వెర్రి జనాలు అని అందుకే అంటారేమో. ఒకసారి మోసం అని తెలిసిన తర్వాత మళ్లీ అదే తరహా మోసానికి బలైపోతుంటారు సామాన్యులు. ఇప్పటికీ ఏదో ఒక చోట చిట్టీల పేరిట మోసం జరుగుతూనే ఉంది. దాన్ని నమ్మక ద్రోహం అనుకోవచ్చు. మరి ఆన్ లైన్ లో ఒకే తరహాలో పదేపదే మోసపోతే దాన్ని ఏమంటారు..? హైదరాబాద్ లో జరిగిన ఓ ఆన్ లైన్ మోసం ఈ ప్రశ్ననే రేకెత్తించింది.
బేగంపేట్ లో కిరణ్ అనే వ్యక్తికి ఫేస్ బుక్ లో రాబర్ట్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. మాటమాట కలిపాడు. అమెరికాలో డాక్టర్ అన్నాడు. ఖరీదైన గిఫ్ట్ పంపిస్తున్నాను తీస్కో అంటూ ఊరించాడు. తర్వాత 2 రోజులకు కస్టమ్స్ అధికారులమంటూ కిరణ్ కు ఫోన్ వచ్చింది.
ఖరీదైన బహుమతులు తెప్పించుకోవడం నిబంధనలకు విరుద్ధమని, కేసు నమోదు చేస్తామని అన్నారు. జరిమానా కడితే కేసు పెట్టమని చెప్పి కిరణ్ తో 9 లక్షల 12 వేల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. తర్వాత ఫోన్ స్విచాఫ్ చేశారు.
ఈ తరహా మోసం హైదరాబాద్ లో చాలా కామన్ అయిపోయింది. శంషాబాద్ విమానాశ్రయంలో మీ కోసం ఖరీదైన బహుమతి ఎదురుచూస్తోందనే ఫోన్ కాల్ తో వారానికొకరు మోసపోతూనే ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయిస్తూనే ఉన్నారు. దీనిపై పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. ఓవైపు ఇంత జరుగుతున్నప్పటికీ, మరోవైపు కిరణ్ లాంటి వ్యక్తులు మోసపోతూనే ఉన్నారు.