రాష్ట్రానికి ఏమైనా ఫర్వాలేదు తాము అధిష్టానం భజన చేస్తూ ఉంటే చాలు.. అనే భావన కాంగ్రెస్ నేతల్లో కనిపించేది. అందులో ఏపీ, తెలంగాణ అనే తేడాలు లేవు. ఉమ్మడి ఏపీలో వైఎస్ మరణించాకా రాష్ట్ర విభజన పరిస్థితులు తలెత్తినప్పుడు కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును ఎవ్వరూ మరిచిపోలేదు.
అటు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతలు, ఇటు సీమాంధ్రకి చెందిన కాంగ్రెస్ నేతలు కూడా ప్రజలను వంచించే ప్రకటనలే చేస్తూ వచ్చారు. ప్రజలు ఆశలు, ఆకాంక్షలు ఏవి? అనేది పట్టించుకోకుండా.. వారు వ్యవహరించారు. సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నేతలేమో 'సోనియమ్మ దేవత.. సీమాంధ్రకు ఎలాంటి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయదు, రాష్ట్ర విభజన జరగదు..' అని వాదించారు.
తెలంగాణ నేతలేమో 'సోనియమ్మకు అన్నీ తెలుసు.. ఆమె దేవత' అన్నారు. సోనియానేమో తనకు తోచింది చేసింది. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో దుంపనాశనం అయ్యింది. రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తు అయిపోయింది. అక్కడ ఆ పార్టీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరి అయ్యింది.
ఇక తెలంగాణను ప్రత్యేకరాష్ట్రంగా విభజించి కూడా కాంగ్రెస్ అక్కడ బావుకున్నది ఏమీలేదు! ఉన్నదీ పాయె.. ఇంకోటీ పాయె.. అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. దానికి కారణాలు రెండే.. ప్రజలను మోసం చేసేలా కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరించడం, దానికే స్థానిక నేతలు వంతపాడటం!
ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. భారతీయ జనతా పార్టీ నేతల తీరు కూడా అచ్చం నాటి కాంగ్రెస్ నేతలను గుర్తుచేస్తోంది. ఏపీలో బలోపేతం కావాలని, అయిపోయినట్టుగా కలలు కంటున్న బీజేపీ నేతలు.. ప్రజలను వెర్రివాళ్ల కింద జమకట్టి మాట్లాడుతూ ఉన్నారు. హోదా విషయంలో తాము గతంలో ఏం చెప్పామో ప్రజలు మరిచిపోయారని వారు అనుకుంటున్నారు.
హోదా ఇస్తామని తాము చెప్పి ఇవ్వకపోవడం మోసంకాదట, ఇప్పుడు ఎవరైనా హోదా కావాలని అంటే అది మోసమట! ఇదీ కమలం పార్టీ వీరనేతల ఉవాచ. ఇలా మాట్లాడే అనుకూల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ మొలకెత్తలేని స్థితికి వెళ్లింది. ఇంకా మొలకలే ఎత్తని బీజేపీ వాళ్లు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నది కేవలం తమ ఢిల్లీ పెద్దలను రంజింపచేయడానికి తప్ప మరెందుకూ కాకపోవచ్చు.
కాంగ్రెస్ నేతలు విభజన సమయంలో ద్రోహులుగా నిలిచారు, విభజన తర్వాత బీజేపీలోకి చేరి వాళ్లే అదే ద్రోహుల అవతారం ఎత్తుతున్నారు!
జగన్ ఐఏఎస్ మీటింగులో 'రిసీట్' అనే బదులు 'రిసీప్ట్' అన్నాడు..