికట్టుగా ఎలా ఎదురు తిరుగుతున్నారో, వారికి వ్యతిరేకంగా మనమంతా సంఘటితం కావాలి’ అంటూ హిందువుల ఓట్లను కన్సాలిడేట్ చేసి లాభపడుతోంది. తక్కిన పార్టీలు యిన్నాళ్లూ హిందువులను ప్రాంతాల వారీగా, కులాలవారీగా చీల్చి ఓట్లు దండుకున్నాయి. కానీ అవి ఒక పరిమితికి మించి పోలేవు. 80శాతం మంది హిందూ జనాభా ఉన్న దేశంలో వారిలో ముస్లిము బూచి చూపించి 60శాతం మందిని ఏకీకృతం చేసినా మెజారిటీ ఓట్లు వచ్చి సీట్లు గెలవవచ్చు. బిజెపి ఆ విధానంతోనే సీట్ల సంఖ్య పెంచుకుంటూ పోతోంది. దీన్ని ఎదిరించడానికి ముస్లిములు సంఘటితం అవుతున్నారు. వాళ్లు సంఘటితం అవుతున్నకొద్దీ, దాన్ని చూపించి బిజెపి హిందువులను కన్సలిడేట్ చేసి, బలపడగలుగుతుంది.
2019 ఎన్నికలలో యితర అంశాలు చాలా ఉన్నప్పటికీ కమ్మ-యాంటీ కమ్మ అంశం కూడా ఒక బలమైన అంశమేనని గమనించాలి. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి కమ్మల పట్ల వివక్షత చూపిస్తున్నట్లు తోస్తుంది. ఎన్నికల కమిషనర్ ఏ పొరపాటు చేసినా సరే, ముఖ్యమంత్రి అతని కులప్రస్తావన చేయడం ఎన్నడూ జరగదు. జగన్ అది చేసి, తను కమ్మ వ్యతిరేకిననే సంకేతాన్ని కమ్మేతరులకు బలంగా పంపాడు. తను నిజంగా కమ్మ వ్యతిరేకి అని, తన సమర్థకులైన కమ్మలని సైతం తొక్కేస్తున్నాడని నేననటం లేదు. తను ప్రొజెక్టు చేసుకున్న యిమేజి గురించే చెపుతున్నాను. స్వయంకృషితో, ఐకమత్యంతో, అన్ని రంగాలలో కమ్మలు అతి త్వరగా సాధించిన, సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేనివారికి జగన్ యీ యిమేజి ఊరట నిస్తోంది. పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నా కాపులు పెద్ద సంఖ్యలో వైసిపికి ఓటేయడానికి కారణాలలో యిది కూడా ఒకటి కావచ్చు.
దీనికి ప్రతిగా కమ్మలు ఏకమై, తమ రక్షణకు నడుం బిగిస్తున్నారు. ఎల్లో మీడియాగా ముద్ర పడిన మీడియాలో జగన్ పాలనలో రెడ్లకే సర్వం దక్కుతోందనే కథనాలు వెల్లువెత్తుతున్నాయి. వైయస్‌కు కమ్మద్వేషం లేదని (వైయస్ బతికున్న రోజుల్లో అలా అనలేదు, సాక్షాత్తూ మురళీమోహన్ ‘కమ్మవారు వ్యాపారాలు చేసుకోకూడదా? ప్రభుత్వం కమ్మవారికి అడ్డం తగలడం అన్యాయం’ అంటూ బహిరంగ సభలో మాట్లాడారు), కానీ జగన్‌కు ఉందని పెద్దపెద్ద వ్యాసాలు రాస్తున్నారు. కమ్మరావతి అవుతుందనే భయంతోనే అమరావతి రూపుదాల్చకుండా జగన్ అడ్డుపడుతున్నాడనీ ఆరోపణలున్నాయి. (నిజంగా అమరావతిలో అనేక కులాల వారు పెట్టుబడులు పెట్టారు. అయినా ఆ ప్రాంతం బట్టి, కమ్మవారే దాని గురించి ఎక్కువగా ఆందోళన చెందడం బట్టీ ఆ ముద్ర పడింది).
ఇవన్నీ చూసి జగన్‌ను ఎలాగైనా గద్దె దించాలనే లక్ష్యంతో యావన్మంది కమ్మలు కంకణం కట్టుకున్నారనే నమ్మకం కమ్మేతరులలో స్థిరపడింది. కమ్మలలో ఐకమత్యం ఎక్కువని, కొత్త ప్రాంతానికి లేదా యితర దేశానికి వెళ్లినా తమవారున్న చోట చేరి, కలిసికట్టుగా, అక్కడి పరిస్థితులను తమ నియంత్రణలోకి తెచ్చుకోగల సమర్థులనీ, సమయానికి యితరులతో చేతులు కలిపినా, తమవారు తారసిల్లితే వారికే ప్రాధాన్యత యిస్తారనీ, మోసపోయినా తమవారి చేతిలో మోసపోవడానికే సిద్ధపడతారనీ, కులకట్టుబాట్లకు, కులపెద్ద ఆదేశాలకు లొంగి ప్రవర్తిస్తారనీ, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా తమ కులప్రయోజనాలకు విఘాతం కలిగిన తరుణంలో అందరూ ఏకమౌతారనీ – కమ్మేతరులు సాధారణంగా వ్యక్తం చేసే అభిప్రాయం.
‘మనవాళ్లం మనలో మనం కొట్టుకుఛస్తాం. మనవాణ్ని యితరులు ఏమైనా అన్నా పట్టించుకోం, దులిపేసుకుంటాం. అదే వాళ్ల ఐకాన్ల మీద, వాళ్ల సంస్థల మీద యీగ వాలితే, అందరూ కలిసి ఎదుర్కుంటారు. ఉన్నతస్థానాల్లో ఉన్నవారు కూడా స్థాయీభేదం పక్కన పెట్టి, తమవాడైన సామాన్యుణ్ని చక్రం వేసి కాపాడతారు. వాళ్లకు అనువుగా చరిత్రనే మార్చి రాయగల సమర్థులు వాళ్లు.’ అంటూ వాపోతూ ఉంటారు. వీటిలో నిజానిజాల గురించి నేను తీర్పు చెప్పటం లేదు. వారిలో నెలకొన్న భావాల గురించి నా దృష్టికి వచ్చినది రాస్తున్నాను. చెప్పవచ్చేదేమిటంటే తమకు అన్యాయం జరిగినపుడు కమ్మలు సంఘటితమైనప్పుడల్లా యిలాటి భావాలున్న వాళ్లు ఉలిక్కిపడుతూంటారు. ఇటీవలి కాలంలో ఆంధ్రలో కులస్పృహ ఎక్కువై, సోషల్ మీడియా ఎల్లెడలా కాలుష్యం వెదజల్లుతున్న యీ రోజుల్లో యిది బలమైన రాజకీయ అస్త్రంగా మారింది.
బిజెపి చూడండి, శతాబ్దాలుగా ముస్లిము పేర్లు ఉంటూ వచ్చిన ఊళ్ల పేర్లు మారుస్తోంది. ముస్లిములు అడ్డు చెపితే ‘చూశారా, అందరూ కలిసి ఎలా ప్రతిఘటిస్తున్నారో. మనం కలిసికట్టుగా ఉండి వాళ్ల ఆటలు సాగనీయకూడదు’ అంటుంది. ఇప్పుడు జగన్ అదే తరహాలో ఎన్టీయార్ పేరున్న సంస్థ పేరు మార్చి అగ్గి రాజేశాడు. ఇది అనుచితం అని అభ్యంతరం తెలిపినా, ప్రతిఘటించినా అతను కులరీత్యా కమ్మ అయితే వెంటనే ‘అదిగో, చూశారా, కమ్మవాళ్లందరూ ఏకమయ్యారు, మనం జాగ్రత్తపడే సమయం వచ్చింది’ అని యితరులు ఎలర్ట్ అయ్యే ప్రమాదం ఉంది. అసెంబ్లీలో జగన్ ప్రసంగం వినగానే నేను యిదే భయపడ్డాను. దానికి తగ్గట్టే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. వల్లభనేని వంశీ పునరాలోచించమని జగన్‌ను కోరారు. ఇలా నిరసన తెలిపిన వారందరినీ కులం త్రాసులో తూచే ప్రమాదం తెచ్చిపెట్టాడు జగన్.
నిజానికి ఎన్టీయార్ కమ్మ ఐకానేమీ కాదు. సినిమా హీరోగా ఉన్న రోజుల్లో నలుగురు కమ్మ ప్రముఖ హీరోల్లో ఆయన ఒకడు. రాజకీయాల్లోకి వచ్చినపుడు కూడా ప్రజలు ఆయనను ఉద్ధారకుడిగానే చూశారు తప్ప కమ్మ నాయకుడిగా చూడలేదు. కాంగ్రెసులో ఉన్న కమ్మ రాజకీయ నాయకులకు టిడిపిపై ఆశలేమీ లేవు. అయితే ఒకసారి టిడిపి నెగ్గి, ఎన్టీయార్ తొలి కమ్మ ముఖ్యమంత్రి కావడంతో, కమ్మల్లో చాలామంది ఆయన్ని ఓన్ చేసుకున్నారు. ఎన్టీయార్‌కు ముందూ, వెనకా కూడా కమ్మలు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు. ఎన్టీయార్ రెండు సార్లు వెన్నుపోటుకి గురైంది కమ్మల చేతుల్లోనే! ఎన్టీయార్‌ను పదవి నుంచి దింపేశాక, కమ్మలు బాబుపై కక్ష కట్టలేదు. అందువలన కమ్మలు ఎన్టీయార్ కోసం త్యాగాలు చేశారని చెప్పడానికి లేదు.
ఇప్పుడీ పేరు మార్పు విషయంలో కులాల కతీతంగా సామాన్య ప్రజలు, మేధావులు సమావేశాలు ఏర్పరచి నిరసన ప్రకటనలు చేస్తే ఏమో కానీ, కేవలం కమ్మల వ్యవహారంగా చూస్తే మాత్రం యిబ్బందే. కమ్మప్రముఖులకు యిది కాచ్-22 సిచ్యుయేషన్. ప్రతిఘటించకపోతే కమ్మ సంఘాల నుంచి పోస్టులో గాజులు రావచ్చు. ప్రతిఘటిస్తే తమకు వ్యతిరేకంగా యితర కులాలను సంఘటితం చేసి దీర్ఘకాలంలో ముప్పు తెచ్చుకోవచ్చు. వారిని యిరకాటంలో పెట్టడమే జగన్ రాజకీయవ్యూహమని నా అభిప్రాయం. తన పార్టీలో ముందుగా డిస్కస్ చేస్తే వద్దని వారించే ప్రమాదం ఉందని హఠాత్తుగా బిల్లు ప్రవేశపెట్టి ఉండవచ్చు. తన వ్యూహం యిదీ అని వారితో ఓపెన్‌గా చెప్పే పరిస్థితి లేదు కదా. నా ఆలోచనలు తప్పయితే సహేతుకంగా వ్యతిరేకించండి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2022)