cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

భాజపా..వైకాపా..మధ్యలో పేర్ని నాని

భాజపా..వైకాపా..మధ్యలో పేర్ని నాని

ఈరోజు దినపత్రికల్లో ఓ విశేషం కనిపించింది. వైకాపా మంత్రి పేర్ని నాని మాట్లాడిన మాటలకు ఆ పార్టీ సంబంధిత పత్రిక సాక్షిలో అంతగా ప్రాధాన్యత లభించలేదు. కానీ తెలుగుదేశం అనుకూల మీడియాలో మాత్రం మాంచి ప్లేస్ మెంట్ సంపాదించుకుంది. వైకాపా ప్రభుత్వాన్ని కూల్చాలని, ఎవరైనా కాషాయం కప్పుకున్న వ్యక్తిని సిఎమ్ ను చేయాలని భాజపా కుట్ర చేస్తోందని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఇదే నిజమైతే కచ్చితంగా ప్రాధన్యత గల విషయమే. ఎందుకంటే ఇక్కడ రెండు మూడు విషయాలు వున్నాయి. 

వైకాపాతో సత్సంబంధాలు వున్నాయని భావిస్తున్న భాజపా ఇలా చేయడం అన్నది ఓ పాయింట్. భాజపా పగ్గాలు చేపట్టాలని చూస్తోందన్నది రెండో పాయింట్. అంతకు మించి ఎవరైనా కాషాయం కప్పుకున్న వ్యక్తిని అంటే అన్యాపదేశంగా హిందూ మతవాదిని సిఎమ్ ను చేయాలని చూస్తోంది అన్నది అసలు సిసలు పాయింట్. 

150కి పైగా శాసనసభ్యులున్న పార్టీని అధికారానికి దూరం చేయడం అంత వీజీ కాదు. పోనీ కుట్రపన్నినా, భాజపా మనిషి సిఎమ్ ఎలా అవుతారు. జగన్ కాకుండా మరో నాయకుడు ఎవరైనా వైకాపా నుంచే కదా రావాలి? అసలు భాజపా కుట్ర అంటూ స్టార్ట్ చేస్తే దాన్ని అడ్డుకోగల స్టేజ్ లో జగన్ వున్నారా? ఎందుకంటే జగన్ కేసుల విచారణ నడుస్తోంది. జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ నడుస్తోంది. ఇవి చాలు కేంద్రం తలచుకుంటే జగన్ ను గద్దె దింపేందుకు. దాని కోసం పెద్దగా కుట్ర చేయనక్కరలేదు.

ఇంతకీ తమ మంత్రి మాట్లాడిన మాటలకు సాక్షి పత్రిక ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. యాజమాన్యం నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? అంటే వైకాపా నాయకత్వానికి పేర్ని నాని మాట్లాడిన మాటలు నచ్చలేదా? లేదా ఆ వ్యవహారాన్ని టోన్ డౌన్ చేయాలని చూస్తోందా?

ఆర్ధికంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఇరుకన పెడుతూ వుండొచ్చు. కానీ ఇది కేవలం ఆంధ్ర సమస్య కాదు. అలా అని వైకాపా ప్రభుత్వ సమస్య కాదు. ఎందుకంటే గత తెలుగు దేశం హయాంలోనూ ఇలాగే చేసింది కేంద్రం. ఆ మాటకు వస్తే మోడీ ప్రధాని అయిన దగ్గర నుంచి దాదాపు తొంభై శాతం రాష్ట్రాలన్నింటి విషయంలో ఇలాగే వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఇదేం కొత్త అని అనుకోనక్కరలేదు.

పైగా మనం కోరి మన జుత్తు వేరే వాళ్ల చేతికి ఇచ్చి, పీకుతున్నారోచ్ అంటే ఎలా? రాష్ట్రం అన్నాక ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. మనకు వచ్చేదాన్ని బట్టి మన ఖర్చు వుండాలి. తలకు మించిన తలపాగా ఎప్పుడూ పనికిరాదు. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం అని తెలుసు. కానీ అలవికాని సంక్షేమ కార్యక్రమాలు తలకెత్తుకున్నారు. 

కేంద్రం లిబరల్ గా వుంటే పరిస్థితి వేరు. నిజంగా ఆ పరిస్థితి వుంటే చంద్రబాబే భాజపాతో తెగతెంపులు చేసుకోకుండా వుండేవారు. ఆయన విషయంలో కూడా ఇలాగే వ్యవహరించింది కనుకే, గత ఎన్నికల్లో మోడీ రాకుండా వుండాలని బాబు కిందా మీదా ప్రయత్నించారు. 

ఇలాంటి నేపథ్యంలో కేవలం ఆర్థిక కట్టుబాట్లు కారణంగా భాజపా కుట్ర చేస్తోందనే పెద్ద మాట మంత్రి అనరు కదా? అంతకు మించి ఏదో వుండాలి? వైకాపా సోషల్ మీడియా జనాల మీద సిబిఐ విరుచుకు పడడమా? వివేకా హత్య కేసు పరిశోధనా? ఇంకా ఏమిటి? పేర్ని నాని అంతలా మాటలు విసరడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చను. 

పైగా హిందూవాద సిఎమ్ ను తీసుకువస్తారని అనడం ఏమిటి? భాజపా తన మనిషిని సిఎమ్ చేయాలని చూస్తోంది అనొచ్చు కదా? అంటే ఇలాంటి మాటలు పేర్చడం వెనుక కూడా పేర్ని వ్యూహం ఏదో వుందనుకోవాలి.

అన్నీ బాగానే వున్నాయి. కానీ ఈ వ్యవహారానికి సాక్షి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? అది మరీ భేతాళ పశ్న

ఆర్వీ

చిరంజీవి వర్గం వారి తెలివితక్కువతనమే

పెదరాయుడిని ఎదుర్కోలేని ముఠామేస్త్రీ

 


×