ఎవరెన్ని చెప్పినా రాజకీయ పార్టీలకు అంతిమంగా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అం శాన్ని తెరపైకి తేవడం వెనుక రాజకీయ కోణం లేదంటే ఎవరైనా నమ్ముతారా? అభివృద్ధి వికేంద్రీకరణ అనే మాట పైకి చెప్పడానికే తప్ప, మూడు ప్రాంతాల్లో ఓటు బ్యాంకును స్థిర పరచుకునే ఎత్తుగడలో భాగమే అనే అభిప్రాయాలున్నాయి. అందుకే జగన్ ప్రభుత్వం మూడు ప్రాంతాల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకుని తెరపైకి మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను తెచ్చిందనే వాదన లేకపోలేదు.
మరోవైపు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని టీడీపీ బలంగా డిమాండ్ చేయడం వెనుక ఆ పార్టీ ముఖ్య నేతల రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది బహిరంగ రహస్యమే. ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాలు అమరావతితో ముడిపడి లేకపోతే… టీడీపీ ఇంత రాద్ధాంతం చేసి ఉండేది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను ఎంచుకోవడం వల్ల ఉత్తరాంధ్రలో రాజకీయంగా లాభపడొచ్చని వైసీపీ బలంగా నమ్ముతోంది. అనేక కారణాల రీత్యా రాయలసీమలో వైసీపీ బలంగా ఉంది. సీమ, ఉత్తరాంధ్రలో స్థిరమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకుంటే, కోస్తాలో కొన్ని సీట్లు తగ్గినా అధికారాన్ని సుస్థిరం చేసుకోవచ్చని జగన్ ఎత్తుగడ. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ ఉత్తమ ఫలితాలు సాధించింది.
ఒక్క విశాఖ నగరంలో మాత్రం వైసీపీ మరోసారి బోల్తా పడింది. విశాఖ జిల్లా అంతా ఒక ఎత్తైతే, నగరం మాత్రం తన రూటే సపరేట్ అని చెబుతోంది. విశాఖ జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో వైసీపీ 11, టీడీపీ 4 స్థానాల్లో గెలుపొందాయి. టీడీపీ గెలిచిన నాలుగు స్థానాలు కూడా విశాఖ నగర పరిధిలోనే కావడం గమనార్హం. విశాఖ తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం నియోజక వర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు.
ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రధాన అధికార పార్టీ వైసీపీ పాలిట పిడుగుపాటైంది. ఎందుకంటే ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ స్నేహగీతం ఆలపిస్తుండడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాగని మిగిలిన పార్టీలు టీడీపీ, జనసేన పోరాడుతున్నాయని ఎవరూ చెప్పలేరు. కానీ అధికారంలో ఉన్న పార్టీనే మొదటి ముద్దాయి. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా ఢిల్లీ, విశాఖ వేదికలగా వైసీపీ ఆందోళనలు చేస్తోంది. కానీ అంతా మొక్కుబడి వ్యవహారమనే విమర్శలున్నాయి.
విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని 100 శాతం అమ్మేస్తామని, ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మించేందుకు ఏ రాజకీయ పార్టీ ముందుకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వ లెక్కలేని తనంపై పోరాడే దమ్ము, ధైర్యం ఆ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు లేదని జనం గ్రహించారు.
ఇదే 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి తనపై వ్యతిరేకత పెరిగేలా చేస్తుందనే భయం వైసీపీలో లేకపోలేదు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రకటించారనే క్రెడిట్ కంటే, స్టీల్ ప్లాంట్‌ను అడ్డుకోలేక ప్రేక్షక పాత్ర పోషిస్తోందనే వ్యతిరేకతే పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎన్నికల నాటికి ఏ మాత్రం ప్రభావం చూపుతుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.