బడా సినిమాల నిర్మాతలకు తమ సినిమా కాస్త అటుఇటు లేట్ అయినా తట్టుకోలగలరు. వడ్డీలు కట్టే స్తోమత వాళ్లకు ఉంటుంది. సొంత డబ్బుతో సినిమా తీసే నిర్మాతైతే ఇంకొన్నాళ్లు ఆగగలడు. కానీ ఫైనాన్స్ చేసి చిన్న సినిమాలు తీసే నిర్మాతల కష్టాలు మాత్రం వర్ణనాతీతం.
ఓవైపు తెచ్చిన డబ్బుకు వడ్డీ పెరిగిపోతుంటుంది.. మరోవైపు మార్కెట్ సమస్యలు.. ఇంకోవైపు సినిమా రిలీజ్ అవ్వదు. ఇన్ని కష్టాల మధ్య తమ సినిమాను ఎలాగోలా వదిలించుకోవాలని, భారం దించుకోవాలని చూస్తుంటారు ప్రొడ్యూసర్లు. ప్రస్తుతం థియేటర్లలోకి వస్తున్న సినిమాలన్నీ ఇలాంటివే.
గత వారం 5 సినిమాలొచ్చాయి. ఓవైపు ఏపీలో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరుచుకోనప్పటికీ.. టిక్కెట్ రేట్లు పెరగనప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి పెద్దగా మొగ్గుచూపనప్పటికీ ఆ 5 సినిమాలు వచ్చేశాయి. వీటిలో నరసింహపురం, త్రయం అనే 2 సినిమాల నిర్మాతలు 8 నెలలుగా వడ్డీలు కడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అటు తిమ్మరుసు సినిమాను కూడా నష్టానికే థియేటర్లలో రిలీజ్ చేశారు.
ఇక ఈ వారం ఏకంగా 6 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఎస్ఆర్ కల్యాణమండపం అనే సినిమాకు ఇప్పటికే బడ్జెట్ తడిసిమోపెడైంది. కిరణ్ అబ్బవరంకు కేవలం రెండో సినిమా ఇది. అయినప్పటికీ కొత్త దర్శకుడు నిర్మాతలతో 5 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయించాడు. శంకర్ పిక్చర్స్ వారు ఈ సినిమా వరల్డ్ వైడ్ రైట్స్ తీసుకున్నప్పటికీ నిర్మాతకు పెద్దగా మిగల్లేదు. ఇక రేపు థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా అంతోఇంతో బ్రేక్ ఈవెన్ అయితేనే అంతా ఒడ్డున పడతారు.
ఎస్ఆర్ కల్యాణ మండపంతో పాటు వస్తున్న ముగ్గురు మొనగాళ్లు, మెరిసే మెరిసే, మ్యాడ్, క్షీరసాగర మధనం సినిమాల పరిస్థితి సేమ్. ఎలాగోలా థియేటర్లలో ఈ సినిమాను వదిలేస్తే, ఆ వెంటనే అమెజాన్ ప్రైమ్ లేదా ఆహాకు ఇచ్చేసి ఉన్నంతలో ఒడ్డున పడొచ్చనేది వీళ్ల ఆలోచన. శాటిలైట్ సంగతి దేవుడెరుగు.
ఈ మొత్తం లిస్ట్ లో జాక్ పాట్ కొట్టిన సినిమా ఏదైనా ఉందంటే అది ఇప్పుడుకాక ఇంకెప్పుడు మాత్రమే. కోస్తాకు చెందిన వ్యాపారవేత్త గోపి ఈ సినిమా నిర్మించాడు. ఆయన పెద్దగా ఖర్చుచేసిందేం లేదు. సినిమా లేట్ అవ్వడం వల్ల ఆయనకొచ్చిన నష్టం కూడా పెద్దగా లేదు. అంతలోనే ఈ సినిమాను కోటి 20 లక్షలకు జీ గ్రూప్ కొనేసింది.
అలా రిలీజ్ కు ముందే తను పెట్టిన పెట్టుబడికి 30 శాతం అదనంగా అందుకున్నాడు గోపి. ఇక థియేట్రికల్ రిలీజ్ అనేది ఆయనకు బోనస్ అన్నమాట.