జీవో రాసిన తీరుపై హైకోర్టు ఆశ్చ‌ర్యం

కేసీఆర్ స‌ర్కార్ జీవో రాసిన తీరుపై తెలంగాణ హైకోర్టు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల కోసం రూ.58 కోట్ల ప్ర‌భుత్వ సొమ్మును విడుద‌ల చేయ‌డంపై హైకోర్టు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన…

కేసీఆర్ స‌ర్కార్ జీవో రాసిన తీరుపై తెలంగాణ హైకోర్టు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల కోసం రూ.58 కోట్ల ప్ర‌భుత్వ సొమ్మును విడుద‌ల చేయ‌డంపై హైకోర్టు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై విచార‌ణ‌లో భాగంగా గురువారం తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ హైకోర్టుకు హాజ‌ర‌య్యారు.

రూ.58 కోట్ల ప్ర‌జాధ‌నాన్ని కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల‌కు విడుద‌ల చేయ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న త‌ప్పును స‌రిదిద్దుకునే ప్ర‌య‌త్నం చేసింది. ఆ నిధులు కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల కోసం ఎంత మాత్రం కాద‌ని, ఆ కేసుల్లో భూసేక‌ర‌ణ చెల్లింపున‌కు అని సీఎస్ త‌ర‌పున అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ (ఏజీ) ప్ర‌సాద్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, కోర్టును పిటిషిన‌ర్ త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని చెప్పుకొచ్చారు.

సీఎస్ వివ‌ర‌ణ‌తో హైకోర్టు సంతృప్తి వ్య‌క్తం చేయ‌లేదు. పైగా ఒకింత ఆశ్చ‌ర్యానికి గురైంది. ఎందుకంటే జీవోలో స్ప‌ష్టంగా కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల కోస‌మే అని ఉందని స‌మాచారం. నిధులు విడుద‌ల చేయొద్ద‌న్న ఆదేశాల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని కోర్టును సీఎస్ కోరారు.

కానీ జీవో రాసిన తీరు… సీఎస్ చెప్పిన‌ట్టుగా లేక‌పోవ‌డంపై హైకోర్టు విస్మ‌యం వ్య‌క్తం చేసింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ ఉద్దేశం ఏమిటి? కాగితంపై రాసిందేంటని గ‌ట్టిగా నిల‌దీసింది. ధిక్కరణ కేసుల ఖర్చుల కోసమే అన్నట్లుగానే జీవోలో ఉంద‌ని మ‌రోసారి కోర్టు గుర్తు చేసింది. 

మాట‌ల‌కు, చేత‌ల‌కు పొంత‌న లేక‌పోవ‌డంతో … జీవో ఎలా రాశారో న్యాయశాఖ చూడాలి కదా అని హిత‌వు చెప్పింది. దీంతో సీఎస్ కోరుకున్న‌ట్టుగా ఈ రోజుకు హైకోర్టులో త‌న‌కు అనుకూల నిర్ణ‌యం వెలువ‌డ‌లేదు.