విడుదలకు ముందు పాటలతో హంగామా చేసిన ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా, రిలీజ్ తర్వాత ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకోలేక, సెకెండాఫ్ బోర్ కొట్టించి ప్రేక్షకుల్ని విసిగించింది. ఇప్పుడీ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ ఒకటి బయటకొచ్చింది.
ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించారు సాయికుమార్. ధర్మ పాత్రలో అక్కడక్కడ కామెడీ చేస్తూ, చివర్లో ఎమోషన్ పండిస్తూ సాయికుమార్ బాగా చేశారు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా సాయికుమార్ ను అనుకోలేదట హీరో కిరణ్. ఆ స్థానంలో మోహన్ బాబును తీసుకోవాలని అనుకున్నాడట.
కథ-స్క్రీన్ ప్లే రాసుకున్నప్పట్నుంచి మోహన్ బాబును దృష్టిలో పెట్టుకొనే రాసుకున్నాడట హీరో కిరణ్. పైగా మోహన్ బాబుది రాయలసీమ కావడంతో తమ సినిమాకు మరింత ప్లస్ అవుతుందని భావించాడట.
ఒకవేళ మోహన్ బాబు ఒప్పుకోకపోతే, రావు రమేష్ ను తీసుకోవాలని అనుకున్నాడట. అయితే దర్శకుడితో పాటు ఇతర టెక్నీషియన్స్ తో కథాచర్చలు జరిపినప్పుడు సాయికుమార్ అయితే కొత్తగా ఉంటుందని అంతా చెప్పారంట. అలా ఈ ప్రాజెక్టులోకి సాయికుమార్ వచ్చారు.
ఈ విషయాన్ని స్వయంగా సాయికుమార్ తోనే చెప్పాడు హీరో కిరణ్. దీనిపై స్పందించిన సాయికుమార్, మోహన్ బాబుకు థ్యాంక్స్ చెప్పారు.