చంద్రబాబునాయుడి మనసంతా కుప్పంపైనే. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుప్పం వెళుతున్నారు. వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ, అలాగే కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కుప్పంలో చంద్రబాబును ఎందుకు ఓడించలేమనే నినాదంతో జగన్ ఎన్నికల వ్యూహం రచించారు. ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో స్థానిక సంస్థలన్నింటిని వైసీపీ సొంతం చేసుకుంది. ఇక మిగిలింది చంద్రబాబును ఓడించడమే.
ప్రస్తుతం జగన్‌తో పాటు వైసీపీ గురి అంతా చంద్రబాబుపైనే వుంది. కుప్పంలో తననెవరూ ఏమీ చేయలేరని చంద్రబాబు పైకి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, ఆయన అంతరంగంలో తీవ్ర భయం నెలకుంది. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలలకు ఒకసారి తనే స్వయంగా కుప్పం వెళ్లి పర్యవేక్షించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరికి కొడుకు లోకేశ్‌ను కూడా నమ్ముకోలేనంతగా, కుప్పం ఆయన్ను భయపెడుతోందన్నది వాస్తవం.
కుప్పంలో చంద్రబాబు హయాంలో కంటే తన పాలనలోనే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించి అక్కడి ప్రజల ఆదరణ చూరగొనాలని జగన్ సంకల్పించారు. ఇందుకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి అడుగులు ముందుకేస్తున్నారు. ఈ నేపథ్యంలో కుప్పంలో జగన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తారో, తన కొంప ముంచుతారనే భయం చంద్రబాబుకు నిద్రలేని రాత్రుల్ని మిగిల్చుతోంది.
అందుకే కుప్పంలో జగన్ పర్యటనపై చంద్రబాబు ఎక్కువ ఆసక్తికనబరచడం. కుప్పంలో స్థానికంగా టీడీపీలో ప్రజాదరణ ఉన్న నాయకుల్ని తన వైపు తిప్పుకుంటారేమో అన్న ఆందోళన చంద్రబాబులో వుంది. చివరికి తనకే కుప్పంలో దిక్కులేని పరిస్థితి తయారైంది. ఈ కఠిన వాస్తవాన్ని ఇటీవల ఆయన పర్యటనే రుజువు చేసింది. కుప్పంలో చంద్రబాబు పర్యటించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.
రానున్న రోజుల్లో ఎలా వుంటుందో అనే ఆందోళనతో కుప్పంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పొచ్చు. ఇంత కాలం కుప్పం మినహా ఇతర నియోజకవర్గాలపై దృష్టి పెట్టిన చంద్రబాబు, ఇప్పుడు సొంత నియోజకవర్గంపై బెంగ పెట్టుకోవాల్సి రావడం నైతికంగా ఓటమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.