సొమ్మొక్కడిది సోకొకడిది అంటున్నారు ఏపీ బీజేపీ పెద్ద సోము వీర్రాజు. మేం డబ్బులు ఇస్తున్నాం, అంతా మా క్రెడిటే అని కూడా హూంకరిస్తున్నారు. లక్షా యాభై వేల కోట్లు ఏపీకి ఇచ్చామని కూడా లెక్కలు చెబుతున్నారు.
అసలు మొత్తం డబ్బు కేంద్రానిదే. అయినా హడావుడి మాత్రం జగన్ సర్కార్ చేస్తోంది అని మండిపడుతున్నారు. నాడు నేడు వంటి పధకాలు మా చలవే అని కూడా సెలవిస్తున్నారు.ఇవన్నీ సరేనని అనుకున్నా కూడా మరి నాడు నేడు లాంటి పధకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలలో ఎందుకు అమలు కావడంలేదో సోము చెప్పగలరా అన్నదే ఇక్కడ ప్రశ్న.
ఇక ఏపీకి ఎంతో చేశామని కానీ ఎవరూ గుర్తించడం లేదని తెగ మధనపడుతున్న సోముకు ఒకే ఒక్క విన్నపం అని కూడా మేధావులు అంటున్నారు. ఏపీ జనం కోరుకునేది ప్రత్యేక హోదా, పోలవరానికి పూర్తి నిధులు. మరి ఆ పనులు పూర్తి చేస్తే బీజేపీని వారు గట్టిగా గుర్తుంచుకుంటారు కదా. ఆ రాజమార్గం వదిలేసి అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే పధకాలను పట్టుకుని అవి మావే అంటూ వీరంగం వేస్తే ప్రయోజనం ఉందా అంటున్నారు.
ఇక కేంద్రం నిధులు ఇస్తోంది అంటున్నారు. కానీ కేంద్రానికి ఆ డబ్బులు ఇచ్చేది కూడా జనం పన్నుల నుంచే కదా. అంటే ప్రజల డబ్బు మళ్ళీ వారికి ఇవ్వడమే కదా. ఈ మాత్రం దానికి ఎవరి ఇంట్లో నుంచో తెచ్చి ఇస్తున్నట్లుగా ఇంత బిల్డప్ ఎందుకు స్వామీ అంటున్నారు జనాలు.
తమ పధకాలకు వైసీపీ పెద్దలు స్టిక్కర్లు అంటించుకుంటున్నారు అని బాధపడే బదులు ప్రత్యేక హోదా అన్న స్టిక్కర్ మీద బీజేపీ పేరు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది కదా సోము సార్.