కేజ్రీవాల్ ను తొక్కేందుకు కాంగ్రెస్ కుట్ర, వ్యూహం!

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, అరవింద్ కేజ్రీవాల్ భారత ప్రధాని రేసులో ఉన్న ప్రతిపక్ష నాయకులలో ఒకరు. ప్రధాని పదవి మీద కన్నేసి దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించే ప్రయత్నాలను…

ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, అరవింద్ కేజ్రీవాల్ భారత ప్రధాని రేసులో ఉన్న ప్రతిపక్ష నాయకులలో ఒకరు. ప్రధాని పదవి మీద కన్నేసి దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించే ప్రయత్నాలను ఆయన సుదీర్ఘకాలంగా చేపడుతున్నారు. బిజెపియేతర విపక్ష పార్టీల కూటమిలో ప్రధాని పదవిని ఆశిస్తున్న కీలక నాయకులు అనేకమంది ఉండగా వారిలో కేజ్రీవాల్ పేరు కూడా తొలి వరుసలోనే ఉంటుంది. 

మమతా బెనర్జీ, శరద్ పవార్ తదితరులతో పాటు కేజ్రీవాల్ కూడా రేసులో ఉన్నారు. అయితే కేజ్రీవాల్ అవకాశాలకు గండి కొట్టడానికి, ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయనకు ప్రధాన బలమైన ఢిల్లీ రాష్ట్రంలో ఇం.డి.యా. కూటమి తరఫున మొత్తం ఏడు ఎంపీ స్థానాలలో తామే పోటీ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించడమే ఇందుకు  నిదర్శనం.

మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో పార్టీ సీనియర్ నాయకులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం అనేది.. ఖచ్చితంగా ప్రధాని రేసులో కేజ్రీవాల్ అవకాశాలకు గండికొట్టడానికే అనే అభిప్రాయం రాజకీయంగా వినిపిస్తోంది. 

ఎందుకంటే.. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో రెండు రాష్ట్రాలు.. ఢిల్లీ, పంజాబ్ ఉన్నాయి. లోక్ సభకు ఢిల్లీలో ఏడు సీట్లుండగా, పంజాబ్ లో 13 స్థానాలున్నాయి. ఈ ఇరవైలో కనీసం 10-15 స్థానాలను ఆప్ గెలుచుకుంటే గనుక.. విపక్ష కూటమి తరఫున రేసులో ఉండడానికి ప్రయత్నించవచ్చు. 

అదే సమయంలో ఢిల్లీలో ఉన్న ఏడు స్థానాల్లోనూ కాంగ్రెస్ తామే పోటీచేయాలని అనడం వల్ల.. కేజ్రీవాల్ అవకాశాలు కుంచించుకుపోతాయి. పంజాబ్ లో ఉన్న 13లో ఎన్ని గెలుస్తారో తెలియదు. ఇలాంటి కుట్రతో ప్రకటనలు చేస్తున్న కాంగ్రెస్ తో తాము ఎందుకు కలిసి నడవాలనే అభిప్రాయం ఆప్ నాయకుల్లో వ్యక్తం అవుతోంది.

ఢిల్లీ అసెంబ్లీ విషయానికి వస్తే.. అక్కడ 70 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో ఆప్ చేతిలో 62 స్థానాలుండగా, మిగిలిన 8 స్థానాలను బిజెపి దక్కించుకుంది. కాంగ్రెసు పార్టీకి ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న ప్రాతినిధ్యం సున్నా. 70 అసెంబ్లీ సీట్లలో ఒక్కటి కూడా గెలవలేని కాంగ్రెసు పార్టీ ఇప్పుడు తగుదునమ్మా అంటూ మొత్తం ఉన్న ఏడు లోక్ సభ సీట్లూ తమకే కావాలని పట్టుపడుతోంది. ఇది అనుచితం, కుట్ర అనే అభిప్రాయమే ఎక్కువమందిలో వినిపిస్తోంది. 

మోడీని గద్దె దించడం సంగతేమో గానీ.. మిత్రపక్షాలను కబళించడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నదా? అనే అభిప్రాయం కూడా పలువురిలో వినిపిస్తోంది.