వైసీపీలో ‘వలస’ కష్టాలు

ప్రతిపక్షంలో కూర్చుని ఐదేళ్ల పాటు పోరాటం చేయడానికి ఎవరూ ఇష్టపడని రోజులివి. ఏ పార్టీలో గెలిచినా, చివరకు అధికార పార్టీలో చేరి, ఐదేళ్ల పాటు ఆ రాచమర్యాదలు స్వీకరించడానికే నాయకులు ఇష్టపడుతున్నారు. ఇలాంటి వలస…

ప్రతిపక్షంలో కూర్చుని ఐదేళ్ల పాటు పోరాటం చేయడానికి ఎవరూ ఇష్టపడని రోజులివి. ఏ పార్టీలో గెలిచినా, చివరకు అధికార పార్టీలో చేరి, ఐదేళ్ల పాటు ఆ రాచమర్యాదలు స్వీకరించడానికే నాయకులు ఇష్టపడుతున్నారు. ఇలాంటి వలస నాయకులు చంద్రబాబు హయాంలో ఓ వెలుగు వెలిగారు. 

ఏకంగా వైసీపీ నుంచి 23మంది ఎమ్మెల్యేలు అప్పట్లో టీడీపీ వైపు వెళ్లారు. వారిలో కొంతమందికి మంత్రి పదవులిచ్చి మరీ పెద్దపీట వేశారు చంద్రబాబు. మొదటినుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారికి ద్రోహం చేసి మరీ, వలస నాయకులకు న్యాయం చేశారు బాబు. ఆ విషయంలో ఆయనపై ఇప్పటికీ వలసనాయకులకు సదభిప్రాయమే ఉంది. అయితే ఆ తర్వాత 2019లో టీడీపీ టికెట్ పై పోటీచేసిన వలస బ్యాచ్ అంతా మూకుమ్మడిగా ఓడిపోవడం విశేషం.

జగన్ ఏం చేస్తున్నారు..?

వలస నాయకుల విషయంలో వైసీపీ హయాం అత్యంత గడ్డుకాలంగా చెప్పుకోవాలి. పార్టీకీ, పదవులకు రాజీనామా చేసి వస్తేనే వైసీపీ కండువా కప్పుతానన్నారు జగన్. దీంతో చాలామందిలో ఆశ ఉన్నా నలుగురు మాత్రమే ధైర్యం చేయగలిగారు. 

వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్.. వీరు  మాత్రమే జగన్ కి జై కొట్టారు. వీరితో పాటు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా ఈ గట్టుకు వచ్చేశారు. మరి వచ్చాక పరిస్థితి ఏంటి, ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్న వీరికి అధికార పార్టీకి అనుబంధంగా మారిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉందా అనేది ప్రశ్నార్థకమే.

స్థానికంగా పట్టులేదు, జగన్ దగ్గర పలుకుబడి లేదు..

స్థానికంగా ఆ నలుగురు టీడీపీ టు వైసీపీ వలస ఎమ్మెల్యేలకు పరిస్థితులు ఏమంత బాగా లేవు. దాదాపుగా అందరికీ నియోజకవర్గ ఇన్ చార్జిలతో గొడవలున్నాయి. ఎక్కడా క్యాడర్ కలసిపోలేదు. దీంతో స్థానిక ఎన్నికల సమయంలోనే వీరంతా తమ మాట నెగ్గించుకోలేకపోయారు. దీంతో అటు వైసీపీలో ఇమడలేక, మరోసారి బయటకు రాలేక ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. 

సొంత పార్టీ ఎమ్మెల్యేలకే సీఎం అపాయింట్ మెంట్ కష్టం. అలాంటిది వలస నాయకులు ఆశలు వదిలేసుకుని నియోజకవర్గాలకే పరిమితం అయ్యారు. వైసీపీ అని చెప్పుకోలేక, టీడీపీ ముద్ర తొలగిపోక అవస్థలు పడుతున్నారు.

ఐదేళ్లలో పరిస్థితి తారుమారు

టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరిన ఎమ్మెల్సీలతో పోల్చుకుంటే ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది. గతంలో వైసీపీ నుంచి వచ్చినవారికి టీడీపీలో రాచమర్యాదలు జరిగాయి. కానీ ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీ వైపుకి వెళ్లినవారికి మాత్రం అంత ప్రాధాన్యం దక్కడం లేదు. ఈ విషయంలో జగన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. 

అఖండ మెజారిటీ చేతిలో పెట్టుకొని, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యం ఇస్తే జగన్ కు, చంద్రబాబుకు తేడా ఏముంటుంది.