జూ.ఎన్టీఆర్‌పై టీడీపీ గుర్రుగా ఉంది. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై తాము ఆశించినట్టు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పైగా ఎన్టీఆర్, వైఎస్సార్‌లను సమాన స్థాయిలో జూ.ఎన్టీఆర్ గౌరవించడాన్ని కూడా టీడీపీ నేతలు ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.
ఎన్టీఆర్ పేరు తొలగింపుపై జూ.ఎన్టీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. అందులో ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన నాయకులుగా అభివర్ణించడాన్ని చంద్రబాబు, లోకేశ్ అసలు తట్టుకోలేకపోతున్నారు. వారిని మిగిలిన నాయకులు అనుసరిస్తున్నారు. జూ.ఎన్టీఆర్‌ను ఎల్లో మీడియా టార్గెట్ చేస్తోందంటే చంద్రబాబు, లోకేశ్ మనోభవాల్ని అర్థం చేసుకోవచ్చు.
వైఎస్సార్, జగన్‌లను తీవ్రస్థాయిలో జూ.ఎన్టీఆర్ తిట్టాలనేది చంద్రబాబు, లోకేశ్ కోరిక. అలా చేయకపోగా, వైఎస్సార్‌ను విశేష ప్రజాదరణ కలిగిన నాయకుడిగా పేర్కొనడం ఏంటని ఎల్లో చానళ్ల డిబేట్లలో యాంకర్లే ప్రశ్నిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్నిబట్టి జూ.ఎన్టీఆర్‌పై బాగా కోపంగా ఉన్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2009 ఎన్నికల్లో తనను వాడుకుని, ఆ తర్వాత వదిలేసినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు, లోకేశ్ ట్రాప్‌లో పడకుండా, తన పనేదో చేసుకుపోతున్నారు. ఆ మధ్య చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్చినపుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎంతో హుందాగా ట్వీట్ చేశారు. అప్పుడు కూడా ఆయనపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు. మేనత్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, ఇదా స్పందనా? అని ప్రశ్నించడం తెలిసిందే. తాజగా టీడీపీ, ఎల్లో మీడియా వైఖరి ఎలా వున్నా… జూనియర్ ఎన్టీఆర్ పరిణతితో కూడిన ట్వీట్ చేశారనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.