అసమర్ధ నాయకులకు ఈ భయాలు సహజం!

ఒక స్థాయి అధికారం వెలగబెడుతూ, సారథ్య బాధ్యతలు వహిస్తున్న వారు నూటికి నూరు శాతం అందుకు సమర్థులై ఉండాలి. తాము ఉన్న స్థానానికి తగిన అర్హత వారికి లేకపోయినట్లయితే వారి అంతరంగంలోని గుబులే, భయమే…

ఒక స్థాయి అధికారం వెలగబెడుతూ, సారథ్య బాధ్యతలు వహిస్తున్న వారు నూటికి నూరు శాతం అందుకు సమర్థులై ఉండాలి. తాము ఉన్న స్థానానికి తగిన అర్హత వారికి లేకపోయినట్లయితే వారి అంతరంగంలోని గుబులే, భయమే వారిని కబళించేస్తుంది. 

తమ కింద ఉన్నవారు ఏ పని చేసినా సరే మంచి చెడుల విచక్షణ లేకుండా దాని గురించి భయపడుతూ బతకడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అచ్చం అలాగే ఉంది. మహారాష్ట్ర రాజకీయాలలో తమకంటూ పట్టులేని.. అయినా సరే జాతీయ వ్యాప్త మోడీ వ్యతిరేక కూటమికి సారథ్యం కావాలని.. కోరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అక్కడి తాజా పరిణామాలతో కంగారుపడుతోంది. ఎన్సీపీ రెండు వర్గాల నాయకులు.. రహస్యంగా భేటీ అయ్యారని వార్తలు రాగానే అతిగా స్పందించి ఆందోళనతో కూడిన వ్యాఖ్యలు చేస్తోంది.

ఎన్సీపీ ప్రస్తుతం రెండు ముక్కలుగా విడిపోయి ఉంది. అసలైన ఎన్సీపీ తమదంటే తమదని దానిని స్థాపించిన బాబాయి శరద్ పవార్ మరియు మెజారిటీ నాయకులతో పార్టీని చీల్చి ఆ వర్గాన్ని బిజెపి సారధ్యంలోని ప్రభుత్వంలో కలిపిన అబ్బాయి అజిత్ పవార్ ఇటీవల రహస్యంగా భేటీ అయ్యారని వార్తలు వచ్చాయి. 

ఈ భేటీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిందిగా సీనియర్ శరద్ పవార్ ను అజిత్ కోరినట్లుగా, అందుకు ప్రతిగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయాలను సీనియర్ శరద్ పవార్ ఖండించారు. భారతీయ జనతా పార్టీకి తాము మద్దతు ప్రకటించడం ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

అయినా సరే కాంగ్రెసు పార్టీకి మాత్రం మనశ్శాంతి కలగడం లేదు. వారిలో భయం తొలగడం లేదు. వీరి భేటీ తగదు అని కాంగ్రెసు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వీరి భేటీ ఆందోళనకరం, దీనిని కాంగ్రెస్ ఏ మాత్రం ఆమోదించదు. దీని గురించి అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం అంటూ మహారాష్ట్ర కాంగ్రెసు నాయకులు హెచ్చరిస్తున్నారు. శరద్ పవార్ చాలా స్పష్టంగా తనలోని భాజపా వ్యతిరేకతను బయటపెడుతున్నప్పటికీ.. కాంగ్రెసులో కంగారు తగ్గడం లేదు.

కాంగ్రెసు పార్టీకి ఇం.డి.యా. కూటమికి సారథ్యం వహించే శక్తి, సమర్థత ఉన్నదా? అనేది అనేక మంది సందేహం. దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన పెద్దపార్టీ అనే గుర్తింపు తప్ప.. బలాబలాల పరంగా.. చాలా రాష్ట్రాల్లో ఆ కూటమిలోని ఇతర పార్టీలు కాంగ్రెసు కంటే బలంగానే ఉన్నాయి. 

ఇలాంటి నేపథ్యంలో.. ఏ పార్టీ ఎవరితో మాట్లాడినా.. కాంగ్రెసు పార్టీ భయపడుతూ ఉండడం సహజం అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంటోంది. తమ నాయకత్వ పటిమను పెంచుకుంటే ఇలాంటి భయాలుండవని అందరూ అంటున్నారు.