స్టార్ హీరో ఉన్నప్పుడు ప్రయోగాలు చేయలేం. అతడి ఇమేజ్, ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. అదే టైమ్ లో హీరో మనవాడే అనుకున్నప్పుడు కొన్ని ప్రయోగాలు చేయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. త్రివిక్రమ్, రెండో పద్ధతిలో వెళ్లడానికి ట్రై చేస్తున్నాడు. పవన్ కల్యాణ్- సాగర్ చంద్ర సినిమాకు సంబంధించిన మేటర్ ఇది.
ప్రస్తుతం సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు పవన్. త్రివిక్రమ్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. తెరవెనక దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నాడు. ఇప్పటివరకు సినిమాకు పేరు పెట్టకుండానే షూటింగ్ మొత్తం కానిచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇదే ఊపులో మరో ప్రయోగం చేయాలనుకుంటున్నాడట త్రివిక్రమ్. సినిమాకు పేరు పెట్టకుండానే, సాంగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నాడట.
పెద్ద హీరోల సినిమాలేవీ పేరు లేకుండా ఇన్నాళ్లు ఉండలేదు. ఫస్ట్ లుక్ కంటే ముందే టైటిల్ రిలీజ్ చేస్తుంటారు, లేదంటే ఫస్ట్ లుక్ తో పాటే టైటిల్ రివీల్ చేస్తారు. టైటిల్ తోనే సినిమా లాంఛ్ అయిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఈ సినిమాకు మాత్రం పేరు కూడా పెట్టకుండా ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఇప్పుడు ఏకంగా సాంగ్ కూడా విడుదల చేద్దాం అనుకుంటున్నారట.
సాంగ్ రిలీజ్ చేయాలనే నిర్ణయం వెనక రీజన్?
పెద్ద సినిమాలకు సంబంధించి ప్రస్తుతం లిరికల్ వీడియోస్ హంగామా నడుస్తోంది. త్వరలోనే సర్కారువారి పాట సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. ఈ విషయాన్ని తమన్ ఆల్రెడీ బయటపెట్టాడు. ఇక పుష్ప మూవీ నుంచి కూడా సింగిల్ రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇప్పుడు వాటికి పోటీగా పవన్ కల్యాణ్ సినిమా నుంచి సాంగ్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అందుకే ప్రాజెక్టుకు ఇంకా పేరు పెట్టకపోయినా సాంగ్ ను వదిలేయాలనే అనుకుంటున్నారు.
మరి దీనిపై అంతా కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఒక రోజు ముందు టైటిల్ ఎనౌన్స్ చేసి, ఆ వెంటనే సాంగ్ రిలీజ్ చేస్తారా.. లేక నిజంగానే పేరు లేకుండా పాట విడుదల చేసి ప్రయోగం చేస్తారా అనేది చూడాలి. లిరికల్ వీడియో మాత్రం రెడీగా ఉంది.