ఆ బాలికకు తల్లిదండ్రులు చెప్పిన చివరి మాటలే టాపర్‌గా నిలిచేలా చేశాయి. నేడు తల్లిదండ్రులు భౌతికంగా లేరు. కానీ వారు చెప్పిన చివరి మాటలు తనలో స్ఫూర్తిని రగిల్చాయని చెబుతోంది. ఆ బాలిక మనసులో చెరగని ముద్ర వేసుకున్న తల్లిదండ్రుల జ్ఞానబోధ ఏంటో తెలుసుకుందాం.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు గత మంగళవారం విడుదలయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10,12 తరగతి పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్స్, యూనిట్ టెస్ట్స్, మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్ పరీక్షలలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయించారు. పరీక్షలు నిర్వహించకుండా సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ప్రకటించడం ఇదే మొదటి సారి.
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన వనిషా పాఠక్ టాపర్‌గా నిలిచింది. కొవిడ్ మహమ్మారి విసిరిన పంజా వనిషా పాఠక్ కుటుం బంలో కల్లోలం రేపింది. సదరు బాలిక తల్లిదండ్రులిద్దరూ గత మే నెలలో మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన అమ్మాయి టాపర్‌గా నిలవడం దేశ వ్యాప్త దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా తన తమ్ముడితో కలిసి వనిషా తాజాగా మీడియా ముందుకొచ్చింది.
చనిపోవడానికి ముందు తనతో తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంది. “బేటా!నీ మీద నమ్మకం ఉంచుకో. ఎన్నడూ ధైర్యం వీడకు” అని తల్లిదండ్రులు చెప్పిన మాటలు తనకు జీవితాంతం స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటాయని పాఠక్ చెప్పడం విశేషం. తల్లిదండ్రుల కడసారి మాటలు విన్న వారెవరికైనా హృదయం బరువెక్కుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఎందుకంటే ఎంతో బలమైన ముద్ర వేయడం వల్లే, ఆ మాటలను మళ్లీమళ్లీ జ్ఞాపకం చేసుకుంటోందని గ్రహించాలి. పిల్లల ఉన్నతికి తల్లిదండ్రులు నిత్యం మంచి మాటలు ఉద్బోధిస్తుంటారు. కానీ వాటిని హృదయానికి తీసుకుని శ్రమించిన వారు చాలా తక్కు వ మంది ఉంటారు. అలాంటి వారిలో వనిషా ఉండడం వల్లే ఈ రోజు ప్రశంసలు అందుకుంటోంది. విద్యార్థులకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది.