జ్యోతిలక్ష్మి సినిమాతో ప్రేక్షకుల దృష్టిలో పడ్డ మంచి నటుడు సత్యదేవ్. బ్లఫ్ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, తిమ్మరసు వంటి సినిమాలతో మంచి హీరో అనే కన్నా మంచి నటుడు అనిపించుకున్నాడు.
అలాంటి సత్యదేవ్ ను ఆ మద్య మెగాస్టార్ చిరంజీవి అభినందించారు కూడా. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ మూవీలో నటించబోతున్నాడు.
మలయాళ చిత్రం లూసిఫర్ రీమేక్ లో మెగాస్టార్ చిరంజీవి, నయనతార ఇప్పటి వరకు ఎంపికైన తారాగణం. ఇంకా ఇద్దరు నటులను ఎంపిక చేయాల్సి వుంది.
పృధ్వీరాజ్, వివేక్ ఓబరాయ్ పాత్రలకు తెలుగు నటులను ఎంపిక చేయాల్సి వుంది. ఇందులో ఒకటైన వివేక్ ఓబరాయ్ పాత్రకు సత్యదేవ్ ను తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.
ఇది ఫక్తు విలన్ పాత్ర. అది కూడా విలక్షణమైన విలనీ. ఈ పాత్రకు సత్యదేవ్ ను మెగాస్టార్ ఎంపిక చేసారు అంటే అతని మీద నమ్మకం ఎంత వుందో అర్థం అవుతుంది.
నిజానికి హీరోగా ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్న టైమ్ లో ఇలా విలనిజం టేకప్ చేయడం అంటే సత్యదేవ్ సరైన రూట్లో వెళ్తున్నట్లే.