మనుగడ కోసం పోరాటం.. గుర్తింపు కోసం ఆరాటం

తెలుగుదేశం పార్టీలో మహిళా నేతల ప్రస్తుత పరిస్థితి ఇది. ఓవైపు వైసీపీలో మహిళా నేతలకు ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తుంటే, ఇటు టీడీపీలో మహిళా నేతలు గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారు. పార్టీలో తమ…

తెలుగుదేశం పార్టీలో మహిళా నేతల ప్రస్తుత పరిస్థితి ఇది. ఓవైపు వైసీపీలో మహిళా నేతలకు ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యం ఇస్తుంటే, ఇటు టీడీపీలో మహిళా నేతలు గుర్తింపు కోసం ఆరాటపడుతున్నారు. పార్టీలో తమ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. ఇంత చేసినా వాళ్లకు కలిసొస్తుందనే గ్యారెంటీ లేదు. చంద్రబాబు వాళ్ల వైపు కన్నెత్తి కూడా చూడరు.

తెలుగు మహిళకు గుర్తింపు ఉందా..?

ప్రస్తుతం రాజకీయాల్లో నోరున్నోళ్లదే రాజ్యం. పురుషులైనా, మహిళలనైనా ఇదే రూల్. ఈ క్రమంలో తెలుగుదేశంలో వాయిస్ ఉన్న మహిళా నేతలు అరుదు అనే చెప్పాలి. ఇక్క వాయిస్ అంటే పెద్ద గొంతుతో వైరి పక్షాలపై పడిపోవడం కాదు. నిశితంగా విమర్శలు చేయడం, సునిశితంగా పాయింట్ చెప్పడం. 

వంగలపూడి అనిత కేవలం హడావిడి తప్పితే ఇంకే మీ లేదు. జిల్లాల్లో మహిళా గర్జనల పేరుతో సభలు పెట్టి స్థానిక నేతలపై విమర్శలతో విరుచుకుపడే అనిత, ముఖ్యమంత్రిని సైతం లెక్కలేకుండా మాట్లాడి వార్తల్లోకెక్కింది. కానీ బాధ్యతాయుతమైన రాజకీయ నాయకురాలిగా అనితకు అంత సీన్ లేదనే చెప్పాలి.

అనిత నీడలో ఎగదలేకపోయిన టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణిదీ అదే పరిస్థితి. ఏకంగా దివ్యవాణి మహానాడులో తనకు జరిగిన అవమానాన్ని ఏకరువు పెట్టింది. రాజీనామా డ్రామా ఆడింది కానీ అది రక్తికట్టలేదు. టీడీపీలో ఎప్పటికైనా తనకు పదవి దక్కదని, తనని అవమానించి బయటకు పంపుతారనే విషయంలో దివ్యవాణికి క్లారిటీ ఉంది. అందుకే ముందుగా ఇలా ఓ జర్క్ ఇచ్చింది. గ్రీష్మ లాంటి వారసురాళ్లు టీడీపీలో చాలామందే ఉన్నా..  తొడలుకొట్టే అలవాటు ఉన్నవారు అరుదు. ఇప్పుడు ఆ ముచ్చట కూడా మహానాడు వేదికగా తీరిపోవడంతో.. మిగతావాళ్లు కూడా అదే మార్గాన్ని ఎంచుకునే అవకాశముంది.

విచిత్రం ఏంటంటే.. టీడీపీ గెలుచుకున్న 23 ఎమ్మెల్యే స్థానాల్లో ఒక మహిళ ఉన్నా.. ఆమెకు సరైన గుర్తింపు లేదు. మాజీ మంత్రులు, సీనియర్లు, ఢక్కామొక్కీలు తిన్నవారు.. చాలామంది 2019 ఎన్నికల్లో ఓడిపోగా.. ఆదిరెడ్డి భవానీ అదృష్టవశాత్తు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. మిగతావాళ్లు పక్కకు వెళ్లిపోయినా ఆమె మాత్రం పార్టీలోనే ఉన్నారు. కానీ ఆమెకు కూడా సరైన గుర్తింపు లేదు. ఓడిపోయిన మగ నాయకులకు ఉన్న గుర్తింపు కూడా, గెలిచిన మహిళకు ఇవ్వకపోవడం చంద్రబాబు రాజకీయం.

మరోవైపు వైసీపీలో మహిళా నాయకులకు పెద్దపీట వేస్తున్నారు జగన్. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినవారికి కూడా మంత్రి పదవులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. మహిళలకు ఒకటి కాదు, రెండుసార్లు హోం మంత్రి పదవి ఇచ్చారు. దీంతో సహజంగానే టీడీపీలో ఉన్నవారికి కడుపు తరుక్కుపోతోంది. కనీసం పార్టీ మారితే అయినా గుర్తింపు వస్తుందని వారు ఆశపడుతున్నారు. 

టీడీపీలో ఉండలేక, బయటకు రాలేక సతమతం అవుతున్నారు. 2024 ఎన్నికలనాటికి టీడీపీలో ఉన్న ఆ కొద్ది మహిళా నేతలు కూడా కనుమరుగవుతారనడంలో అతిశయోక్తి లేదు.