మెగా బ్రదర్ నాగబాబు అల్లుడు జొన్నలగడ్డ చైతన్య, ఆయన ఉంటున్న అపార్ట్మెంట్ వాసుల మధ్య గొడవ పోలీసుల ఫిర్యాదు వరకూ వెళ్లింది. దీంతో పరస్పరం బుధవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసుకోవాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే… కోవిడ్ మహమ్మారితో ఇద్దరు ముగ్గురు దగ్గరగా కలవాలన్నా భయపడుతున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు వైద్య నిపుణులతో పాటు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి పదేపదే వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ తమను ఇబ్బందుల పాలు చేస్తున్నారంటూ నటి నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్యపై కొందరు అపార్ట్మెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ నుంచి షేక్‌పేటకు వెళ్లే దారిలో ఓ అపార్ట్మెంట్లో నిహారిక జంట అద్దెకు ప్లాట్ తీసుకుంది. తమ వృత్తికి సంబంధించి పనులకు ఈ ప్లాట్‌ను ఉపయోగించుకుంటున్నట్టు సమాచారం.
కానీ జీహెచ్ఎంసీ నిబంధనలు ఉల్లంఘిస్తూ రెసిడెన్షియల్ సొసైటీలో వ్యాపార పనులకు ప్లాట్‌ను వాడుతున్నారని, అలాగే కోవిడ్ నిబంధనలు బేఖాతరు చేస్తూ గుంపులు గుంపులుగా ఫ్లాట్‌లోకి వస్తుండడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని అపార్ట్మెంట్ వాసులందరూ బుధవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదే సమయంలో తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్మెంట్ వాసుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. జొన్నలగడ్డ చైతన్య మెగా బ్రదర్స్ అల్లుడు కావడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.