దేశంలో ప్రతియేటా పది లక్షలకు పైగా జంటలు చట్టబద్ధంగా విడిపోతున్నాయి! ఇది తక్కువ నంబర్ ఏమీ కాదు. విడాకుల చట్టాన్ని వినియోగించుకుంటున్న వారి సంఖ్య పెరిగినట్టుగా ఉంది. ఒకవైపు చాలా మంది పెళ్లి అనే కాన్సెప్ట్ కు దూరం కావడానికి వెనుకాడటం లేదు. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం అంటే.. వారు గత జనరేషన్ మెంటాలిటీతో ఉన్నారనే అనుకోవాలి. అలా లేకపోతే.. పెళ్లి చేసుకున్నా విడిపోవడానికి పెద్ద సమయం పట్టనట్టుగా ఉంది! అందుకే విడాకుల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. మరి ఇండియాలో విడాకులకు ప్రధాన కారణాలు ఏమిటి? అంటే.. ప్రేమ లేమి! అని అంటున్నాయి అధ్యయనాలు!
వినడానికి వింతగానే ఉన్నా.. పెళ్లి తర్వాత దంపతుల మధ్యన ఎలాంటి ఎమోషన్ ఏర్పడకపోవడం, ఒకర్నొరు ప్రేమించుకోలేకపోవడం.. కలిసి ఉండటం వల్ల ఎలాంటి అనుభూతినీ పొందకపోవడం వల్లనే విడాకులకు మొగ్గు చూపుతున్నారట! ఇది ఒక అధ్యయనం చెబుతున్న అంశం. అయితే.. ఇలాంటి రీజన్ భారతదేశంలో కన్నా విదేశాల విషయంలోనే బాగా చెల్లుబాటు అవుతుందేమో!
గ్రామీణ భారతదేశంలో ప్రస్తుత కాలంలో నమోదవుతున్న విడాకుల వ్యవహారాల్లో కూడా కుటుంబ పరమైన కారణాలే ఎక్కువగా ఉంటాయి. పెళ్లికి ముందు పెద్దగా ఆలోచించకుండానో, లేక తొందరపాటుతోనో.. కొన్ని పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు జరుగుతాయి. ఇలాంటి వారిలో విడిపోయే మనస్తత్వం ఉన్న వారు పెద్ద సమయం తీసుకోరు! పెళ్లి అయిన మూడో రోజే అమ్మాయి పుట్టింటికి చేరుకుందని, లేదా ఇద్దరి మధ్యన కాపురం ఎక్కువ సమయం సాగలేదని చెప్పే వారే గ్రామీణ భారతంలో కనిపిస్తారు. పెద్ద కుటుంబం అని, అత్తారింటిలో అమ్మాయి ఉండలేకపోయిందనే రీజన్లు అమ్మాయి తరఫు వారి నుంచి వినిపిస్తూ ఉంటాయి. ఇక అబ్బాయిల తరఫు నుంచి అమ్మాయి తీరు సరిగా లేదని, పెద్దలను పట్టించుకోదని, అహంకారం అని, తమ ఇంటికి రాలేదని.. ఇలాంటి రీజన్లు చెబుతూ వినిపిస్తాయి.
అయితే.. తమ మధ్య ఎమోషనల్ అటాచ్ మెంట్ ఏర్పడలేదని, ప్రేమ కలగలేదనే రీజన్ ను ఎవ్వరూ పెద్దగా చెప్పరు ఇండియాలో! బహుశా సిటీ లైఫ్ స్టైల్లో అయితే ఇలాంటి మాటలేమైనా వినిపిస్తాయేమో! అయితే ఇక్కడ కూడా అడ్జస్ట్ మెంట్ ప్రాబ్లమ్ గురించినే ఎక్కువ మంది మాట్లాడతారు. అమ్మాయి పేజ్ త్రీ లైఫ్ స్టైల్ కావాలనే టైపు అయితే, అబ్బాయిది అందుకు రివర్స్ మెంటాలిటీ కావడం, ఆఫీసు, పని అంటూ ఆమె కోరుకునే లైఫ్ స్టైల్ కు అతడు అనుకూలంగా లేకపోవడం, లేదా పెళ్లికి ముందు ఎఫైర్స్ ను వదులుకోలేకపోవడం వంటి రీజన్లు సిటీ కల్చర్ లో విడాకులకు రీజన్లు అనేమాట వినిపిస్తుంది.
ఇక సెమీ అర్బన్ లో విడాకులకు రీజన్లలో ఎక్స్ ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ కూడా ఉంటున్నాయి. ఎఫైర్స్ కు ఆధారాలు లభించడం, లేదా పూర్తిగా లేచిపోవడం.. పెళ్లి తర్వాత మరొకరితో లేచిపోవడం! ఇలాంటి కేసులు అర్బన్ పోలీసు స్టేషన్లలో చెప్పుకోదగిన స్థాయిలోనే నమోదవుతూ ఉంటాయి.
దేశంలో బెడ్రూమ్ రీజన్స్ తో కూడా కొంత శాతం విడాకులు నమోదవుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సెక్స్ డ్రైవ్ లో మిస్ మ్యాచ్ తో విడాకులను ఆశ్రయించే వారు ఉంటారు. అయితే ఈ రీజన్ చట్టపరంగా చెల్లేదే కానీ, రీజన్ ఇదైనా ఈ రీజన్ ఉంటే వేరే గొడవలు కూడా తయారవుతాయి. అవి విడాకుల దిశగా పయనించవచ్చు!
ఇక విడాకుల విషయంలో మరో ముఖ్యమైన రీజన్ డొమెస్టిక్ వయొలెన్స్. ఫిజికల్ అబ్యూజ్ లేదా మెంటల్ అబ్యూజ్. దీన్ని భరిస్తూ కాపురాలు చేసే వారు భారతదేశంలో కొదవలేదు. అయితే విద్యాధిక సమాజంలో, ఉద్యోగాలు చేస్తూ కూడా దీన్ని భరించే ఓపిక లేని వారు విడాకుల మార్గాన్ని ఎంచుకునేందుకు వెనుకాడటం లేదు.