భవిష్యత్‌లో తన పిల్లల్ని ఇండస్ట్రీలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ పంపించనని బాలీవుడ్ నటి షెర్లిన్‌చోప్రా తెలిపారు. అశ్లీల చిత్రాల కేసులో శిల్పా శెట్టి భర్త , వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నటి షెర్లిన్ చోప్రాను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాదాపు 8 గంటల పాటు విచారించారు. రాజ్‌కుంద్రా ప్రొడక్షన్ హౌస్ గురించి ఆమె నుంచి పోలీసులు వివరాలు రాబట్టారని సమాచారం.
ఇటీవల రాజ్‌కుంద్రాపై షెర్లిన్ ఆరోపణలు సంచలనం సృష్టించిన సంగతిని మరిచిపోకనే, మరోసారి ఆమె విరుచుకుపడ్డారు. ఇటీవల ఆమె… ఓ బిజినెస్ డీల్ కోసం తన ఇంటికి వచ్చిన రాజ్‌కుంద్రా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అమె పేర్కొన్న సంగతి తెలిసిందే. శిల్పాశెట్టితో బంధం సరిగ్గా లేదంటూ తనని బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడంటూ షెర్లిన్‌చోప్రా చేసిన ఆరోపణలు బాలీవుడ్‌ను షేక్ చేశాయి. ఇక ప్రస్తుతానికి వస్తే రాజ్‌కుంద్రా తననెలా మోసం చేశారో మీడియా వేదికగా లోకానికి చెప్పుకొచ్చారు.
రాజ్‌కుంద్రా మాయమాటలు విని తాను మోసపోయానని షెర్లిన్ వాపోయారు. విచారణ అనంతరం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ మనసులోని ఆవేదనను వెల్లడించారు. అసలు ఇలాంటి అభ్యంతరకర సినిమాలకు సంబంధించిన కేసులో ఇరుక్కుంటానని ఎప్పుడూ అనుకోలేదన్నారు.
నిజానికి శిల్పాశెట్టి భర్తను మొదటి సారి కలిసినప్పుడు తన కెరీర్ మలుపు తిరుగు తుందని ఎంతో ఆశించానన్నారు. ఉన్నత స్థితికి చేరుకునేందుకు ఇది తొలి మొట్టు అవుతుందని నమ్మినట్టు షెర్లిన్ తెలి పారు. కానీ అనుకున్నదొకటి అయ్యిందొకటి అనే చందంగా తన జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పు కొచ్చారు.
శిల్పాశెట్టి భర్త తనతో తప్పుడు వ్యవహారాలు చేయించాడని, ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదన్నారు. మొదట గ్లామర్ వీడియోలు చేశామన్నారు. ఆ తర్వాత బోల్డ్ సినిమాలు తీశామన్నారు. గ్లామర్ వీడియోల్లో అశ్లీల చిత్రాలు కూడా భాగమేనని తనను రాజ్‌కుంద్రా నమ్మించాడన్నారు. తన నగ్న చిత్రాల వీడియోలు, ఫొటోలు శిల్పాకు బాగా నచ్చాయని రాజ్‌కుంద్రా అబద్ధాలు చెప్పినట్టు షెర్లిన్ వాపోయారు.
రాజ్‌కుంద్రాను నమ్మడం వల్లే తాను మోసపోయానని షెర్లిన్ వాపోయారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే అని షెర్లిన్ ఘాటు విమర్శలు చేశారు. డబ్బు కోసం ఎదుటివాళ్లను ఎలాంటి ఇబ్బందులైనా కలిగించడానికి వెనుకాడరని ఆరోపించారు. భవిష్యత్‌లో తన పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్ర పరిశ్రమలోకి పంపించనని షెర్లిన్ చోప్రా నిర్వేదంతో కన్నీటి పర్యంతమవుతూ చెప్పారు.