అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచబ్యాంకు చేయదలచుకున్న సాయం ఎందుకు ఆగిపోయిందో ఇప్పుడు ప్రజలకు స్పష్టమైంది. కేంద్ర ప్రభుత్వం లేఖ రాయడం వల్ల మాత్రమే ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్లు ప్రపంచబ్యాంకు ప్రకటించింది. అయితే కేంద్రం ఎందుకు వద్దన్నట్లు? ఈ విషయంలో ప్రజలకు సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయడానికి మోడీ సర్కారు ఏపీ ప్రజలకు సంజాయిషీ చెప్పవలసిన అవసరం ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో మోడీ సర్కారు వివక్ష చూపిస్తున్నదనే విషయంలో ఇప్పటికే ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. గుజరాత్ ను ప్రత్యేక ప్రేమతో చూడడం అన్నది వేరే సంగతి. కానీ, ఆంధ్రప్రదేశ్ ను తతిమ్మా రాష్ట్రాలతో సమానంగా కూడా కాకుండా, సవతి బిడ్డలాగా చూడడం మోడీ సర్కారుకు రివాజుగా ఉన్నట్లు ఇక్కడి ప్రజలు అనుమానిస్తున్నారు. మోడీ సర్కారు కూడా తమ ప్రతి చేష్టతోనూ.. ఆ విషయాన్ని మళ్లీ మళ్లీ ధ్రువ పరుస్తోంది.
కేవలం ప్రత్యేకహోదా విషయంలో మాత్రమేకాదు, వాల్తేరు లేని రైల్వే డివిజన్, పోలవరానికి నిధుల విదిలింపు లాంటి అన్ని వ్యవహారాల్లోనూ కేంద్రం మనల్ని తేడాగా చూస్తున్నదనే భావన ప్రజల్లో ఉంది. తాజాగా ఇది కూడా జత కలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీకి ఉన్నది కేవలం ఒకే ఒక్కశాతం ఓటు బ్యాంకు గనుక ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేయాలని.. ఏ రకంగా ఎదగనివ్వకూడదని కేంద్రం కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.
ఘోరమైన సంగతి ఏంటంటే… పార్టీ విస్తరణ, సభ్యత్వ నమోదు వంటి అంశాలకు మాత్రం వారికి ఏపీ కూడా కావాలి. కేంద్ర నాయకులంతా తరలివచ్చి మరీ.. ఇక్కడ పార్టీ విస్తరణకు పాటు పడుతున్నారు. అయితే ఈ రాష్ట్ర ప్రజల సభ్యత్వాలను కోరుకుంటున్న పార్టీ, వారి బాగోగులను మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా ఆ విషయంలో శత్రువుల్లాగా చూస్తోంది.
అందుకే… బడ్జెట్ కేటాయింపులు పరిమితంగా ఉండే సంగతి తర్వాత… అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్న సామెత చందంగా కనీసం ప్రపంచబ్యాంకు ఇచ్చేసాయం కూడా దక్కకుండా ఎందుకిలాంటి సైంధవ పాత్ర పోషిస్తున్నారో మోడీ సర్కారు ఏపీ ప్రజలకు సంజాయిషీ చెప్పవలసిన అవసరం ఉంది.
జగన్ ఐఏఎస్ మీటింగులో 'రిసీట్' అనే బదులు 'రిసీప్ట్' అన్నాడు..