సీఎం జగన్‌పై రాయలసీమ సమాజం రుసరుసలాడుతోంది. కృష్ణా బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని చర్యలు చేపట్టడమే ముఖ్యమంత్రిపై సీమ ఆగ్రహానికి కారణం. కృష్ణా జలాలతో విశాఖకు ఏ మాత్రం సంబంధం లేదు. అలాంటిది హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి తరలించాలని ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు తాజాగా జగన్ ప్రభుత్వం లేఖ రాయడం సీమ సమాజానికి కోపం తెప్పిస్తోంది.
ఏ రకంగా చూసినా కృష్ణా బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయడం సముచితమని రాయలసీమ హక్కుదారులు చెబుతున్నారు. రాయలసీమ ప్రజలు, ఉద్యమకారుల ఆకాంక్షలకు విరుద్ధంగా విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై పునరాలోచన చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
రాయలసీమ మీదుగా కృష్ణా వెళుతుంది. కృష్ణా నదితో విశాఖకు సంబంధం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బాగా తెలుసు. కృష్ణా నది గురించి తెలియక అందుకు సంబంధించిన బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని అనుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. రాయలసీమ వాసుల డిమాండ్ గురించి తెలిసి కూడా గతంలో చంద్రబాబు మాదిరిగానే జగన్ మొండిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
గతంలో చంద్రబాబు హయాంలో విజయవాడలో కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలని లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం దిగిపోయింది. ఇప్పుడు జగన్ వచ్చి, విజయవాడలో కాకుండా విశాఖకు తరలిస్తున్నారు. రాయలసీమ వాసుల డిమాండ్లను మాత్రం పట్టించుకోని ముఖ్యమంత్రిగా జగన్ వ్యతిరేకత మూటకట్టుకుంటున్నారు.