అస‌మ‌ర్థుడి అధికార యాత్ర‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు 14 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. త‌న పాల‌న‌లో చేసిన గొప్ప ప‌నులేంటో చెప్పి, మ‌రో సారి అధికారాన్ని ఇవ్వాల‌ని అడిగితే స‌బ‌బుగా వుండేది. కానీ ఆ ప‌ని…

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు 14 ఏళ్ల పాటు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేశారు. త‌న పాల‌న‌లో చేసిన గొప్ప ప‌నులేంటో చెప్పి, మ‌రో సారి అధికారాన్ని ఇవ్వాల‌ని అడిగితే స‌బ‌బుగా వుండేది. కానీ ఆ ప‌ని చేయ‌డం లేదు. కేవ‌లం వైఎస్ జ‌గ‌న్‌ను తిడుతూ, మ‌రోసారి అధికారం త‌న‌కు ఇవ్వాల‌ని ఆయ‌న వేడుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే మ‌రోసారి జ‌గ‌న్‌కు అధికారం ఇస్తే ఎవ‌రూ బ‌త‌క‌లేరంటూ బెదిరింపుల‌కు దిగుతున్నారు.

14 ఏళ్ల ప‌రిపాల‌న కాలంలో రైతుల కోసం చేసింది ఏంట‌య్యా అని ప్ర‌శ్నిస్తే… చంద్ర‌బాబు వ‌ద్ద స‌మాధానం లేదు. ఈ ద‌ఫా అధికారం ఇస్తే … రైతును రాజుగా చేస్తాన‌ని భ‌రోసా ఇవ్వ‌డం ఆయ‌న‌కే చెల్లింది. 14 ఏళ్ల అధికారం స‌రిపోలేదా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. బాబుకు అధికార‌మే త‌ప్ప‌, జ‌నం బాధ‌లు ప‌ట్ట‌వ‌నే విమ‌ర్శ వుంది. గ‌త ఐదేళ్ల‌లో ఏం చేశారో చెప్ప‌కుండా, ఇప్పుడు అధికారం ఇస్తే జ‌గ‌న్ ప్ర‌భుత్వం కంటే మిన్న‌గా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తాన‌ని బాబు చెబుతుంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది.

డాక్ట‌ర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా మండ‌పేట మండ‌లంలో నిర్వ‌హించిన వివిధ కార్య‌క్ర‌మాల్లో చంద్ర‌బాబు ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే… “అస‌మ‌ర్థ నాయ‌కుడు సీఎంగా ఉండ‌డం వ‌ల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు. రైతును రాజుగా చేస్తా. నిరుపేద‌ల‌కు న్యాయం చేయ‌డ‌మే నా ఆశ‌, ధ్యాస‌. దాని కోస‌మే ప‌నిచేస్తున్నా. సంప‌ద సృష్టిస్తా. వైసీపీ కంటే మిన్న‌గా సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఇస్తా. ఇప్పుడొచ్చే దాని కంటే రెండుమూడింత‌లు మీకు లాభం చేకూర్చే బాధ్య‌త నాది”

అధికారంలో ఉన్నంత కాలం రాజ‌ధాని పేరుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నార‌నే విమ‌ర్శ ఉంది. ప్ర‌జ‌లు త‌న‌ను ఓడించ‌డానికి కార‌ణాలేంటో విశ్లేషించుకుంటే చంద్ర‌బాబుకు ప‌రిష్కారం దొరుకుతుంది. కానీ ఆ ప‌ని చేయ‌డానికి ఆయ‌న‌కు అహం అడ్డంకిగా మారింది. నిరుపేద‌ల‌కు న్యాయం చేయ‌డం ఆశ‌, ధ్యాసం అంటుంటే… పెద్ద జోక్ అనిపించ‌కుండా వుండ‌దు.

అయితే ఒక్క విష‌యాన్ని మాత్రం ఆయ‌న అంగీక‌రించారు. వైసీపీ పాల‌న‌లో సంక్షేమ ప‌థ‌కాలు బాగా అందుతున్నాయ‌ని ఆయ‌న ప‌రోక్షంగా అయినా అంగీక‌రించారు. వైసీపీ కంటే మిన్న‌గా రెండుమూడింత‌లు లాభం వ‌చ్చేలా సంక్షేమ పాల‌న సాగిస్తాన‌ని, న‌మ్మాల‌ని ఆయ‌న ప్రాథేయ‌ప‌డుతున్నారు. జ‌గ‌న్ సంక్షేమ పాల‌న‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ శ్రీ‌లంక‌, పాకిస్తాన్ త‌దిత‌ర దేశాల మాదిరిగా ఆర్థికంగా దివాళా తీస్తుంద‌ని ప్ర‌చారం చేసిన సంగ‌తిని చంద్ర‌బాబు మ‌రిచిన‌ట్టున్నారు. మ‌రి రెండు మూడింత‌లు ల‌బ్ధి చేకూర్చితే ఏపీకి ఏ గ‌తి ప‌డుతుందో ఆయ‌న చెబితేనే బాగుంటుంది. అధికారంలో ఉన్నంత కాలం చేయ‌ని ప‌నులు, వ‌స్తే మాత్రం ఎలా చేయ‌గ‌ల‌రో ప్ర‌జ‌లు ఆలోచించుకోవాలి.