బీజేపీపై మునుపెన్నడూ లేని రీతిలో ఏపీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో పాటు వైసీపీ శ్రేణులు కూడా షాక్ అయ్యేలా ఆ ఆరోపణలున్నాయి. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. అనంతరం సమావేశ వివరాలను మంత్రి నాని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు.
రాష్ట్రంలో 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేశామన్నారు. ఏ తరగతికైనా తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉంటుందన్నారు. నూతన విద్యావిధానంలో స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరించామన్నారు. వాటి వివరాలను వెల్లడించారు. ఈ నెల 24న రూ.10వేల నుంచి 20 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు నగదు పంపిణీ చేస్తామన్నారు.
అభ్యంతరం లేని భూముల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపినట్టు మంత్రి నాని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షలు ఇస్తామన్నారు. పులిచింతల 16వ గేట్ మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల కొట్టుకుపోయినట్లు ప్రాథమిక నిర్థారణ అయ్యిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
సచివాలయాలకు మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు ఉండాలని కేబినెట్ ఆదేశించిందన్నారు. నెలలో 12 రోజులపాటు ఎమ్మెల్యేలు సచివాలయాల సందర్శన చేయాలని సూచించినట్టు ఆయన వెల్లడించారు.
ఎగువ నుంచి వచ్చే ప్రవాహంతో మళ్లీ పులిచింతల ప్రాజెక్టు నిండుతుందని వివరించారు. కృష్ణా డెల్టా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పేర్ని నాని సంచలన ఆరోపణ చేశారు. కాషాయ కండువా కప్పుకున్న వ్యక్తి సీఎం కావాలన్నది బీజేపీ ఆశ అని ఆయన అన్నారు.
టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యే పార్టీలుగా ఆరోపించారు. గతంలో మోదీని తిట్టి ఇప్పుడు ప్రేమ లేఖలు రాస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. పేర్ని నాని ఆరోపణలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని కూలదోస్తుందనే తీవ్ర ఆరోపణలు బీజేపీపై గతంలో ఎన్నడూ వైసీపీ చేయలేదు.
బీజేపీపై ఘాటు ఆరోపణలు చేయడం వెనుక వైసీపీ వద్ద ఉన్న ఆధారాలు ఏంటనే విషయమై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.