నెల్లూరు జిల్లాలో మంత్రి, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు కాస్త వైసీపీ పరువు తీసిందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లాలో గత కొంత కాలంగా అధికార పార్టీ నేతల మధ్య అంతర్గతంగా తీవ్రస్థాయిలో నెలకున్న విభేదాలు… మాగుంటపై కేసు నమోదుతో ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ చాలా బలంగా ఉంది. అక్కడ ప్రతిపక్ష పార్టీలు నామమాత్రమే.
దీంతో అధికార పార్టీ తనకు తానే ప్రతిపక్షాన్ని సృష్టించుకుంటోంది. సొంత పార్టీలోనే విపక్షం ఏర్పడడం వైసీపీ శ్రేణుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. సర్వేపల్లి రిజర్వాయర్‌లో అనుమతులకు మించి తవ్వకాలు జరిపారనే కారణాలతో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు మరో ఇద్దరిపై ఎమ్మెల్యే కాకాణి సొంత నియోజకవర్గంలోని వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భారీగా మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు విమర్శలతో పాటు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఎంపీపై క్రిమినల్ కేసు నమోదు కావడం… ప్రతిపక్షాల ఆరోపణలకు బలం కలిగిస్తోంది.
అనుమతులకు మించి తవ్వకాలు జరిపారని, నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన ముగ్గురిపై ఇరిగేషన్ డీఈ, జేఈ వెంకటాచలం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద జూన్ 21న కేసు నమోదు చేశారు. ఇప్పుడది ఆలస్యంగా వెలుగు చూసింది. అధికార పార్టీ ఎంపీపై కేసు నమోదు కావడం చర్చకు దారి తీసింది. మంత్రి అనిల్‌కుమార్, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మధ్య కొంత కాలంగా విభేదాలున్నాయనే టాక్ వినిపిస్తోంది.
దీంతో మంత్రి అనిల్‌కు సంబంధించిన డిపార్ట్‌మెంట్ అధికారుల ఫిర్యాదుతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులు కేసు నమోదు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రమేయం లేకుండా ఏ అక్రమాలు జరగవనే ఉద్దేశంతోనే విచారణకు మంత్రి అనిల్ ఆదేశించారని సర్వేపల్లి ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు. తమ నాయకుడిని కేసులో ఇరికించి బద్నాం చేయాలనే కుట్రలో భాగంగానే విచారణకు ఆదేశించారని అంటున్నారు.
మరోవైపు తన నియోజకవర్గ పరిధిలో కాకాణికి తెలియకుండా ఒక ఎంపీపై కేసు నమోదు చేసే ధైర్యం పోలీస్ అధికారులకు ఉంటుందా? అని మంత్రి అనిల్ అనుచరులు వేస్తున్న ప్రశ్న. అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే పాల్పడుతూ, ఇతరులపై నెట్టి వేస్తున్నారనేది అనిల్ అనుచరుల అభిప్రాయం.
మాగుంటపై కేసు చేయించి పార్టీని వీధినపడేయాలని ఉద్దేశపూర్వకంగా కాకాణి చేయించారని అనిల్ అనుచరులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా మంత్రి అనిల్, కాకాణి మధ్య ఆధిపత్య పోరులో చివరికి అధికార పార్టీ పరువు పోగొట్టుకుందనే అభిప్రాయాలు వైసీపీ శ్రేణుల నుంచే వ్యక్తమవుతున్నాయి.